డీఎంఎఫ్‌టీ పనులకు మోక్షం

ABN , First Publish Date - 2022-01-17T05:02:45+05:30 IST

డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌ (డీఎంఎఫ్‌టీ) ద్వారా ఏడాది క్రితం మంజూరు చేసిన పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత పదిహేను రోజులుగా పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో సీసీ రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి.

డీఎంఎఫ్‌టీ పనులకు మోక్షం
పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్‌కు ఎదురు వీధిలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులు

- ఏడాది తర్వాత పెద్దపల్లి మున్సిపాలిటీలో ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం
- రూ. 6.24 కోట్లతో 97 రోడ్ల పనులకు శ్రీకారం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌ (డీఎంఎఫ్‌టీ) ద్వారా ఏడాది క్రితం మంజూరు చేసిన పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత పదిహేను  రోజులుగా పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో సీసీ రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో గల ఖనిజ వనరుల ద్వారా కోట్ల రూపాయల సీనరేజీ పన్ను డీఎంఎఫ్‌టీకి జమ అవుతున్నది. ఇప్పటి వరకు సుమారు 700 కోట్లకు పైగా నిధులు సమకూరగా, ఈ నిధులతో 2018 ఎన్నికలకు ముందు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను పనులు మంజూరు చేశారు.

పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో..
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 298 పనులు చేపట్టేం దుకు 52 కోట్ల 27 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇందులో సీసీ రోడ్లు, మురికి కాలవలు, కమ్యూనిటీ హాళ్లు, మినీ ఫంక్షన్‌ హాళ్లు, స్వశక్తి మహిళా సంఘాల భవనాలతో పాటు వివిధ రకాల పనులను మంజూరు చేశారు. వాటికి టెండర్లు కూడా నిర్వహించారు. 87 వరకు మహిళా సంఘాల భవనాలు, జనరల్‌ కమ్యూనిటీ భవనాలకు 9 కోట్ల 58 లక్షల 64 వేల రూపాయలు మంజూరు చేశారు. ఇందులో పలు పనులను ఆరంభించగా, మరికొన్ని పనులను ఆరంభించక పోవడంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి 2020 సెప్టెంబర్‌ నెలలో రద్దు చేయించారు. అందులో 6 కోట్ల 23 లక్షల 87 వేల 600 రూపాయల అంచనా వ్యయంతో పెద్దపల్లి మున్సిపల్‌ పరిఽధిలోని వివిధ వాడల్లో 97 సీసీ రోడ్ల నిర్మాణాలకు గాను మంజూరు చేయించారు. అయితే స్వశక్తి సంఘాల భవనాల పనులు, కమ్యూనిటీ హాళ్ల పనులను ఆరంభించిన తర్వాత ఆ పనులను రద్దు చేయించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆరంభమైన పనులను మాత్రం మళ్లీ పునరుద్ధరించారు. పెద్దపల్లి పట్టణానికి మళ్లించిన డీఎంఎఫ్‌టీ నిధులతో పనులు చేపట్టేందుకు టెండర్లను పిలవడంతో తీవ్ర జాప్యం జరిగింది. 2019లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలకు ముందు పెద్దపల్లి పట్టణంలో టీయూఎఫ్‌డీఐసీ ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే కొన్ని వీధుల్లో నిధుల మంజూరు లేకుండానే ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి హార్డ్‌ మిక్స్‌ వేయించారు. కానీ సీసీ రోడ్లు వేయలేదు. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ రోడ్లను మున్సిపల్‌ నిధులతో పూర్తి చేయాలని భావించారు. ఆ నిధులు సరిపోక పోవడంతో డీఎంఎఫ్‌టీ నిధులతో మళ్లించి పనులు మంజూరు చేశారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
ఈ క్రమంలో ఎన్నికలకు ముందు పోసిన హార్డ్‌ మిక్స్‌కు సంబంధించి పనుల అంచనాల్లో చేర్చవద్దని ప్రతిపక్ష పార్టీలు ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పనుల టెండర్లలో అధికారులు జాప్యం చేశారు. ఎట్టకేలకూ పనులు మంజూరైన తర్వాత ఏడాది కాలానికి పెద్దపల్లి పట్టణంలో గతంలోనే మొదలు పెట్టిన సీసీ రోడ్లకు మోక్షం లభించింది. పదిహేను రోజుల నుంచి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇవేగాకుండా 2017లో పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టేం దుకు గాను రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులను టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా విడుదల చేశారు. అందులో 6 కోట్లు, మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్‌ 2 కోట్లతో మరికొన్ని సీసీ రోడ్ల పనులను చేపట్టారు. సుమారు 14 కోట్ల పై చిలుకు నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులు నెల రోజుల్లో పూర్తి కావస్తాయని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి తెలిపారు.

Updated Date - 2022-01-17T05:02:45+05:30 IST