రెండో దశలో పెరిగిన రిస్క్‌

ABN , First Publish Date - 2021-04-28T17:50:30+05:30 IST

‘‘కరోనా మొదటి, రెండో దశలో కూడా గుండె జబ్బు బాధితులపైనే ఎక్కువ ప్రభావం ఉంటోంది. వారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి’’ అని పీఆర్‌కే కార్డియాక్‌ సెంటర్‌ చీఫ్‌ ఇంటర్‌వెన్షల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ శివప్రసాద్‌ వివరించారు. కొవిడ్‌ సమయంలో గుండెపోటుతో చనిపోయే వారు ఎక్కువగా ఉంటున్నారని ఆయన వివరించారు. ఆయనతో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ విశేషాలు..

రెండో దశలో పెరిగిన రిస్క్‌

గుండె జబ్బు బాధితులు జాగ్రత్త 

చీఫ్‌ ఇంటర్‌వెన్షల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ శివప్రసాద్‌


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా మొదటి, రెండో దశలో కూడా గుండె జబ్బు బాధితులపైనే ఎక్కువ ప్రభావం ఉంటోంది. వారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి’’ అని పీఆర్‌కే కార్డియాక్‌ సెంటర్‌ చీఫ్‌ ఇంటర్‌వెన్షల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ శివప్రసాద్‌ వివరించారు. కొవిడ్‌ సమయంలో గుండెపోటుతో చనిపోయే వారు ఎక్కువగా ఉంటున్నారని ఆయన వివరించారు. ఆయనతో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ విశేషాలు..


ప్రశ్న : గుండె జబ్బుల వారిపై కొవిడ్‌ తీవ్రత ఎంత ఉంది?

జవాబు : కొవిడ్‌తో గుండెపై ప్రభావం పెరుగుతుంది. ఆ సమయంలో గుండె పోటు, గుండె వైఫల్యం కేసులు అధికంగా ఉంటున్నాయి. ఇంతకు ముందు రిస్క్‌ ఉన్న వారికే హార్ట్‌ అటాక్‌ వచ్చేది. ఇప్పుడు రిస్క్‌ లేని వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. 


ప్ర : రిస్కు లేని వారికి కూడా గుండెపోటుకు కారణాలు?

జ : కొవిడ్‌ వల్ల రక్తం కొద్దిగా చిక్కబడి, రక్తనాళాలలో అడ్డంకులు (బ్లాక్‌) అవుతున్నాయి. ఇది హార్ట్‌ అటాక్‌కు దారి తీస్తోంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్న వారిలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. 


ప్ర : మొదటి, రెండో దశలలో తేడా ఏంటి? 

జ : రెండో దశలో కరోనా బారిన పడ్డ బాధితుల్లో గుండె జబ్బుల తీవ్రత పెరుగుతోంది. రెండో దశలో కేసులు పెరుగుతున్నాయి. నెల రోజులుగా నేను 80 మంది కొవిడ్‌ రోగులకు చికిత్సలు అందిస్తే అందులో అయిదుగురు గుండెపోటుతో చనిపోయారు. 


ప్ర : ఏ వయస్సు వారికి ఎక్కువగా గుండెపోటు వస్తోంది. 

జ : ఈ సారి యువతలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు చూస్తున్నాం. 40 ఏళ్ల లోపు వారు ఎక్కువ మంది ఉంటున్నారు. కొందరు 20, 25 ఏళ్ల వారు కూడా ఉన్నారు. గతేడాది ఈ స్థాయిలో కేసులు లేవు. ఇతర జబ్బులు ఉంటే ముప్పు ఎక్కువగా ఉంటోంది. 


ప్ర : గుండె పోటు సమస్యలు పెరగడానికి కారణాలు

జ :  చాలా మందిలో శారీరక వ్యాయామం తగ్గిపోయింది. అలాంటి వారికి ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగి రిస్కు ఎక్కువగా ఉంటోంది. గుండెపోటు వచ్చిన తర్వాత కొందరు ఆస్పత్రికి రావడం ఆలస్యం చేస్తున్నారు. చాలా మంది యువత తమకు ఏం కాదులే అనే నిర్లప్ల ధోరణిలో ఉంటున్నారు. ఇదే ప్రాణాలకు ముప్పు తెస్తోంది. 


ప్ర : ఆస్పత్రికి ఎప్పుడు రావాలి

జ : కొవిడ్‌తో బాధపడుతున్న వారు చాతీలో నొప్పి అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలి. నిర్లక్ష్యం వ్యవహరిస్తే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. చాతీలో నొప్పి ఉంటే వెంటనే ఈసీజీ చేయించాలి. అందులో సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఆస్పత్రికి రాలేని వారు ఈసీజీ తర్వాత వీడియో కన్సల్టెన్సీ ద్వారా సలహాలు తీసుకోవాలి. 


ప్ర : ఎవరిలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ ఎక్కువగా ఉంటుంది

జ : కొందరు కొవిడ్‌ రోగుల్లో గుండె వైఫల్యం (హార్ట్‌ ఫెయిల్యూర్‌) చెందుతోంది. యువతలో కూడా ఇది కనిపిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు, నలుగురు ఈ తరహా బాధితులకు చికిత్సలు అందిస్తున్నాను. వారికి ఇంతకు ముందు గుండె సంబంధిత సమస్యలు లేవు. కానీ ఇప్పుడు గుండె బలహీనంగా అయింది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మయో కార్డియాటిక్‌ వస్తుంది. దీని ద్వారా గుండె కండరాలు బాగా  బలహీనంగా తయారవుతాయి. 


ప్ర :  గుండె బలహీనానికి కారణాలు

జ : వైరస్‌, బ్యాక్టీరియా, ఫ్లూ ఏదైనా ప్రధానంగా గుండెపైనే ప్రభావం ఉంటుంది. వైరస్‌ వల్ల చాలా మంది ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అనుకుంటారు. కానీ గుండె కండరాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 


ప్ర :  కొవిడ్‌ ఉన్న వారు గుండెకు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి

జ : కొవిడ్‌ బాధితులకు ఆయాసం ఉంటే స్టెరాయిడ్స్‌ ఇచ్చినప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్ష చేయించాలి. దాని ద్వారా తీవ్రతను పసిగట్టవచ్చు. గుండె బలహీనతను గుర్తించి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. 


ప్ర : గుండె బలహీనంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి.?

జ : హృదయ స్పందనలలో తేడా ఉంటాయి. దీనిని  వెంట్రిక్యులర్‌ అరిథ్మియాగా వ్యవహరిస్తాం. ఈ సమయంలో గుండె స్పందనలు 180 ఉంటే కిందపడిపోతారు. ఆకస్మిక కార్డియాక్‌ మరణానికి దారి తీయవచ్చు. గుండె స్పందనలలో తేడా ఉంటే శారీరక వ్యాయామాలు చేయకూడదు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన తర్వాత మూడు నాలుగు వారాల పాటు వ్యాయామానికి దూరంగా ఉండాలి. 


ప్ర : రిస్కును ఎలా తగ్గించుకోవాలి?

జ : కొవిడ్‌ సమయంలో గుండె సంబంధిత బాధితులు వైద్యులు సూచించిన మందులను తప్పనిసరిగా వాడాలి. 60 ఏళ్లు ఉన్న వారు బరువును నియంత్రణలో పె ట్టుకోవాలి. బీపీ, షుగర్‌, ఇతర జబ్బులకు మందులు కంటిన్యూ చేయాలి. తరచూ శారీరక శ్రమ చేస్తుండాలి. మానసిక ఒత్తిడికి గురి కావద్దు. 


ప్ర : మందులు వేసుకునే వారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

జ : వ్యాక్సిన్‌ చాలా అవసరం. రక్తం పల్చబడే మందులు వేసుకునే వారు కూడా టీకా తీసుకోవచ్చు. వ్యాక్సిన్‌ సమయంలో మందులు ఆపొద్దు. నోవాక్స్‌, సిట్రోమ్‌ మందులు వినియోగించే వారు వైద్యుల సలహా ప్రకారం ఆపి టీకా తీసుకోవాల్సి ఉంటుంది. స్టంట్‌ వేసుకున్న వారు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు. ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవద్దు. 



Updated Date - 2021-04-28T17:50:30+05:30 IST