గొర్రెల దొంగల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-19T05:56:36+05:30 IST

మహరాష్ట్ర నుంచి జియాగూడ మార్కెట్‌కు గొర్రెలను తరలిస్తున్న యజమానులను కత్తులు, తుపాకితో బెదిరించి గొర్రెలను దొంగిలించే నలుగురు ముఠాసభ్యులను పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గొర్రెల దొంగల ముఠా అరెస్ట్‌
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నాటు తుపాకి, కత్తులు, నగదు

ఏడుగురిలో ముగ్గురు పరార్‌

నాటు తుపాకి, రెండు కత్తులు, రూ.1,51,500నగదు స్వాధీనం

వెల్లడించిన జిల్లా ఎస్పీ రమణకుమార్‌

సంగారెడ్డిక్రైం, జనవరి 18: మహరాష్ట్ర నుంచి జియాగూడ మార్కెట్‌కు గొర్రెలను తరలిస్తున్న యజమానులను కత్తులు, తుపాకితో బెదిరించి గొర్రెలను దొంగిలించే నలుగురు ముఠాసభ్యులను పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రమణకుమార్‌ పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2021 డిసెంబరు8న మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన మహదేవ్‌ బీరుగోడ్కె బొలెరో వాహనంలో డ్రైవర్‌ గోవింద్‌బల్‌బీంతో 52గొర్రెలను తీసుకొని హైదరాబాద్‌ జియాగూడ మార్కెట్‌లో విక్రయానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ వద్ద ఆరుగురు ఇన్నోవా వాహనంలో వచ్చి బొలెరో వాహనాన్ని అడ్డగించడంతో పాటు వారిని బెదిరించి గొర్రెలను, బొలె రో వాహనాన్ని అపహరించారు. అలాగే జనవరి 13న మహరాష్ట్రలోని బుల్దానా జిల్లా చెక్లి గ్రామానికి చెందిన షేక్‌ తస్లీమ్‌ దేశ్‌ముఖ్‌ మహరాష్ట్ర నుంచి డ్రైవర్‌ కిషన్‌ బజరంగ్‌, మరో వ్యక్తి హనుమాన్‌తోపాటు బొలెరో వాహనంలో 5 మేకలు, 77 గొర్రెలను జియాగూడ మార్కెట్‌కు తరలిస్తుండగా పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద ఆరుగురు తుపాకి, కత్తులతో బెదిరించి గొర్రెలను దొంగిలించి వాహనాన్ని మాత్రం చెంగిచెర్ల వద్ద వదిలివెళ్లారు. ఈ రెండు కేసుల్లో పటాన్‌చెరు, సీసీఎస్‌ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపారు. దొంగిలించిన గొర్రెలలో 27 గొర్రెలను జనవరి 17న జియాగూడ మార్కెట్‌లో విక్రయించడానికి వచ్చిన మహ్మద్‌హనీ్‌ఫను పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఏడుమంది ముఠాగా ఏర్పడి మహరాష్ట్ర నుంచి జియాగూడ మార్కెట్‌కు తరలిస్తున్న గొర్రెలను దొంగిలిస్తున్నట్లు తెలిపాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో నలుగురిని అరెస్ట్‌ చేయగా ముగ్గు రు పరారీలో ఉన్నట్లు ఎస్పీ  తెలిపారు. చాంద్రాయన్‌గుట్ట జుబేల్‌కాలనీకి చెందిన గుట్కావ్యాపారి ఖాజా వహబుద్దిన్‌(45), చాంద్రాయన్‌గుట్ట రక్షాపురానికి చెందిన మహ్మద్‌ తాజొద్దిన్‌(27), చాంద్రాయన్‌గుట్ట నసీర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇసాక్‌(26), కిషన్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ హనీ్‌ఫ(35)అరెస్టు కాగా, కిషన్‌బాగ్‌కు చెంది  న షేక్‌ ఇమ్రాన్‌(33), ఆగ్రాకు చెందిన టేమూర్‌(26), అమీర్‌ అలియాస్‌ ఒమర్‌(25) పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, రూ.1,51,500నగదు, 60 గొర్రెలు(రూ.3,20,000 విలువ) రికవరీ చేసినట్లు ఎస్పీ వివరించారు. నిందితులు ఉపయోగించిన నాటు తుపాకి, ఏడు రౌండ్ల బుల్లెట్లు, రెండు కత్తులు, రూ.74,500 నగ దు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మంగళవారం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితుడు ఖాజా వహబుద్దిన్‌ గతంలో నేరచరిత్ర కలిగి ఉన్నాడని తెలిపారు. కేసులను ఛేదించిన పటాన్‌చెరు, సీసీఎస్‌ పోలీసు అధికారులు వేనుగోపాల్‌రెడ్డి శ్రీనివాసులు, భూపతి, రాంబాబు, ప్రశాంత్‌, వేణుకుమార్‌, మహేష్‌, రాంరెడ్డి, పవన్‌ ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-01-19T05:56:36+05:30 IST