‘అంతులేని కథ’గా మారకూడదు

ABN , First Publish Date - 2021-10-21T07:58:42+05:30 IST

లఖీంపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నట్లు అభిప్రాయం కలుగుతున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ...

‘అంతులేని కథ’గా మారకూడదు

లఖీంపూర్‌ ఖీరీ ఘటనపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దర్యాప్తు నత్తనడకన సాగుతున్నట్టుందని వ్యాఖ్య

ఆ ముద్ర తొలగించుకోవాలని ప్రభుత్వానికి సూచన

వాంగ్మూలాలు ఎందుకు రికార్డు చేయలేదని నిలదీత

బాధితులకు, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశం

తదుపరి విచారణ 26కు వాయిదా

లఖీంపూర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ


న్యూఢిల్లీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): లఖీంపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నట్లు అభిప్రాయం కలుగుతున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు దర్యాప్తు అంతులేని కథగా మారకూడదని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్‌ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి వేగంగా కార్లు పోనిచ్చిన ఘటనలో 8 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా నిందితుడు. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, దర్యాప్తు స్థితిపై నివేదిక అందించాలని గత విచారణలో సుప్రీం ఆదేశించింది. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట మరోమారు విచారణకు వచ్చింది. చివరి నిమిషంలో దర్యాప్తు స్థితి నివేదికను సమర్పించడం పట్ల జస్టిస్‌ రమణ అసహనం వ్యక్తం చేశారు.


సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందించామని యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే తెలపగా.. ‘‘చివరి నిమిషంలో నివేదిక ఇస్తే మేం ఎప్పుడు చదవాలి. నివేదికను కనీసం ఒక రోజు ముందు ఇవ్వాలి’’ అని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటి వరకు 10 మంది నిందితులు అరెస్టయ్యారని, అందులో నలుగురు పోలీసు కస్టడీలో ఉన్నారని, మిగతా ఆరుగురు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని సాల్వే వివరించారు. మరి మిగతా ఆరుగురిని పోలీసు కస్టడీలోకి ఎందుకు తీసుకోలేదని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు. వారిని పోలీసులు విచారించేంత వరకు ఏమీ తేల్చలేరని పేర్కొన్నారు. దానికి యూపీ సర్కారు తరఫున మరో సీనియర్‌ న్యాయవాది గరిమ ప్రసాద్‌ స్పందిస్తూ... మూడు రోజులు పోలీసు కస్టడీలో ఉన్న తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీని రిమాండ్‌ చేశారని తెలిపారు. అయితే, పోలీసు కస్టడీని పెంచాలని పోలీసులు దరఖాస్తు దాఖలు చేశారా? లేదా? అని ధర్మాసనం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి కొన్ని ఫోన్లు సీజ్‌ చేసి వీడియోలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించామని, ఆ నివేదిక వస్తే తదుపరి వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉండకపోవచ్చని గరిమ ప్రసాద్‌ తెలిపారు.


కాగా, 44 మంది సాక్షులకుగాను, సెక్షన్‌ 164 ప్రకారం నలుగురి వాంగ్మూలాలను మాత్రమే రికార్డు చేయడం పట్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు దర్యాప్తును నత్తనడకన సాగిస్తున్నట్లు అభిప్రాయం కలుగుతున్నదని, యూపీ ప్రభుత్వం అలాంటి అభిప్రాయాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దానికి సాల్వే సమాధానమిస్తూ... దసరా సెలవుల నేపథ్యంలో కోర్టులు మూసివేసి ఉండవచ్చనగా, సెలవుల సమయంలో క్రిమినల్‌ కోర్టులు మూసి ఉండవని ధర్మాసనం స్పష్టం చేసింది. గరిమ ప్రసాద్‌ కలుగజేసుకొని.. పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారని వివరించారు. దీంతో ‘‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయడం, సెక్షన్‌ 164 ప్రకారం వాంగ్మూలాలను రికార్డు చేయడం వేర్వేరు. వాంగ్మూలాలను జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు రికార్డు చేస్తారు. వాంగ్మూలాలను నమోదు చేయడానికి చర్యలు తీసుకోండి’’ అని జస్టిస్‌ రమణ ఆదేశించారు.


అత్యంత ముప్పు ఉన్న సాక్షులను, రేపటి రోజున బెదిరించి ప్రభావితం చేయడానికి అవకాశం ఉన్న సాక్షులను గుర్తించి వారికి రక్షణ కల్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘తక్షణమే వాంగ్మూలాల నమోదుకు చర్యలు చేపట్టాలని వారికి సూచించండి. దీంతోపాటు బాధితులు, సాక్షుల రక్షణ చాలా ముఖ్యం’ అని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సాక్షులకు తగిన రక్షణ కల్పిస్తుందని, వాంగ్మూలాల నమోదు కోసం వారిని కోర్టులో ప్రవేశపెడుతుందని సాల్వే తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.


Updated Date - 2021-10-21T07:58:42+05:30 IST