దగ్గితే హడల్‌.. జ్వరమొస్తే కుదేల్‌..!

ABN , First Publish Date - 2020-07-25T18:21:39+05:30 IST

కొవిడ్‌ ఉనికి జిల్లాలో తొలిసారి కనిపించినప్పుడు ప్రజలు కొంత ఆందోళన పడినా తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా సీరియస్‌గా తీసుకోలేదు. మాస్క్‌ లేకపోయినా

దగ్గితే హడల్‌..  జ్వరమొస్తే కుదేల్‌..!

అనారోగ్య సమస్యలతో ఆందోళన చెందుతున్న ప్రజలు

సంజీవని బస్సుల వద్ద కొవిడ్‌ పరీక్షల కోసం భారీఎత్తున క్యూలైన్లు

రద్దీ తట్టుకోలేక.. విశ్రాంతి లేక వైద్యులు, టెక్నీషియన్ల గగ్గోలు 

వెంటిలేటర్ల కొరత.. కొవిడ్‌ బాధితులు, ఆస్తమా రోగుల విలవిల


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ ఉనికి జిల్లాలో తొలిసారి కనిపించినప్పుడు ప్రజలు కొంత ఆందోళన పడినా తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా సీరియస్‌గా తీసుకోలేదు. మాస్క్‌ లేకపోయినా, భౌతికదూరం పాటించకపోయినా ఇది విజృంభిస్తుందని అధికారులు నెత్తీనోరూ కొట్టుకున్నా పెడచెవిన పెట్టారు. ఫలితం ఇప్పుడు బాగా తెలిసి వస్తోంది. రాష్ట్రంలోనే ఇప్పుడు మన జిల్లా కొవిడ్‌ వ్యాప్తిలో మొదటి స్థానంలోకి చేరింది. ప్రతి ఊరిలోనూ రోజూ ఏదొక కేసు బయటపడుతోంది. దీంతో జిల్లావాసుల్లో వణుకు పుడుతోంది. ‘చెడపకురా చెడేవు’ అనే సామెతను మనోళ్లు తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. జనం స్వయంకృతాపరాధం వల్ల నష్టం జరిగిపోయింది. వందల నుంచి వేలల్లోకి బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఇందుకు కారణం ఎవరు, ఎందుకు, ఏంటీ అనేది అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడానికి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉంది. ఇప్పుడసలే వర్షాకాలం. వ్యాధుల సీజన్‌. 


వాతావరణ మార్పులతో ఇప్పటికే చాలామంది జలుబు, జ్వరం బారిన పడుతున్నారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దగ్గితే అంతా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు రహస్యంగా ఇంట్లో ఉండిపోతుంటే, చాలామంది కాస్త సుస్తీ చేస్తే చాలా అనుమానంతో పరీక్షల కోసం క్యూకడుతున్నారు. నిన్న మొన్నటిదాకా కొవిడ్‌ పరీక్షలు ఎలా చేయించుకోవాలో తెలియని వారంతా ‘సంజీవిని’ బస్సుల వద్ద పరీక్షలు చేస్తున్నారన్న సమాచారంతో పెద్దఎత్తున చేరుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వారంతా ఇక్కడే కొవిడ్‌ టెస్టు కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. దీంతో అటు జనం రద్దీ తట్టుకోలేక , ఇటు విశ్రాంతి లేక వైద్యులు, టెక్నీషియన్లు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి వందల సంఖ్యలో కిట్‌లతో ఈ సిబ్బంది వస్తున్నా, పరీక్షల కోసం వచ్చే వేలాది మందిని పరీక్షలు చేసే కిట్‌లు ఉండడం లేదు. దాంతో కిట్‌లు లేవంటూ చేతులెత్తేస్తున్నారు. అయినా సరే ఎవరూ అక్కడ నుంచి కదలడం లేదు. సాధారణ జలుబు, జ్వరం రోగులు కూడా ఇక్క డకు క్యూకట్టడంతో ఆ ఒత్తిడిని అధిగమించలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పరీక్షల కోసం జనం క్యూ కడుతున్నారు. ఇక్కడ కూడా అందరికీ పరీక్షలు చేసే ఏర్పాట్లు ఉండడం లేదు.


వెంటిలేటర్లు నిల్‌

ప్రస్తుత సీజన్‌లో ఉబ్బసం, ఛాతీ వ్యాధులున్న వారికి శ్వాస ఆడదు. ఎక్కువగా 3 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికల్లో శ్వాసకోశ సంబంధిత రుగ్మతలున్నాయి. ఇందుకు ఉపశమనంగా బాధితులు నెబిలైజర్‌ వాడాలి. దాని ఖరీదు వేలల్లోనే ఉంటుంది. పేద కుటుంబాల్లో ఈ వ్యాధి బాధితులందరూ ఇప్పుడు కాకినాడ జీజీహెచ్‌కు వస్తున్నారు. కానీ ఇక్కడ కు వస్తున్న కొందరు నెబిలైజర్ల స్టేజీ దాటి వెంటిలేటర్లు ఉంటేనే గాని గట్టెక్కని పరిస్థితి నెలకొంది. కానీ వీరికి వెంటిలేటర్‌ సదుపాయం లభించడం లేదు. ఇక చికిత్సపొందుతున్న కొవిడ్‌ బాధితులకు కూడా వెంటిలేటర్లు అందడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. రాజమహేంద్రవరంలో గురువారం మృతి చెందిన టీవీ జర్నలిస్టుకు సకాలంలో వెంటిలేటర్‌ సదుపాయం అందలేదని, ఆ క్రమంలోనే మరణించాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీజన్‌లో కొవిడ్‌ బాధితులకు వెంటిలేటర్లు అందు బాటులో ఉంటే తేలిగ్గా ఈ ఉపద్రవం నుంచి బయటపడగలరు. జిల్లాకు వెంటిలేటర్ల కొనుగోలు ప్రతిపాదన ఉన్నా అది కార్యాచరణకు రావాల్సి ఉంది.

Updated Date - 2020-07-25T18:21:39+05:30 IST