24న శశికళ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2021-02-21T14:32:41+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఈనెల 24న పార్టీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. జయ జయంతి సందర్భంగా తొలిసారిగా ఆమె నేతలతో సమావేశం కానున్నారు. అక్రమార్జన కేసులో నాలుగేళ్ల...
పార్టీ ప్రముఖులతో భేటీ కానున్న చిన్నమ్మ
చెన్నై (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఈనెల 24న పార్టీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. జయ జయంతి సందర్భంగా తొలిసారిగా ఆమె నేతలతో సమావేశం కానున్నారు. అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించి చెన్నై నగరానికి తిరిగొచ్చిన శశికళ టి.నగర్‌లోని వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియకు చెందిన నివాసగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వైద్య నిపుణులు పది రోజులపాటు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. ఆ మేరకు శశికళ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ తరచూ ఆమెను కలుసుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేకుండా నిర్వహించిన అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం చెల్లదని, పార్టీ నిబంధనల ప్రకారంలో సమన్వయకర్త, ఉప సమన్వయకర్త, డిప్యూటీ సమన్వయకర్తలంటూ ఎలాంటి పదవుల ప్రస్తావనే లేదని ఆరోపిస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లు చెన్నై సిటీ సివిల్ కోర్టులో మార్చి 25న విచారణకు రానున్నాయి. ఆ కేసు విషయమై ప్రస్తుతం శశికళ న్యాయనిపుణులతోనూ, తన తరఫు న్యాయవాదులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న జయలలిత జయంతి సందర్భంగా టి. నగర్ నివాసగృహంలో ఆమె చిత్రపటానికి శశికళ నివాళులర్పించే కార్యక్రమాన్ని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేతలు చేపడుతున్నారు. అదే సమయంలో పార్టీ ప్రముఖులు, తనకు తొలి నుండి మద్దతు ఇస్తున్న మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులతో ఆమె సమావేశమవుతున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత తన భవిష్యత్ రాజకీయ వ్యూహరచనలకు సంబంధించి ఆమె కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నెల 24న మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి సందర్శనకు ప్రజలను అనుమతిస్తే శశికళ ఆ సమాధివద్దకు వెళ్ళి నివాళులర్పిస్తారని తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం ఆమె నగరంలోని ప్రముఖ ఆలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.
మద్దతిస్తే ఓపీఎస్‌ను స్వాగతిస్తా: దినకరన్
ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం తమ నాయకురాలు శశికళకు మద్దతు ప్రకటిస్తే ఆయనను సాదరంగా స్వాగతిస్తానని అమ్మామక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. శనివారం ఉదయం శశికళను కలుసుకున్న అనంతరం దినకరన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను భరతుడిలాంటివాడినని పత్రికలలో ప్రకటనలు జారీ చేస్తున్న పన్నీర్‌సెల్వం ప్రస్తుతం రావణాసురుడి కొలువులో వుంటున్నారని, వాస్తవానికి జయ మృతి తర్వాత పన్నీర్‌సెల్వం శశికళకు భరతుడిలాగే వ్యవహరించారన్నారు. ఆమె సీఎం పదవిని చేపట్టలేరని తెలిసేంతవరకూ ఆయన ఆ విధంగానే ప్రవర్తించి వుంటే ఈపాటికి ముఖ్యమంత్రిగా వుండేవారని అన్నారు. ప్రస్తుతం పన్నీర్‌సెల్వం మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు తెలుస్తోందని, ఇకనైనా మనసు మార్చుకుని శశికళకు మద్దతు ప్రకటిస్తే స్వాగతిస్తానని దినకరన్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన కూటమిని ఏర్పాటు చేసుకుని తమ పార్టీ బరిలోకి దిగుతుందని ఆయన చెప్పారు.