56 అంగుళాల ఛాతీ సరే... పేదల కన్నీరు తుడిచే హృదయమేది?: మోదీపై సిద్ధరామయ్య ఫైర్

ABN , First Publish Date - 2021-01-27T22:29:40+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో ఆందోళన చేపట్టిన రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత..

56 అంగుళాల ఛాతీ సరే... పేదల కన్నీరు తుడిచే హృదయమేది?: మోదీపై సిద్ధరామయ్య ఫైర్

బెంగళూరు:  ఢిల్లీలో ఆందోళన చేపట్టిన రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తరచూ తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని గొప్పగా చెప్పుకుంటారనీ... కానీ ఆయనకు పేదల కన్నీళ్లు తుడిచే హృదయం మాత్రం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం రైతులు చేపట్టే ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అల్లర్లు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వంలోని నిఘా వ్యవస్థ ఏంచేస్తోందని ఆయన మండిపడ్డారు. నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో తీవ్రవాదుల ప్రమేయం ఉందోలేదో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని సిద్దరామయ్య ప్రశ్నించారు. బెంగళూరులో ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రభుత్వ వైఫల్యమే. రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు వారంతా 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించేందుకు 11 రౌండ్లు అవసరమా?’’ అని ప్రశ్నించారు.


కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ‘‘రైతు వ్యతిరేక’’ చట్టాలనీ.. వాటిని ఉపసంహరించుకోవాలన్నదే రైతుల ప్రధాన డిమాండ్ అని సిద్దరామయ్య పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా గడచిన 60 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారనీ... కొందరు రైతులు ప్రాణాలు సైతం కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. ‘‘నరేంద్ర మోదీ తరచూ తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని చెబుతుంటారు. ఛాతీ ఎంత పెద్దది అనేది ముఖ్యం కాదు.. అందులో పేదల కన్నీరు తుడిచే హృదయం ఉందా లేదా అన్నదే ముఖ్యం. మోదీకి అలాంటి హృదయం లేనేలేదు. ఆయన ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా రైతులను పిలిపించుకుని మాట్లాడారా?’’ అని సిద్దరామయ్య ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనీ... అందుకే వాటిని ఉపసంహరించుకునేందుకు ఇష్టపడడం లేదన్నారు. అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్లకు కేంద్ర ‘‘బానిస’’గా మారిపోయిందనీ... వాళ్లు ఎలా చెబితే అలా చట్టాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2021-01-27T22:29:40+05:30 IST