69 ఏళ్లలో..

ABN , First Publish Date - 2021-04-20T05:48:49+05:30 IST

ఉద్యమాలకు పురిటి గడ్డగా పేరుగాంచిన పట్టణం సిద్దిపేట. మలిదశ తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ. ఒకనాడు చిన్న పట్టణంగా మొదలైన సిద్దిపేట మున్సిపాలిటీ ప్రస్థానం నేడు రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా నిలిచే స్థాయికి ఎదిగింది. తొలుత కేవలం ఐదు వార్డులతో ఏర్పాటై ప్రస్తుతం 43 వార్డులకు పెరిగింది. నేడు ఎన్నో గొప్ప పట్టణాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు 15 వేల జనాభాతో ప్రారంభమై నేటికి లక్షకుపైగా జనంతో విలసిల్లుతున్నది. చుట్టూ ఉన్న ప్రాంతాలను తనలో కలుపుకుని పట్టణాన్ని విస్తరించుకున్నది. సిద్దిపేట మధ్య భాగం నుంచి ఎటు చూసినా దాదాపు 10 కిలో మీటర్లు పరిధి కలిగివుంది. 69 ఏళ్ల మున్సిపాలిటీ ప్రస్థానంలో సిద్దిపేట పట్టణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ, రాష్ట్రంలో అత్యుత్తమ పట్టణంగా గుర్తింపును సొంతం చేసుకున్నది.

69 ఏళ్లలో..

5 వార్డులతో మొదలై 43 వార్డులకు విస్తరణ

నాడు చిన్న పట్టణంగా మున్సిపాలిటీ ఏర్పాటు 

నేడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన జిల్లా కేంద్రం

ఇప్పటివరకు 11 పాలకవర్గాలు.. రెండోసారి మహిళకు అవకాశం

1952లో మొదలైన సిద్దిపేట మున్సిపాలిటీ ప్రస్థానం


సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 19 : ఉద్యమాలకు పురిటి గడ్డగా పేరుగాంచిన పట్టణం సిద్దిపేట. మలిదశ తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ. ఒకనాడు చిన్న పట్టణంగా మొదలైన సిద్దిపేట మున్సిపాలిటీ ప్రస్థానం నేడు రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా నిలిచే స్థాయికి ఎదిగింది. తొలుత కేవలం ఐదు వార్డులతో ఏర్పాటై ప్రస్తుతం 43 వార్డులకు పెరిగింది. నేడు ఎన్నో గొప్ప పట్టణాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు 15 వేల జనాభాతో ప్రారంభమై నేటికి లక్షకుపైగా జనంతో విలసిల్లుతున్నది. చుట్టూ ఉన్న ప్రాంతాలను తనలో కలుపుకుని పట్టణాన్ని విస్తరించుకున్నది. సిద్దిపేట మధ్య భాగం నుంచి ఎటు చూసినా దాదాపు 10 కిలో మీటర్లు పరిధి కలిగివుంది. 69 ఏళ్ల మున్సిపాలిటీ ప్రస్థానంలో సిద్దిపేట పట్టణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ, రాష్ట్రంలో అత్యుత్తమ పట్టణంగా గుర్తింపును సొంతం చేసుకున్నది. 


అంచెలంచెలుగా పెరిగిన వార్డులు

ఒకనాడు కరీంనగర్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న సిద్దిపేట 1905లో మెదక్‌ జిల్లాలో వీలినమైంది. అనంతరం 1952 సంవత్సరంలో మొదటిసారిగా సిద్దిపేట పట్టణం పురపాలక సంఘంగా అవతరించింది. నాలుగేళ్ల అనంతరం ఎన్నికలను నిర్వహించారు. ఈ కాలంలో అప్పటి ఆర్డీవో తొలి చైర్మన్‌గా వ్యవహరించారు. సిద్దిపేట మున్సిపాలిటీ 1962 సంవత్సరం వరకు ఐదు వార్డులుగానే ఉంది. అనంతరం అంచెలంచెలుగా వార్డులు పెరిగాయి. 1967 సంవత్సరం ఎన్నికల్లో 12 వార్డులుగా విభజింపబడింది. అనంతరం 1987 వరకు 12 వార్డులుగా కొనసాగింది. 1995లో ఎన్నికల వేళ 28 వార్డులకు పెరిగింది. అనంతరం సిద్దిపేట పరిసర ప్రాంతాలైన గాడిచెర్లపల్లి, లింగారెడ్డిపల్లి, రంగధాంపల్లి, నర్సాపూర్‌, ప్రశాంత్‌నగర్‌ల విలీనం కావడంతో 2005లో 32 వార్డులుగా ఏర్పడింది. 2016లో 34 వార్డులుగా విభజించారు. ప్రస్తుతం సిద్దిపేట పట్టణం విస్తీర్ణం, జనాభా పెరిగిన నేపఽథ్యంలో ఈ మధ్యనే 34 వార్డులను 43 వార్డులుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.


11 మంది చైర్మన్లు

1952లో ఏర్పడిన సిద్దిపేట మున్సిపాలిటీలో 1956లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు చైర్మన్‌ పదవికి కూడా ఎన్నికలు ఉండేవి. సిద్దిపేట మొదటి చైర్మన్‌గా కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన ఖాజామొయినొద్దీన్‌ గెలుపొందాడు. అనంతరం 1962లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లారెడ్డి గెలిచారు. తదుపరి 1967లో సీపీఐ పార్టీ అభ్యర్థి రాజ మల్లయ్య, 1981లో కాంగ్రెస్‌ తరఫున రాజమౌళి, 1983లో కాంగ్రెస్‌ నుంచి లింగం, 1984లో కాంగ్రెస్‌ నుంచి రాజమౌళి, 1987లో టీడీపీ నుంచి హరిశ్చంద్ర, 1995లో కాంగ్రెస్‌ నుంచి బాసంగారి రమేష్‌, 2000లో టీడీపీ నుంచి గట్టు అపర్ణ, 2005, 2016 సంవత్సరాల్లో  రెండుసార్లు టీఆర్‌ఎస్‌ నుంచి రాజనర్సు చైర్మన్‌ అయ్యారు. ప్రస్తుతం 12వ సారి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోసం ఎన్నికలను నిర్వహిస్తున్నారు. 69 ఏళ్ల సిద్దిపేట మున్సిపాలిటీ ప్రస్థానంలో మహిళా అభ్యర్థికి చైర్‌పర్సన్‌ పీఠం రావడం రెండోసారి. 2000 సంవత్సరంలో మొదటిసారిగా అపర్ణ చైర్‌పర్సన్‌గా ఐదు సంవత్సరాలు వ్యవహరించింది. మళ్లీ ప్రస్తుతం  రిజర్వేషన్‌ ద్వారా మహిళకు అవకాశం కల్పించారు. 


ఆరేళ్లు ఎన్నికలకు దూరం

సిద్దిపేట మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి పాలకవర్గం గడువు ముగిసిన అనంతరం ప్రతీసారి ఎన్నికలు సజావుగా జరిగాయి. కానీ 2010 ఎన్నికల సమయంలో కొన్ని గ్రామాలను సిద్దిపేట మున్సిపాలిటీలో వీలినం చేశారు. అప్పుడు ఆయ గ్రామాల ప్రజలు కోర్టులో కేసు వేయడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2010 నుంచి 2016 సంవత్సరం వరకు ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం 2016లో ఎన్నికలను నిర్వహించారు.




Updated Date - 2021-04-20T05:48:49+05:30 IST