స్పుత్నిక్-వీ టీకాను ఉత్పత్తి చేయనున్న సీరం!

ABN , First Publish Date - 2021-07-13T20:49:40+05:30 IST

ప్రముఖ టీకా తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త్వరలో రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌-వీని ఉత్పత్తి చేయనుంది.

స్పుత్నిక్-వీ టీకాను ఉత్పత్తి చేయనున్న సీరం!

ముంబై: ప్రముఖ టీకా తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త్వరలో రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌-వీని ఉత్పత్తి చేయనుంది. సెప్టెంబర్ నుంచి ఈ వ్యాక్సిన్ తయారీ ప్రారంభమవుతుందని సీరం ఇన్‌స్టిట్యూట్, రష్యా ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) తాజాగా ప్రకటించాయి. సీరం ఏటా 300 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన సాంకేతికతను రష్యా పరిశోధన సంస్థ గమలేయా ఇన్‌స్టిట్యూట్ సీరం‌కు ఇటీవలే బదిలీ చేసింది. ఈ క్రమంలో సెల్, వెక్టర్ శాంపిళ్లను సీరం‌కు అందజేసింది. కాగా.. సీరం సంస్థ ప్రస్తుతం ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్, అమెరికా సంస్థ నోవోవ్యాక్స్ అభివృద్ధి చేసిన కొవోవ్యాక్స్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. అంతేకాకుండా.. కొడాజెనిక్స్ కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్‌ను కూడా సీరం బ్రిటన్‌లో చేపడుతోంది. ఇక స్పుత్నిక్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు  ఆర్‌డీఐఎఫ్ ఇప్పటికే పలు దేశీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పనాషే బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, వర్చో బయోటెక్‌తో ఆర్‌డీఐఎఫ్ డీల్స్ కుదుర్చుకుంది. 

Updated Date - 2021-07-13T20:49:40+05:30 IST