గోతుల రహదారితో పాట్లు

ABN , First Publish Date - 2021-10-18T05:57:28+05:30 IST

మండలంలోని సబ్బవరం- చోడవరం రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. ఈ రోడ్డు సబ్బవరం నుంచి బంగారమ్మపాలెం వరకు పూర్తిగా గోతులమయంగా ఉండడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు.

గోతుల రహదారితో పాట్లు
ఆరిపాక సమీపంలో టెక్కలిపాలెం జంక్షన్‌ వద్ద గోతులు

అధ్వానంగా సబ్బవరం- చోడవరం రోడ్డు

వాహనచోదకులకు తప్పని అవస్థలు

పట్టించుకోని అధికారులు

సబ్బవరం, అక్టోబరు 17 : మండలంలోని సబ్బవరం- చోడవరం రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. ఈ రోడ్డు సబ్బవరం నుంచి బంగారమ్మపాలెం వరకు పూర్తిగా గోతులమయంగా ఉండడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. గత మూడేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మరింత దారుణంగా తయారైంది. ముఖ్యంగా గొటివాడ, ఆరిపాక, టెక్కలి పాలెం జంక్షన్‌ వద్ద, చినయాతపాలెం, కొత్తపాలెం, బంగారమ్మపాలెం కాలనీ వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది.  ఈ ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో గోతులు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. దీని వల్ల వాహనచోదకులు రాత్రి వేళల్లో అదుపు తప్పి పడిపోతున్నారని స్థానికులు తెలిపారు. గోతుల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-18T05:57:28+05:30 IST