కో ఆప్షన్‌ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపిక

ABN , First Publish Date - 2020-08-13T10:26:48+05:30 IST

కరీంనగర్‌ నగరపాలక సంస్థ కో అప్షన్‌ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ కార్పొరేటర్లు సీహెచ్‌ అజిత్‌రావు, నందెల్లి రమ, పుట్ట నరేందర్‌,

కో ఆప్షన్‌ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపిక

అజిత్‌రావు, నందెల్లి రమ, పుట్ట నరేందర్‌, అమ్జద్‌కు అవకాశం

మైనార్టీ మహిళా స్థానం ఎంఐఎంకు కేటాయింపు 

విప్‌గా కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ 

పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు 

మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 12: కరీంనగర్‌ నగరపాలక సంస్థ కో అప్షన్‌ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ కార్పొరేటర్లు సీహెచ్‌ అజిత్‌రావు, నందెల్లి రమ, పుట్ట నరేందర్‌, మాజీ కో అప్షన్‌ సభ్యుడు అమ్జద్‌ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు.  బుధవారం కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో మేయర్‌ వై సునీల్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కో ఆప్షన్‌ సభ్యుల పేర్లను ప్రకటించారు. దీనికి కార్పొరేటర్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గురువారం జరిగే కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక లాంఛనం కానున్నది. మైనార్టీ మహిళా స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు.  గురువారం  జరగబోయే కో-ఆప్షన్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశంతోపాటు నగరాభివృద్ధి, టీఆర్‌ఎస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పార్టీ కమిటీల నియామకం తదితర అంశాలపై మంత్రి గంగుల కమలాకర్‌ పార్టీ శ్రేణులతో చర్చించారు.


ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులను కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేశామన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్‌లో . మహిళా, యూత్‌, ఎస్సీ సెల్‌, బీసీ సెల్‌, మైనార్టీ సెల్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. కంసాల శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ విప్‌గా మంత్రి ప్రకటించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, పాలకవర్గ సభ్యలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T10:26:48+05:30 IST