సెల్ఫ్‌ డ్రైవింగ్‌కు బ్యాడ్జ్‌ అవసరం లేదు

ABN , First Publish Date - 2020-06-02T07:47:51+05:30 IST

స్వయంగా నడుపుకునే పద్ధతి (సెల్ఫ్‌ డ్రైవింగ్‌)లో కార్లు, మోటార్‌ సైకిల్స్‌ను అద్దెకు తీసుకునే పర్యాటకులు, ఇతరులకు ఇకపై బ్యాడ్జ్‌ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం...

సెల్ఫ్‌ డ్రైవింగ్‌కు బ్యాడ్జ్‌ అవసరం లేదు

  • దేశీయ, అంతర్జాతీయ లైసెన్స్‌ ఉంటే చాలు


న్యూఢిల్లీ జూన్‌ 1: స్వయంగా నడుపుకునే పద్ధతి (సెల్ఫ్‌ డ్రైవింగ్‌)లో కార్లు, మోటార్‌ సైకిల్స్‌ను అద్దెకు తీసుకునే పర్యాటకులు, ఇతరులకు ఇకపై బ్యాడ్జ్‌ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం పేర్కొంది. దేశీయ లైసెన్స్‌ లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ (ఐడీపీ) ఉంటే సరిపోతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ర్టాల రావాణా శాఖ కార్యదర్శులు, కమిషనర్లకు సూచించింది. రెంట్‌ ఏ క్యాబ్‌, రెంట్‌ ఏ మోటర్‌ సైకిల్‌ పథకాల కింద వాహనాలను అద్దెకు తీసుకునే పర్యాటకులు, వ్యాపారస్తులు, కార్పొరేట్‌ అధికారులు, ఇతరులకు దేశీయ లైసెన్స్‌ లేదా ఐడీపీ ఉంటేచాలు, మరేతర పత్రాలు అవసరం లేదని పేర్కొంది. గేర్‌ లేని మోటార్‌ సైకిల్‌, గేర్‌ ఉన్న మోటార్‌ సైకిల్‌, తేలికపాటి వస్తు, ప్రజా రవాణా వాహనాలు, ఈ-రిక్షా, ఈ-కార్ట్‌లకు ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది. అదేవిధంగా రాష్ర్టాలు రెంట్‌ ఏ మోటార్‌ సైకిల్‌ పథకాన్ని ప్రారంభించాలని కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ కోరింది. ఈ పథకం ప్రకారం సంబంధిత పన్నులు చెల్లిస్తే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ర్టానికి ద్విచక్ర వాహనంపై ప్రయాణానికి అనుమతిస్తారు. గతంలోనే  కేంద్ర రవాణా శాఖ రెంట్‌ ఏ క్యాబ్‌, రెంట్‌ ఏ మోటర్‌ సైకిల్‌ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 


Updated Date - 2020-06-02T07:47:51+05:30 IST