సాదాసీదాగా మండల సమావేశం

ABN , First Publish Date - 2022-01-28T06:26:44+05:30 IST

మండల సర్వసభ్య సమావేశం గురువారం సాదాసీదాగా జరిగింది. ప్రజా సమస్యలపై చర్యకు వేదికైన ఈ సమావేశంలో దాదాపు సభ్యులెవరూ నోరు విప్పలేదు.

సాదాసీదాగా మండల సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ

సమస్యలపై నోరు విప్పని ప్రజా ప్రతినిధులు


రోలుగుంట, జనవరి 27: మండల సర్వసభ్య సమావేశం గురువారం సాదాసీదాగా జరిగింది. ప్రజా సమస్యలపై చర్యకు వేదికైన ఈ సమావేశంలో దాదాపు సభ్యులెవరూ నోరు విప్పలేదు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రసంగం, అధికారుల ప్రగతి నివేదిక ప్రకటనలతో సమావేశం ముగిసింది. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. గ్రామాల వారీగా సమస్యలను తెలపాలని చెప్పారు. అనంతరం ఎంపీడీవో కె.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు, వాటి పరిష్కారంపై తీసుకున్న చర్యలను వివరించారు. జానకిరాంపురం, జె.నాయుడుపాలెం, జగ్గంపేట, గుండుబాడు, కుసర్లపూడి పంచాయతీలను రోలుగుంట పీహెచ్‌సీ పరిధిలోకి తీసుకురావాలన్న విన్నపం ఎంత వరకు వచ్చిందన్న సభ్యుల ప్రశ్నపై వైద్యాధికారి విమలగిరి స్పందించారు. ఈ ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్‌కు అందించామని చెప్పారు. ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా సభ్యులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటులో నర్సీపట్నం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. సమావేశంలో ఎంపీడీవో కె.ప్రభాకర్‌రావు, ఈవోపీఆర్టీ మల్లికార్జునరావు, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, డీటీ త్రివేణి, ఎంఈవో కిరణ్మయి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వెంకట్రావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T06:26:44+05:30 IST