నాలుగంకెల జీతం వదిలి రాజకీయాల్లోకి.. క్లాస్‌ టు మాస్‌..

ABN , First Publish Date - 2020-12-08T13:02:28+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేసిన హేమ 2015లో గూగుల్‌లో చేరారు. 2016లో యూఎస్‌ వెళ్లటానికి

నాలుగంకెల జీతం వదిలి రాజకీయాల్లోకి.. క్లాస్‌ టు మాస్‌..

‘‘టీఆర్‌ఎస్‌లో ఎంతో మంది సీనియర్లు ఉండగా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే ఈ అమ్మాయికి టికెట్‌ ఎలా ఇస్తారు..? రాజకీయ అవగాహన లేకుండా ఇంత చిన్న వయసులో ప్రజా సమస్యలను పరిష్కరించగలదా..?’’.. ఇదీ సామల హేమకు తొలిసారి కార్పొరేటర్‌ టికెట్‌ ఇచ్చినప్పుడు ఆ డివిజన్‌లో జరిగిన చర్చ. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కార్పొరేటర్‌గా గెలుపొందిన తొలిసారే.. డివిజన్‌ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలూ పొందారు. తాజా ఎన్నికల్లో రెండోసారి తన స్థానం పదిలం చేసుకున్నారు సీతాఫల్‌మండి డివిజన్‌ కార్పొరేటర్‌ సామల హేమ. నాలుగంకెల జీతంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా రాణిస్తూ.. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో హేమ రాజకీయ అరంగేట్రం ఆసక్తిగా జరిగింది.


హైదరాబాద్/బౌద్ధనగర్‌ : సికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌మండికి చెందిన సామల రాజు (అలియాస్‌ కరాటే రాజు), జ్యోతి దంపతుల కుమార్తె సామల హేమ ప్రసుత్తం ఉస్మానియావర్సిటీలో కామర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 2013-15 వరకు జన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేసిన హేమ 2015లో గూగుల్‌లో చేరారు. 2016లో యూఎస్‌ వెళ్లటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. సికింద్రాబాద్‌ నియోజకర్గంలోని అన్ని డివిజన్‌లు మహిళలకు రిజర్వు అయ్యాయి.


అటు క్లాస్ ఇటు మాస్..

అప్పటి మంత్రి, ప్రసుత్త డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ సామల హేమకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీతాఫల్‌మండి నుంచి అవకాశం కల్పించారు. దీంతో 23 ఏళ్ల యువతి రాజకీయాల్లో రాణించగలదా? అని అప్పట్లో పలువురు ప్రశ్నించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు యూఎస్‌ వెళ్లే ఆలోచనకు విరామం ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచారు. 16 వేల ఓట్ల మెజారిటీతో సీతాఫల్‌మండి కార్పొరేటర్‌గా తొలి విజయం సాధించారు. ప్రజల్లో తిరుగుతూ, అధికారుల సమావేశాల్లో పాల్గొంటూ ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను అందరినీ ఆకట్టుకుంటూ రెండో సారి కూడా నెగ్గి రాజకీయాల్లో రాణిస్తున్నారు హేమ. 




అందుబాటులో ఉంటా..

 ‘‘సీతాఫల్‌మండి డివిజన్‌లో నేను చేసిన అభివృద్ధే తాజా ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా నన్ను గెలిపించింది. సీతాఫల్‌మండిలో ఆసుపత్రి  పునఃనిర్మాణం కోసం రూ. 4 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే వీటి పనులను మొదలు పెడతాం. ఆధునిక హంగులతో ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి వచ్చింది. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాను’’ అని సామల హేమ ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - 2020-12-08T13:02:28+05:30 IST