చెప్పింది చెయ్‌

ABN , First Publish Date - 2021-10-14T06:15:43+05:30 IST

ప్రభుత్వ అధికారుల తీరు చెప్పిందొకటి, చేయించేదొకటిలా మారింది. దీంతో ప్రభుత్వ అవసరాల కోసం అద్దెకు వాహనాలు ఇచ్చిన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెప్పింది చెయ్‌

 ఇష్టారీతిన ఆర్‌బీఎస్‌కే   కాంట్రాక్టు  వాహనాల వినియోగం
 ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల బెదిరింపు
 2016 ఒప్పందం మేరకే అద్దె చెల్లింపులు
 రెండింతలకు పైగా పెరిగిన డీజిల్‌ ధర
 ఉమ్మడి జిల్లాలో 33 వాహనాలు

కోదాడ, అక్టోబరు 13 :
ప్రభుత్వ అధికారుల తీరు చెప్పిందొకటి, చేయించేదొకటిలా మారింది. దీంతో ప్రభుత్వ అవసరాల కోసం అద్దెకు వాహనాలు ఇచ్చిన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదీ రాషీ్ట్రయ బాల స్వస్తీయ కార్యక్రమం(ఆర్‌బీఎ్‌సకే) పరిధిలోని కాంట్రాక్టు వాహన యజమానుల దీనగాథ. అధికారుల తీరుతో వాహనాలు నడపలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను కాంట్రాక్టు చేసుకునే సమయంలో పాఠశాలకు హెల్త్‌సిబ్బందిని తీసుకువెళ్లాలని చెప్పినా; అధికారుల సొంత అవసరాలకు, వైద్య, ఆరోగ్య శాఖ ఇతర అవసరాలకు వాహనాలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2016 జూన్‌లో ఆర్‌బీఎ్‌సకే పథకాన్ని  ప్రవేశపెట్టింది. పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు, మెరుగైన వైద్యసేవలు అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. దీని అమలుకు ఇద్దరు వైద్యులు, ఒక ఫార్మసిస్టు, ఏఎన్‌ఎంను నియమించింది. వారు ఆయా మండల పరిధిలోని పాఠశాలలకు రొటేషన పద్ధతిలో వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వైద్యసిబ్బందిని పాఠశాలలకు తీసుకెళ్లేందుకు కాంట్రాక్టు పద్ధతిలో వాహనాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అద్దెకు  తీసుకుంది. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 33 వాహనాలను ఆర్‌బీఎ్‌సకే పథకం కింద పనిచేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి వాహనం నెలలో 1600 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.21 వేలు చెల్లిస్తారు. ఏ లక్ష్యం కోసం వాహనాలను తీసుకున్నారో వాటికి కాకుండా అధికారులు సొంత పనులకు వినియోగిస్తున్నారని యజమానులు వాపోతున్నారు. మొదట చెప్పిన 1600 కిలోమీటర్లు కాదని, 2500 కిలోమీటర్లు తిరగాలని హుకుం జారీ చేస్తున్నారు. అంతేకాకుండా డిపార్ట్‌మెంట్‌ మందులు తెచ్చేందుకు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు వాహనాలను వినియోగిస్తున్నారు. ఎవరైనా వాహన యజమానులు ప్రశ్నిస్తే మీ ఒప్పందం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు.
ఆ ఒక్క నిబంధనను చూపి...
ఆర్‌బీఎ్‌సకే పథక వాహనాల్లో వైద్యసిబ్బందిని జిల్లా కేంద్రంలో జరిగే సమావేశానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వారిచ్చే మందులను మండల కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ఒక్క నిబంధనను ఆసరా చేసుకొని ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు ఇష్టం వచ్చినట్లు వాహనాలను వాడుతున్నారు. కరోనా మందులకు, గ్రామాలకు పంపిణీకి వాడారు. అయినా ఇందుకోసం డీజిల్‌ ఖర్చు కూడా ఇవ్వలేదని సమాచారం.
ఎప్పుడు పిలుస్తారో తెలియదు
ఆర్‌బీఎ్‌సకే కాంట్రాక్టు వాహనాల్లో సిబ్బందిని, మందులను తీసుకొని పాఠశాలకు బయలుదేరితే, మధ్యలోనే జిల్లా ఆస్పత్రికి రావాలంటూ ఉన్నతాధికారుల నుంచి పిలుపు వస్తుంది. వీలు కాదంటే నీ వాహనం పనికిరాదని నివేదిక ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో పాఠశాలకు సిబ్బందిని తీసుకెళ్లడం వదిలేసి తిరుగు ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో వాహనదారులు సతమతం అవుతున్నారు.
ఎనిమిది నెలలైనా బిల్లుల్లేవు
మండలంతో పాటు ఇతర ప్రాంతాలకు వాహనాలను వినియోగిస్తున్నా, సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు. ఏడు, ఎనిమిది నెలల నుంచి వాహనదారులకు బిల్లులు చెల్లించడం లేదు.దీంతో వాహనాలను నడపటానికి అప్పులు తెచ్చి, అవస్థలు పడాల్సి వస్తోందని యజమానులు వాపోతున్నారు.
పెరిగిన ధరలతో ఇక్కట్లు..
ఆర్‌బీఎ్‌సకే పథకం కింద వాహన ఒప్పంద సమయంలో డీజిల్‌ ధర రూ.45ఉండగా, ప్రస్తుతం రూ.101కి చేరింది. అయినా అప్పటి ఒప్పందం మేరకే అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వ వాహన కాంట్రాక్టు దొరికిందని సంబరపడ్డ యజమానులకు ప్రస్తుత డీజిల్‌ ధర తలకుమించిన భారంగా మారింది. దీనికితోడు అధికారుల ఒత్తిడులను తట్టుకోలేకపోతున్నామని యజమానులు తెలిపారు. ఒత్తిడి లేకుండా ప్రస్తుత ధరలకు అనుగుణంగా అద్దె చెల్లించేలా, మండల పరిధిలో వాహనాలను తిప్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
2400 కిలోమీటర్లు తిరగాల్సిందే
ఆర్‌బీఎ్‌సకే అగ్రిమెంట్‌ ప్రకారం ప్రతి వాహనం నెలలో 2400 కిలోమీటర్లు తిరగాల్సిందే. అందులో ఒత్తిడి ఏమీలేదు. విద్యార్థులకు అవసరమైన వ్యాక్సిన, మందులు తీసుకెళ్లడానికి జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో వందశాతం వ్యాక్సిన ప్రక్రియను పూర్తి చేసేందుకు, అన్ని మండల కేంద్రాల్లోని వాహనాలను ప్రభుత్వం హైదరాబాద్‌కు పిలిపించింది. ఏ అధికారి తమ సొంత పనులకు వాహనాలను ఉపయోగించుకోవటం లేదు. అటువంటి ఫిర్యా దులు మా దృష్టికి రాలేదు. బిల్లులు బడ్జెట్‌ను బట్టి మంజూ రవుతాయి. రాగానే చెల్లిస్తాం. 
 ఫ కోటా చలం, డీఎంహెచవో, సూర్యాపేట

Updated Date - 2021-10-14T06:15:43+05:30 IST