వీఎంఆర్‌డీఏకు షాక్‌

ABN , First Publish Date - 2020-11-13T06:05:52+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరువు గంగలో కలిసి పోయింది. మొక్కల పెంపకంలో అవినీతి బాగోతం బయట పడడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ (పరవాడ) మేల్కొంది.

వీఎంఆర్‌డీఏకు షాక్‌
ఇదీ వీఎంఆర్‌డీఏ మొక్కల పెంపకం తీరు...

మొక్కల పెంపకం కోసం ఇచ్చిన రూ.4 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ ఎన్‌టీపీసీ లేఖ

అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు రావడంతోనే ఈ నిర్ణయం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరువు గంగలో కలిసి పోయింది. మొక్కల పెంపకంలో అవినీతి బాగోతం బయట పడడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ (పరవాడ) మేల్కొంది. తాము ఇచ్చిన మొత్తం వెనక్కి ఇచ్చేయాలని, తమకు ఏ మొక్కలు అవసరం లేదని స్పష్టంచేసింది. దీంతో వీఎంఆర్‌డీఏ అధికారులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. అఽధికారులు కక్క లేక మింగ లేక అవస్థలు పడుతున్నారు. 


ఇదీ జరిగిన దోపిడీ

పరవాడలోని ఎన్‌టీపీసీ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం చేపడుతోంది. ఈ పనులు చేపట్టేందుకు ప్రత్యేక విభాగం ఏమీ లేకపోవడంతో రెండేళ్ల క్రితం వీఎంఆర్‌డీకు ఆ బాధ్యత అప్పగించింది. పరవాడలోని కొన్ని ప్రాంతాల్లో, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో సూచించిన చోట మొక్కలు నాటాలని కోరింది. అందుకు అవసరమైన మొత్తం డిపాజిట్‌ చేసింది. ఇది సుమారుగా రూ.4 కోట్ల వరకు వుంటుందని అంచనా.  అయితే అందులో వీఎంఆర్‌డీఏ అర్బన్‌ అటవీ విభాగం  చేతివాటం చూపించింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం మొక్కలను నాటలేదు. వాటిని సంరక్షించలేదు. నామమాత్రంగా పనులు చేపట్టి, బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసుకుంది. ఇన్‌చార్జి డీఎఫ్‌ఓగా పనిచేసిన ఓ డిప్యుటేషన్‌ ఉద్యోగి ఈ వ్యవహారం మొత్తం నడపడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయిష్టంగానే ఆయన్ను ఉన్నతాధికారులు మాతృశాఖకు పంపించారు. ఇప్పుడు ఆ ఫైల్‌ను క్లోజ్‌ చేయడానికి మొక్కల పెంపకం పూర్తయిందని, వాటిని అప్పగిస్తున్నామంటూ అర్బన్‌ అటవీ విభాగం అధికారులు ఎన్‌టీపీసీకి వెళ్లి లెక్కలు చూపించే ప్రయత్నం చేశారు. దానికి వారు నిరాకరించారు. తాము సూచించిన చోట ఒప్పందం మేరకు మొక్కలు లేవని, ఈ విషయంలో జరిగిన బాగోతంపై పత్రికల్లో వచ్చినవన్నీ చూశామని, ఇప్పుడు తాము వాటికి అంగీకరించి సంతకం చేస్తే ఉద్యోగాలు పోతాయని పేర్కొన్నట్టు తెలిసింది. పైగా దీనిపై విజిలెన్స్‌ విచారణ కూడా నడుస్తోందని, తమను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరినట్టు సమాచారం. ఈ మేరకు తాము గతంలో డిపాజిట్‌గా ఇచ్చిన మొత్తం వెనక్కి ఇవ్వాలని లేఖ పంపినట్టు తెలిసింది. దీనిపై ఏమి చేయాలా? అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే మొక్కల పెంపకం పేరుతో ఆ డిప్యుటేషన్‌ ఉద్యోగి బినామీ సంస్థకు చాలావరకు బిల్లులు చెల్లించేశారు. ఇప్పుడు వాటిని ఎవరు భరించాలి? ఎలా రికవరీ చేయాలి? అనే దానిపై తలలు పట్టుకుంటున్నారు.


మళ్లీ వ్యవసాయ శాఖ నుంచే డిప్యుటేషన్‌

ఇదిలావుండగా అక్రమాలకు పాల్పడిన డిప్యుటేషన్‌ ఉద్యోగిని ఆ కారణంతో కాకుండా వ్యవసాయ శాఖ నుంచి వచ్చారని సాకు చూపుతూ సరండర్‌ చేశారు. ఇప్పుడు అదే స్థానంలోకి మళ్లీ వ్యవసాయ శాఖ నుంచే ఇంకో ఉద్యోగిని వచ్చి చేరారు. వ్యవసాయ శాఖ వారికి మొక్కల పెంపకం గురించి అవగాహన ఉండదని, అందుకే ఒకరిని సరండర్‌ చేశామని చెబుతున్న అధికారులు ఇప్పుడు మళ్లీ అదే శాఖ నుంచి ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తే...‘మా చేతుల్లో ఏముంది?’ అంటున్నారు.

Updated Date - 2020-11-13T06:05:52+05:30 IST