అక్షింతలు పడతాయ్!

ABN , First Publish Date - 2021-08-01T06:22:40+05:30 IST

సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా..

అక్షింతలు పడతాయ్!

అంతుబట్టని ఈవో అంతరంగం

చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు బాధ్యతలు స్వీకరించి నెలన్నర అయినా ఇప్పటివరకూ మర్యాదపూర్వకంగా కూడా కలవని వైనం..

కారణమేమిటో తెలపాలని లేఖ రాసిన అశోక్‌

ట్రస్ట్‌ బోర్డు తీర్మానాలపై ఆరా

ఛైర్మన్‌ ప్రశ్నలకు  జవాబు ఇవ్వని ఈఓ

నేరుగా కలవడానికి విముఖం

నోరెత్తని అధికార వర్గాలు

దేవస్థానంలో రగడ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు పునర్నియమితులై నెలన్నర అయినా...ఇప్పటివరకు ఈవో సూర్యకళ కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యనిర్వహణాధికారిగా ఎవరు ఉన్నా...దేవస్థానం నిర్వహణ, విధాన నిర్ణయాలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లాలి. అది ఆనవాయితీ, తప్పనిసరి కూడా. సంచయిత చైర్‌పర్సన్‌గా వున్నప్పుడు ఈ నిబంధనలను ఈఓ సూర్యకళ పాటించారు. అశోక్‌గజపతిరాజు విషయంలో మాత్రం గుంభనంగా ఉన్నారు. 


నెల రోజులు దాటినా ఈవో తనను కలవకపోవడాన్ని అశోక్‌గజపతిరాజు సీరియస్‌గా తీసుకున్నారు. అందుకు గల కారణం ఏమిటో తెలియజేయాలంటూ ఆమెకు లేఖ రాశారు. దానికి ఆమె సమాధానం ఇవ్వలేదు. ఇదొక్కటే కాదు...ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత దేవస్థానంలో చోటుచేసుకున్న ప్రతి అంశంపైన వివరాలు కోరుతూ ఈఓ సూర్యకళకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాశారు. కొన్నింటికి ఆమె పొడి పొడి సమాధానాలు పంపి, మిగిలిన విషయాలను విస్మరించారు. దీనిని కూడా ఆయన ప్రశ్నించారు. అయినా ఆమె స్పందించడం లేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌ను ఇంతవరకు కలవకపోవడం ఒక తప్పయితే, ఆయన కోరిన వివరాలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకపోవడం మరో తప్పని, ఇది న్యాయస్థానం వరకు వెళితే...మాన్సాస్‌ ఈఓకు మాదిరిగానే ఆమెకు అక్షింతలు పడతాయని సిబ్బంది చెబుతున్నారు.


ఆ విషయాలపై గుట్టు ఎందుకు?

దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన వారికి వాహన సదుపాయం కల్పించడం ఆచారం. పదవి నుంచి దిగిపోగానే ఆ కారును సరండర్‌ చేస్తారు. ఇక్కడ అశోక్‌గజపతిరాజు ఇప్పటివరకు అలాగే వ్యవహరించారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారులు కారు ఇవ్వలేదు. దాంతో ఆయన ఈఓకు లేఖ రాశారు. పాత చైర్‌పర్సన్‌ కారు సరండర్‌ చేశారా? లేదా? అని రాశారు. దానికి ఆమె సమాధానం ఇవ్వలేదు. అయితే సంచయిత కోసం దేవస్థానం అధికారులు రెండు కొత్త ఇన్నోవా కార్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఒకటి విశాఖ, విజయనగరం జిల్లాల్లో, మరొకటి ఢిల్లీలో ఉపయోగించుకోవడానికి కేటాయించారని అంటున్నారు. ఇవి వెనక్కి వచ్చాయా? లేదా? అనే విషయం చెప్పడం లేదు. అయితే అశోక్‌గజపతిరాజు లేఖ రాసిన తరువాత...అంటే ఓ పది రోజుల నుంచి ఒక కారును రోజూ విజయనగరం పంపుతున్నారు. ఆయన దానిని స్వీకరించకపోవడం విశేషం. ఈఓ తనను ఇంతవరకు కలవలేదని, కారు అవసరం లేదని స్పష్టం చేశారు. 


ట్రస్టు బోర్డు తీర్మానాలపై ఆరా

2020 మార్చి 4 నుంచి 2021 జూన్‌ 14 వరకు దేవస్థానం ట్రస్టు బోర్డు, చైర్‌పర్సన్‌ తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు కాపీని పంపాలని అశోక్‌గజపతిరాజు కోరారు. అలాగే పంచ గ్రామాల సమస్యకు సంబంధించి ప్రభుత్వం, ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాయా? వాటికి సంబంధించి దేవదాయ శాఖ చేసిన ప్రతిపాదన ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.  


ఆస్తుల రిజిస్టర్‌ మార్చారా?

దేవస్థానం ఆస్తుల రిజిస్టర్‌ నిర్వహిస్తున్నదని, దాని కాపీ కావాలని, అందులో ఇటీవల ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా?...చేసినట్టయితే వాటి వివరాలు ఏమిటో తెలపాలని కోరారు.


గోశాల నిర్వహణ విధానం ఏమిటి?

సింహాచలేశునికి భక్తులు సమర్పించే గోవులను సంరక్షించడానికి ఒక విధానం అనుసరిస్తున్నారని తాను భావిస్తున్నానని, అయితే ఇటీవల పత్రికల్లో అక్కడ గోవులు చనిపోతున్నాయని, ఎవరెవరికో ఇస్తున్నారని వార్తలు వచ్చాయని, వాటిపై వివరణ ఇస్తూ, నిర్వహణ విధానం ఏమిటో చెప్పాలని చైర్మన్‌ హోదాలో అశోక్‌గజపతి కోరారు.


నేరుగా కలవనందునే లేఖల పరంపర

సంప్రదాయం ప్రకారం ఈఓ సూర్యకళ వెళ్లి...చైర్మన్‌ను కలిస్తే అన్ని విషయాలు ఇద్దరు ముఖాముఖి మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఏ కారణం చేతనో ఆమె ఇప్పటివరకు కలవలేదు. దాంతో ప్రతి విషయం తెలుసుకోవడానికి ఆయన లేఖలు రాస్తున్నారు. ఇది ఇంకా ఎన్నాళ్లు ఆమె కొనసాగిస్తారో వేచి చూడాలి.


Updated Date - 2021-08-01T06:22:40+05:30 IST