ఆమె మౌనం వెనుక మర్మమేంటి..?

ABN , First Publish Date - 2021-12-20T17:11:51+05:30 IST

మూడు దశాబ్దాల ప్రజాజీవనం... ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కర్ణాటక బీజేపీలో ఏకైక మహిళా ఫైర్‌బ్రాండ్‌ అనిపించుకున్న శోభాకరంద్లాజే అనూహ్యమైన మౌనం వెనుక భారీ వ్యూహాలే ఉన్నాయా అనే చర్చ

ఆమె మౌనం వెనుక మర్మమేంటి..?

- అధిష్టానం పెద్దల ఆదేశాలా.. 

- కీలక పదవి కోసం వ్యూహమా..?


బెంగళూరు: మూడు దశాబ్దాల ప్రజాజీవనం... ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కర్ణాటక బీజేపీలో ఏకైక మహిళా ఫైర్‌బ్రాండ్‌ అనిపించుకున్న శోభాకరంద్లాజే అనూహ్యమైన మౌనం వెనుక భారీ వ్యూహాలే ఉన్నాయా అనే చర్చ జోరందుకుంది. ఎమ్మెల్యేగా, మంత్రిగానే కాకుండా లోక్‌సభ సభ్యురాలిగా పదవి ఏదైనా హిందుత్వం, ప్రత్యర్థి పార్టీల నేతలపై తీవ్రంగా స్పందించే శోభా దాదాపు రెండేళ్లుగా కొంత మెత్తబడ్డారు. ఇటీవల కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక శాఖాపరమైన అంశాలు మినహా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఏ అంశంపై కూడా నోరు మెదపక పోవడమే ఆమె భవిష్యత్‌ రాజకీయానికి సోపానం కానుందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. శోభాకరంద్లాజే రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా జాతీయంగా కూడా గుర్తింపు పొందారు. ఏడేళ్లుగా ఎంపీగా కొనసాగుతూనే పలు కమిటీలలోను కీలక భూమిక పోషించారు. మౌనంగా ఉండాలని, వివాదాల జోలికి వెళ్లరాదని కొందరు అధిష్ఠానం పెద్దలు ఆమెకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె శాఖా పరమైన అంశాలకే పరిమితంగా కొనసాగుతున్నారనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎన్నో రాజకీయ సంచలనాలు చోటుచేసుకున్నాయి. మతతత్వ గొడవలు చెలరేగాయి. తాజాగా బెళగావిలో ఎంఈఎస్‌ వివాదం తెలిసిందే. అంతే కాకుండా మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత రమేష్‌కుమార్‌ మహిళల పట్ల శాసనసభలో చేసిన వ్యాఖ్యలు దేశమంతటా ప్రకంపనలకు కారణమయ్యాయి. ఏ అంశంలోను ఆమె నోరు మెదపడం లేదనేది వాస్తవమే. రెండేళ్ల కిందటి శోభాకరంద్లాజే అయితే ఎన్నెన్ని విమర్శలు చేసేవారో అని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఆమె ప్రారంభం నుంచి హిందుత్వ, జాతీయ అంశాలలో ఏ నాయకుడికి తీసిపోరనే రీతిలో మాట్లాడేవారు. ఎక్కడ మతఘర్షణలు తలెత్తినా విరుచుకుపడేవారు. ఈ కారణాలతోనే ఆర్‌ఎస్ఎస్‌, సంఘ్‌పరివార్‌కు సన్నిహితురాలిగా ముద్రపడింది. ఎన్నో సందర్భాలలో ఆమెపైనా విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు. ఆమె రాజకీయ పయనం నిరంతర పోరాటాలతోనే సాగిందనడంలో సందేహం లేదు. కానీ ఇటీవల బాగల్‌కోటెలో రాష్ట్రంలోని పరిణామాలు, మతమార్పిళ్ల నియంత్రణ అంశంపై మీడియా ప్రశ్నకు సున్నితంగా దాటవేశారు. కేంద్రమంత్రిగా ఉన్నందున నో కాంట్రవర్సీ అంటూ వెళ్ళిపోయారు. శోభాకరంద్లాజే మౌనం వెనుక భారీ నిర్ణయం ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం పెద్దలు రాష్ట్రంలో పెద్ద పదవి మీకు రానుంది అనవసరమైన వివాదాలను తెచ్చుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెద్దపదవి అంటే ఏమిటి ముఖ్యమంత్రినా లేక రాష్ట్ర అధ్యక్ష పదవా అనేది చర్చకు కారణమవుతోంది. 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్టీకి కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని పెంచిపోషించి అధికారంలోకి తీసుకొచ్చిన యడియూరప్పను అధికారం నుంచి తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌బొమ్మైను ముఖ్యమంత్రిని చేశారు. బొమ్మై సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళతామని స్వయంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెప్పినా ఆయన వర్ఛస్సు ఏమాత్రం ప్రగతిపరంగా లేదనే పార్టీలోనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోది. పైగా బిట్‌కాయిన్‌, టెండర్ల కమీషన్‌, గొడవల విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక వేళ బొమ్మై మార్పు అంటే శోభాకరంద్లాజే, జగదీష్ శెట్టర్‌, మురుగేష్‌ నిరాణీ పేర్లు ఉంటాయని చర్చ జరుగుతోంది. వీరిలో శోభాకరంద్లాజేనే ముందంజలో ఉన్నారని సంఘ్‌పరివార్‌ కూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పరిస్థితి కూడా అంతంత మాత్రమనే రీతిలో ఉంది. ఏది ఏమైనా శోభాకరంద్లాజే మౌనం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రత్యేకించి యడియూరప్ప వర్గానికి చెందినవారు కావడం కూడా ఆమెకు కలిసిరానుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - 2021-12-20T17:11:51+05:30 IST