సాగుకు సమాయత్తం

ABN , First Publish Date - 2020-05-14T09:56:12+05:30 IST

వానాకాలం (ఖరీఫ్‌) పంటలకు అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం

సాగుకు సమాయత్తం

జిల్లాలో వానాకాలం ప్రణాళిక 2,58,965 ఎకరాలు

సన్నరకాలపై దృష్టి 

వరి సాగు అంచనా 1,30,300 ఎకరాలు,

పత్తి లక్షా 20 వేల ఎకరాలు 

అందుబాటులో విత్తనాలు, ఎరువులు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) వానాకాలం (ఖరీఫ్‌) పంటలకు అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ సారి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతోపాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని భావించిన రైతులు వరి సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. సన్నరకాలవైపు  మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 58 వేల 965 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రణాళిక విడుదల చేసింది. ఇందులో వరి 1,30,300 ఎకరాలు, పత్తి 1,20,000 ఎకరాలు, మొక్కజొన్న 3,650 ఎకరాలు, ఇతర పంటలు 5,015 ఎకరాల్లో సాగు చేయనున్నారు. 


కరోనా నేపథ్యంలో ముందస్తు చర్యలు 

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో  ఎరువులు, విత్తనాల సమీకరణలో ఇబ్బందులు తలెత్తకుండా  అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం దృష్ట్యా వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువులకు లెక్కలు వేసి సిద్ధం చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న విత్తనాలను అందుబాటులో తెచ్చారు. 


విత్తనాలు రెడీ

వానాకాలం సాగులో 1,30,300 ఎకరాల్లో వరి సాగుకు 26,060 క్వింటాళ్ల విత్తనాలు, లక్షా 20 వేల ఎకరాల పత్తికి 3 లక్షల 60 వేల బ్యాగులు,  3,650  ఎకరాల మొక్కజొన్నకు 292 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 60.3 శాతం విత్తనాలు సిద్ధం చేశారు. 


జిల్లాకు వస్తున్న ఎరువులు 

వానాకాలం సాగుకు అవసరమయ్యే ఎరువులు జిల్లాకు వస్తున్నాయి. 69,069 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమున్నాయి. అందులో యూరియా 29,354 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 8,223 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 11,021 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 20,450 మెట్రిక్‌ టన్నులు అవసరం కానున్నాయి. ఇప్పటికే జిల్లాకు 9,515 మెట్రిక్‌ టన్నుల ఎరువులు చేరుకున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద 1,370 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల వద్ద 2,177 మెట్రిక్‌ టన్నులు, మార్క్‌ఫెడ్‌ వద్ద 5,958 మెట్రిక్‌ టన్నులు సిద్ధంగా ఉన్నాయి. 


సన్నరకాలపై దృష్టి 

వర్షాకాలం సాగులో రైతులు సన్న రకాలను పండించేటట్లు చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన సూచనకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టారు. 1,30,300  ఎకరాల్లో చేపట్టే వరిసాగులో 47,014 ఎకరాల్లో సన్న రకాలను వేయనున్నారు. బీపీటీ 322 ఎకరాలు, ఆర్‌అండ్‌ఆర్‌ 6,542 ఎకరాలు, జై శ్రీరామ్‌ 10,450 ఎకరాలు సాగు చేయనున్నారు. వీటితోపాటు కొర్ర, రాగి, జవార్‌, బజారా, రెడ్‌ గ్రామ్‌, బ్లాక్‌ గ్రామ్‌, గ్రీన్‌ గ్రామ్‌, సోయాబీన్‌, అముదం పంటలు వేయడానికి రైతులు సన్నద్ధమయ్యారు. 


Updated Date - 2020-05-14T09:56:12+05:30 IST