మహారాష్ట్ర సరిహద్దును మూసేయండి.. స్వతంత్ర ఎమ్మెల్యే డిమాండ్..

ABN , First Publish Date - 2020-05-26T02:34:41+05:30 IST

కొవిడ్-19 బారిన పడిన ఇతర ప్రాంతాల వారిని రాష్ట్రంలోకి అనుమతించడం వల్ల గోవాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని ..

మహారాష్ట్ర  సరిహద్దును మూసేయండి.. స్వతంత్ర ఎమ్మెల్యే డిమాండ్..

పనాజీ: కొవిడ్-19 బారిన పడిన ఇతర ప్రాంతాల వారిని రాష్ట్రంలోకి అనుమతించడం వల్ల గోవాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖుంటే పేర్కొన్నారు. దీనివల్లే గోవా ఇప్పుడు గ్రీన్ జోన్ నుంచి రెడ్‌జోన్‌గా మారుతోందని ఆయన ఆరోపించారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి బయటి వారిని అనుమతించడంపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రభుత్వాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్లే గత నెలలో గ్రీన్ జోన్‌గా ఉన్న గోవా ఇప్పుడు రెడ్ జోన్‌గా మారుతోందన్నారు. ముందు ముందు ఈ మహమ్మారి మరింత ప్రబలకుండా ముఖ్యమంత్రి సావంత్ పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘ మనం మహారాష్ట్ర సరిహద్దును తక్షణమే మూసేయాలి. ఆ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగాయి. అక్కడి నుంచి చాలామంది రాష్ట్రంలో ప్రవేశిస్తున్నారు...’’ అని సదరు మాజీ రెవెన్యూ మంత్రి పేర్కొన్నారు. గోవా ప్రజలు రూ.2 వేలు చెల్లించి కరోనా పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్‌లోకి వెళ్తుండగా..  ఇతర ప్రాంతాల వారిని మాత్రం నామమాత్రంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేయించి ఎందుకు వదిలేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గోవాలో ప్రస్తుతం 66 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. 

Updated Date - 2020-05-26T02:34:41+05:30 IST