సెకండ్‌ వేవ్‌.. తీవ్రత తక్కువే

ABN , First Publish Date - 2020-10-11T07:03:18+05:30 IST

ఇటీవల ఎక్కడచూసినా కరోనా సెకండ్‌ వేవ్‌ గురించే ఆందోళన. యూరప్‌ దేశాల్లో మనకన్నా ముందే లాక్‌డౌన్‌ను సడలించడంతో కేసుల సంఖ్య పెరిగింది. అయితే, గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనట్టుగా చెబుతున్న యూరప్‌ దేశాల్లో కేసులు, మరణాలు మార్చిలో ఉన్నంత ఉధృతంగా నమోదు కావట్లేదు...

సెకండ్‌ వేవ్‌.. తీవ్రత తక్కువే

  • ఐరోపా దేశాల్లో కేసులు పెరిగినా తక్కువగానే మరణాల రేటు
  • యూకేలో మార్చి, ఏప్రిల్‌తో పోలిస్తే కేసుల సంఖ్య చాలా ఎక్కువ
  • మరణాల సంఖ్య అత్యల్పం.. మనదేశంలోనూ అదే పరిస్థితి 
  • కరోనాపై పెరిగిన అవగాహన.. చికిత్సపై వైద్యుల స్పష్టత
  • బయటపడే దిశగా ప్రపంచం.. భయపడొద్దు: వైద్య నిపుణులు

సెకండ్‌ వేవ్‌.. యూరప్‌లో మరోసారి జడలు విప్పుతున్న కరోనా.. ఐరోపాలోని పత్రికల్లో గత కొద్దిరోజులుగా వస్తున్న కథనాల సారమిది!

పాఠశాలలు, థియేటర్లు తెరిచాక ఏపీలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి..

తెలంగాణలో డిసెంబరు చివర్లో వైరస్‌ మరోసారి విజృంభించనుంది.. తాజా అధ్యయనంలో వెల్లడైన విషయమిది!!

ఈ చలికాలంలో ఢిల్లీలో రోజుకు 15 వేల కొత్త కరోనా కేసులు నమోదవుతాయి తస్మాత్‌ జాగ్రత్త.. అని వీకే పాల్‌ నేతృత్వంలోని కొవిడ్‌-19 నిపుణుల కమిటీ తాజాగా హెచ్చరించింది.



ఇటీవల ఎక్కడచూసినా కరోనా సెకండ్‌ వేవ్‌ గురించే ఆందోళన. యూరప్‌ దేశాల్లో మనకన్నా ముందే లాక్‌డౌన్‌ను సడలించడంతో కేసుల సంఖ్య పెరిగింది. అయితే, గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనట్టుగా చెబుతున్న యూరప్‌ దేశాల్లో కేసులు, మరణాలు మార్చిలో ఉన్నంత ఉధృతంగా నమోదు కావట్లేదు! ఉదాహరణకు తొలి దశలో యూకేలో కరోనా కేసుల సంఖ్య ఏప్రిల్‌ 10కి పతాకస్థాయికి చేరింది. ఆ రోజున అక్కడ నమోదైన కొత్త కేసుల సంఖ్య 7860. అదే రోజు నమోదైన మరణాల సంఖ్య 1149. సెకండ్‌ వేవ్‌ మొదలైనట్టు భావించాక సెప్టెంబరు 27న 7713 కొత్త కేసులు నమోదైతే, మరణాల సంఖ్య 17 మాత్రమే. దీన్ని బట్టి సెకండ్‌ వేవ్‌ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. వరల్డో మీటర్స్‌ అంచనా ప్రకా రం అక్టోబరు 8న యూకేలో ఇప్పటివరకూ అత్యధికంగా 17,540 కేసులు నమోదు కాగా.. ఆ రోజు  మరణాల సంఖ్య 77. అంటే.. కేసుల సంఖ్య భారీ గా ఉన్నా మరణాల రేటు కనిష్ఠ స్థాయిలో ఉం టోంది. అది కూడా 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లోనే.


ఆలోపువారికి కరోనా వచ్చిపోతోంది. మెజారిటీ కేసుల్లో ప్రాణాంతకంగా మారట్లేదు. ఆస్పత్రుల్లో చోటు చాలక రోడ్ల మీద, చెట్ల కింద టెంట్లు వేసి మరీ పేషంట్లకు వైద్యం చేసిన ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి దేశాల్లోనూ ఇప్పుడు ఆస్పత్రులు నిండిపోయేంత ఆందోళనకర స్థితి లేదు. అయితే, వచ్చేది ఫ్లూ సీజన్‌. రెండూ కలిస్తే తట్టుకోవడం కష్టమని కొన్ని యూరప్‌ దేశాలు ముందు జాగ్రత్తగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. మనదేశంలోనూ కరోనా కేసుల సంఖ్యను చూసి భయపడే పరిస్థితి తగ్గింది. తొలిసారిగా దేశంలో ‘వారపు సగటు కేసులు’ వరుసగా మూడో వారం తగ్గాయి. 3 వారాల్లో 93,617 నుంచి 74,623కు వచ్చాయి. సెప్టెంబరు 7 నాటికి డబులింగ్‌ రేటు 32.6 రోజులు ఉం డగా ఇప్పుడు 60 రోజులైంది. దీంతో వైరస్‌ ఫస్ట్‌ వేవ్‌ బలహీనపడుతోందని విశ్లేషణలు వస్తున్నాయి. మరణాల రేటు కూడా బాగా తగ్గిపోయింది. కొవిడ్‌ హాట్‌స్పాట్లుగా భయపెట్టిన మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఏపీ.. ఎక్కడా అంత భయపడే పరిస్థితి లేదు. స్కూళ్లు, థియేటర్లు తెరిస్తే ఇక్కడా కేసుల సంఖ్య పెరుగుతుంది. మరణాల తీవ్రత ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉన్నంతగా ఉండదని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతా కరోనా కోరల నుంచి బయటపడే దిశగానే సాగుతోందని వేస్తున్నారు. ఇందుకు 4 కారణాలే చెబుతున్నారు. 


ప్రజల్లో పెరిగిన అవగాహన: కరోనా మనదేశంలోకి ప్రవేశించిన కొత్తలో మనకు వైర్‌సలు, వాటి వ్యాప్తి, మాస్కుల వాడకం, భౌతిక దూరం, క్వారంటైన్‌, ఐసోలేషన్‌.. ఇలా చాలా అంశాల గురించి తెలియదు. ఇప్పుడు మారుమూల ప్రాంతాల వారికి కూడా ఈ విషయాలన్నీ తెలిశాయి. మాస్కులు దాదాపుగా మన జీవితంలో భాగ మయ్యాయి. శానిటైజర్‌ వెంట ఉంచుకుని బయటకు వెళ్లడం అలవాటుగా మారింది. పల్స్‌ ఆక్సీమీటర్‌ ఇంట్లో నే పెట్టుకుని తరచూ ఆక్సిజన్‌ పర్సంటేజ్‌ చూసుకోవడం తెలిసింది. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుండడంతో వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గింది. మొదట్లో ఉన్న ఉధృతి కొనసాగి ఉంటే ఒక్క మనదేశంలోనే ఈ పాటికి కోటి కేసులు దాటిపోయేవి. జాగ్రత్తల వల్లే కేసుల సంఖ్య కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివిటీ రేటు, మరణాల రేటు కూడా తగ్గింది.




చికిత్సలపై వైద్యులకు స్పష్టత: కరోనాకు చికిత్స ఎలా చేయాలో వైద్యులకు స్పష్టత రావడం వల్ల మరణాల రేటు బాగా తగ్గింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్యులు సైతం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కరోనాకు ఎలా చెక్‌ పెట్టాలో తెలియక రాత్రింబవళ్లూ శ్రమించారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యం చేశారు. ఇప్పుడు రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్‌, డెక్సామెథసోన్‌, కార్టికోస్టిరాయిడ్‌లు.. చాలానే అందుబాటులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా అందరికీ ఆస్పత్రిలో చికిత్స అవసరం లేదని తేలడంతో ఆస్పత్రులపై, వైద్యులపై భారం తగ్గిం ది. మరింత నమ్మకంగా సమర్థమైన వైద్యం అందించ డంతో మరణాల సంఖ్య తగ్గిపోయింది.

తగ్గుతున్న వ్యాప్తి: హెర్డ్‌ ఇమ్యూనిటీ గురించి ప్రయత్నించి కొన్ని దేశాలు దెబ్బతిని మళ్లీ సర్దుకున్నాయి. కానీ.. కేసుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వైర్‌సను నిరోధించే యాంటీబాడీస్‌ ఉన్నవారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల.. వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ముప్పు తగ్గి, ఒక దశలో కేసుల సంఖ్య సహజంగానే తగ్గుతుంది. ప్రస్తుతం మన దేశంలో కేసుల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. 


అందుబాటులోకి వ్యాక్సిన్‌

కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని అనుకున్నా గతంలో ఉన్నంత భయం ఇప్పుడు లేదు. ఎం దుకంటే కనీసం ఏడెనిమిది వ్యాక్సిన్లు మనకు అందుబాటులోకి వచ్చే దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం ఒక్క వ్యాక్సిన్‌ అయినా అందుబాటులోకి వస్తుందని అంచనా. బ్రిటన్‌ ఏకంగా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌ కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరాకు నిపుణుల బృందాన్ని నియమించి, టీకాను భద్రపరిచేందుకు శీతలగిడ్డంగుల వేటలో పడింది. ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్‌, అగ్రో సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. స్విగ్గీ సేవలనూ వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల కూ వ్యాక్సిన్‌ సరఫరాకు కొవాక్స్‌ కూటమి కృషి చేస్తోంది. దీంతో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చినా భయం వద్దని వైద్యనిపుణులు అంటున్నారు.


-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-10-11T07:03:18+05:30 IST