TDP లో ఉన్నప్పుడు కొనసాగిన హవా.. ఇప్పుడు YSRCP MP గా ఉన్నా పప్పులుడకట్లేదేం.. రాత్రికి రాత్రే ఎందుకిలా.. పొమ్మన లేక పొగ పెడుతున్నారా..!?

ABN , First Publish Date - 2021-08-25T18:15:39+05:30 IST

ఆయన రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచిన అధికార పార్టీ ఎంపీ...

TDP లో ఉన్నప్పుడు కొనసాగిన హవా.. ఇప్పుడు YSRCP MP గా ఉన్నా పప్పులుడకట్లేదేం.. రాత్రికి రాత్రే ఎందుకిలా.. పొమ్మన లేక పొగ పెడుతున్నారా..!?

ఆయన రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచిన అధికార పార్టీ ఎంపీ. ఆ జిల్లాలో ఆ కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా  గుర్తింపు, ఆదరణ ఉన్నాయి. అయితే  వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన అధికార పార్టీ ఎంపీనా? లేక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీనా అనే విధంగా పరిస్థితి తయారవుతోంది. ఇంతకీ  ఆయనకు హైకమాండ్‌కు మధ్య ఎక్కడ బెడిసికొడుతోంది?  ఆ పార్టీలో ఉండాలంటే సొంత చరిష్మా ఉండకూడదా? ఇంతకీ ఎవరా ఎంపీ.. అధికార పార్టీలో అసలేం జరుగుతోంది..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


రఘురామకు పొగబెట్టినట్లే మాగుంటకు కూడా..!

గతంలో అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్టంరాజుకు పొమ్మన లేక పొగ పెట్టినట్లే ఎంపీ మాగుంట విషయంలోనూ ఆ పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించి పొగ పెడుతున్నారా అన్న అనుమానాలు ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అదే జరిగితే మాగుంట వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది.. మాగుంట కుటుంబంపై జరుగుతున్న పాలిట్రిక్స్‌కు అధికార పార్టీ చెక్ పెడుతుందా? కమాన్ అంటూ ప్రోత్సహిస్తుందా? అసలేం జరగబోతోంది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


కారణం ఇదేనా..!?

ఇటీవల ఆయన కుమారుడు దూకుడుగా ప్రజల్లోకి దూసుకెళుతుంటే అడ్డంకులు కల్పించడం కూడా ఆయన అభిమానులు వరుసుగా జరుగుతున్న సంఘటనలకు ముడిపెట్టి చూస్తున్నారు. కుమారుడు రాఘవరెడ్డిని ప్రత్యక్ష రాజకీయ వారసుడిగా ప్రకటించిన మాగుంట దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలకు విందు ఇచ్చి కుమారుడిని అందరికీ పరిచయం చేశారు. రాష్ట్రంలోని వైసీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా ఆ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఐతే ఇప్పటికే ఆయన కుటుంబానికి ఉన్న రాజకీయ చరిష్మాకు తోడుగా కొత్తగా మరోతరం వారసుడిని పరిచయం చేయడాన్ని జీర్ణించుకోలేకే వ్యతిరేకవర్గం ఇదంతా చేస్తుందనే మాటలు లోలోన వినిపిస్తున్నాయి.


టీడీపీలో ఉన్నప్పుడు కొనసాగిన హవా.. ఇప్పుడు ఎంపీగా ఉన్నా..!

2014లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మాగుంటకు చంద్రబాబు గౌరవం ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. గత ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరి రెండు లక్షల మెజార్టీతో గెలిచినా ఊహించిన స్థాయిలో సీఎం జగన్‌ వద్ద ఆయనకు ఆదరణ లభించలేదనేది రాజకీయాలు గమనించేవారుచెప్పేమాట. ముఖ్యంగా మాగుంట వ్యాపారాలు కూడా ఏపీలో స్తంభించాయి.


మాగుంట పేరొందుకు వచ్చింది? 

తాజాగా నెల్లూరు జిల్లాలో మట్టి అక్రమ రవాణాకు సంబంధించి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై లీకులు రావడం వెనుకా పెద్ద రాజకీయమే ఉందనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అధికారపార్టీ ఎంపీ, సుదీర్ఘ వారసత్వ రాజకీయ జీవితం ఉన్న శ్రీనివాసుల రెడ్డిపై ఈ ప్రచారం వెనుక కూడా అంతర్గంతగా కుట్ర దాగిఉందనేది ఆయన అభిమానుల అంతరంగం. మాగుంట పేరు అంతదూరం ఎందుకు వెళ్లిందనేది అన్ని వర్గాలకు ప్రశ్నార్థకంగా మారింది.


మంత్రి వర్సెస్‌ ఎంపీగా రాజకీయం?

ఆనందయ్య మందు పంపిణీ సమయంలోనూ ఎంపీ మాగుంటతో మంత్రి బాలినేని పోటీపడ్డారు. ఒంగోలు కేంద్రంగా మంత్రి, ఎంపీలు వేర్వేరు ప్రాంతాల్లో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఓ చోట... మంత్రి బాలినేని మరోచోట ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అధికార పార్టీలో ఎంపీగా ఉండి కూడా మాగుంట ఏమి చేయలేకపోతున్నారు అని గుసగుసలు ఆ పార్టీలోనే ఎక్కువయ్యాయి.


మాగుంట మాట చెల్లుబాటుకాలేదా?

కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్యేశ్యంతో ఒంగోలు రిమ్స్‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని  భావించిన ఎంపీ మాగుంట ఆ మేరకు అధికారులతో మాట్లాడి చర్యలు కూడా తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే మాగుంటని పక్కన పెట్టిన రిమ్స్ అధికారులు మంత్రి బాలినేని వద్ద ఫండ్స్ తీసుకుని ఆయన పేరు మీద కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు.


మంత్రి-మాగుంటకు మధ్య గ్యాప్‌ వచ్చిందా..!?

సుదీర్ఘ రాజకీయ వారసత్వ చరిష్మాకు తోడు  ఒంగోలు ఎంపీగా ఉన్నప్పటికీ వరుసగా ఎదురవుతున్న పరిణామాలు  మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఆలోచనలోకి నెట్టివేస్తున్నాయట. పొమ్మనలేకే పొగబెట్టేందుకే పార్టీ వైపు నుంచి ఇదంతా జరుగుతోందా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయట. మంత్రి బాలినేనికి, ఎంపీ శ్రీనివాసులరెడ్డికి మధ్య వచ్చిన గ్యాప్‌తో మొదలైన రాజకీయమే అసలు కథకు కారణమనే టాక్ వస్తోంది.



Updated Date - 2021-08-25T18:15:39+05:30 IST