శభాష్‌ Telugudesam సర్పంచ్‌.. మాట నిలబెట్టుకున్నావ్..!

ABN , First Publish Date - 2021-10-11T05:39:09+05:30 IST

ఎన్నికల సమయంలో గెలిచేందుకు ఏవేవో చెబుతారు. అవి చేస్తాం...

శభాష్‌ Telugudesam సర్పంచ్‌.. మాట నిలబెట్టుకున్నావ్..!
నిర్మాణం పూర్తయిన రహదారి

  1. సొంత డబ్బుతో రోడ్డు నిర్మాణం 
  2. మాట నిలబెట్టుకున్న చంద్రమోహన్‌ 
  3. రైతుల కష్టం తీర్చిన టీడీపీ నాయకుడు


రుద్రవరం, అక్టోబరు 10: ఎన్నికల సమయంలో గెలిచేందుకు ఏవేవో చెబుతారు. అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అని హామీ ఇస్తారు. గెలిచి కుర్చీ ఎక్కాక హామీ గురించి అడిగితే సాకులు చెబుతారు. ఇదీ.. రాజకీయ నాయకులపై ప్రజలకున్న నిశ్చితాభిప్రాయం. చాలా మంది హామీలను విస్మరిస్తారు. అందుకే ఈ పరిస్థితి. కానీ ‘నూటికో కోటికో ఒక్కరు’ అన్నట్లుగా కొందరు మాటమీద నిలబడతారు. ఆరు నూరైనా.. చెప్పిన పని చేస్తారు. ఆ కోవలోని వ్యక్తి ఎల్లావత్తుల సర్పంచ్‌ చంద్రమోహన్‌. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈయన.. ఎన్నికల సమయంలో తాను గెలిస్తే రెండు కి.మీ. మేర రహదారిని నిర్మిస్తానని ఆ ఊరి ప్రజలకు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలో లేదు. అయినా ఆయన మాటలను గ్రామస్థులు నమ్మి గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం.. సర్పంచ్‌ చంద్రమోహన్‌ రహదారి నిర్మించారు.


ప్రభుత్వం నిధులు ఇచ్చిందేమో.. అనుకుంటే పొరపాటే. ఈ దారి కోసం ఆయన సొంత డబ్బులు రూ.8 లక్షలు వెచ్చించారు. ఇప్పటి వరకూ పొలాలకు వెళ్లేందుకు దారిలేక రైతులు 6 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లేవారు. ఇప్పుడు కేవలం 2 కి.మీ. ప్రయాణించి పొలాలకు చేరుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పంట దిగుబడులు తరలించేందుకు కొన్నేళ్ల నుంచి పడుతున్న కష్టాలు తీరిపోయాయి. ఆనవాళ్లే లేని ఈ దారిని గుర్తించేందుకు సర్పంచ్‌ సర్వే చేయించారు. గ్రావెల్‌ వేయించి రోడ్డును తీర్చిదిద్దారు. సర్పంచ్‌ మాట నిలబెట్టుకోవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


రైతులు ఇబ్బంది పడుతున్నారు..

పొలాలకు వెళ్లేదారి శిథిలమైంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి సమస్య పరిష్కరిస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాను. సొంత డబ్బు రూ.8 లక్షలు వెచ్చించి రహదారి నిర్మింపజేశాను. 2 కి.మీ. గ్రావెల్‌ వేయించి రాకపోకలకు సౌకర్యంగా మార్చాను. వర్షపునీరు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా కల్వర్టును కూడా నిర్మించాను. - చంద్రమోహన్‌, సర్పంచ్‌, ఎల్లావత్తుల 


సౌకర్యంగా ఉంది..

వర్షాకాలం పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. ఆరు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. సర్పంచ్‌ చొరవతో రహదారి బాగుపడింది. ప్రయాణం సౌకర్యంగా మారింది. - కుళ్లాయి, ఎల్లావత్తుల

Updated Date - 2021-10-11T05:39:09+05:30 IST