పెదవాగు మింగేసింది.. ఆరుగురు యువకుల దుర్మరణం

ABN , First Publish Date - 2020-10-29T18:12:48+05:30 IST

ఆ ఊరు ఘొల్లుమంది. తమ కళ్ల ముందే ఆరుగురు యువకులను వాగు మింగేయడంతో తట్టుకోలేక పోయింది. గుండెలవిసేలా రోదించింది. అప్పటి వరకు ఎంతో హుషారుగా.. దసరా ఉత్సవాలను నిర్వహించారు. వన భోజనాలకు పనులు చక్కబెట్టిన ఆ యువకులు ఇక లేరన్న వార్త గ్రామస్థులను తీవ్రంగా కలిచివేసింది. ఆ ఊరి పేరు భూదేవిపేట. మండలం వేలేరుపాడు. మొత్తం నాలుగొందల గడప. సుమారు రెండు వేల మంది జనాభా.

పెదవాగు మింగేసింది.. ఆరుగురు యువకుల దుర్మరణం

వన విహారంలో మహా విషాదం

ఈతకు దిగి ఆరుగురు యువకుల దుర్మరణం

కడుపు కోత మిగిల్చిన దసరా ఉత్సవాలు

భూదేవిపేటలో ఘటన.. మిన్నంటిన రోదనలు

ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి.. 

ఒక్కో కుటుంబానికి మూడు లక్షల పరిహారం


వేలేరుపాడు(పశ్చిమ గోదావరి జిల్లా) : ఆ ఊరు ఘొల్లుమంది. తమ కళ్ల ముందే ఆరుగురు యువకులను వాగు మింగేయడంతో తట్టుకోలేక పోయింది. గుండెలవిసేలా రోదించింది. అప్పటి వరకు ఎంతో హుషారుగా.. దసరా ఉత్సవాలను నిర్వహించారు. వన భోజనాలకు పనులు చక్కబెట్టిన ఆ యువకులు ఇక లేరన్న వార్త గ్రామస్థులను తీవ్రంగా కలిచివేసింది. ఆ ఊరి పేరు భూదేవిపేట. మండలం వేలేరుపాడు. మొత్తం నాలుగొందల గడప. సుమారు రెండు వేల మంది జనాభా. ఈ ఊరి చరిత్రలో మహా విషాద ఘటన ఇది. విగత జీవుల కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగాయి. ఇక్కడ ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సంద్రమే..! 


దసరా వచ్చిందంటే చాలు. ఆ ఊరి ప్రజల ఆనందా లకు అవధులుండవు. తొమ్మిది రోజులపాటు శరన్నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకుని.. విజయదశమిని మరింత ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది అలాగే గడిపారు. సోమవారం అమ్మవారిని ఊరేగించి నిమ జ్జనం చేశారు. బుధవారం ఊరందరికీ వసంతవాడ దగ్గర పెద వాగు బ్రిడ్జి పక్కన వన భోజనాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఊరంతా తలో చేయి వేశారు. ఎవరు చేయాల్సిన పనులు వారికి అప్పగించారు. వంటకు కావాల్సిన సామగ్రిని చేర్చేందుకు ఏడుగురు విద్యార్థులు ముందుకు వచ్చారు. గంగాధర వెంకట్రావు (17), శ్రీరాముల శివాజీ (16), గొట్టిపర్తి మనోజ్‌ (18), కన్నాటి రంజిత్‌ (21),  కెల్లా భువనసాయి (16), కూనవరపు రాధాకృష్ణ (19)తోపాటు మరో యువకుడు బాడిస రాము నీళ్లు, కట్టెలు, పొయ్యి, వంట సామగ్రిని సిద్ధం చేశారు. అందరితోనూ సరదాగా కబుర్లు చెబుతూ తమకు అప్పగించిన పనులను పూర్తిచేశారు. 


స్నానాలకు వెళ్లి తిరిగి రాలేదు

ఇక తాము స్నానాలకు వెళ్లి వస్తామని పది గంటల సమయంలో పెద వాగులోకి దిగారు. ముందున్న ప్రమాదాన్ని పసికట్టలేకపోయారు. వాగు వెడల్పు, లోతు తక్కువగా ఉండటంతో ఈ ఒడ్డు నుంచి అవతలవైపు వెళ్లారు. కానీ, తిరిగి వచ్చే క్రమంలో కొంత పక్కగా రావడంతో యువకులంతా అగాథం లాంటి సుడిగుండం లోకి జారుకున్నారు. వీరిని రక్షించే యత్నం చేయబోయిన రాము నీళ్లల్లోకి జారి పోయినప్పటికీ ఎలాగోలా బయటపడ్డాడు. తన కళ్ల ఎదుటే సన్నిహితులు మునిగి పోవడంతో గట్టిగా కేకలు వేయడంతో.. వన భోజన ఏర్పాట్లలో వున్న మహిళలు, పురుషులు వాగు వద్దకు చేరుకున్నారు. అప్పటికే యువకులంతా వాగులో పూర్తిగా మునిగిపోయారు. వెంటనే చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు గంగాధర వెంకట్రావు మృత దేహం వెలికితీశారు. వీరు మునిగిపోయిన ప్రాంతం అత్యంత లోతుగా ఉండటంతో మృతదేహాల వెలికితీత సాధ్యం కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న కుక్కునూరు సీఐ బాల సురేష్‌బాబు, వేలేరుపాడు, కుక్కునూరు ఎస్‌ఐలు సుధీర్‌, పైడిబాబు, వైసీపీ నాయకుల సహాయంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలను మరిం త ముమ్మరం చేశారు. నాలుగు గంటల సమయానికి మిగిలిన ఐదుగురి మృతదే హాలను వెలికితీశారు. మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు విగత జీవులై పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. చనిపోయిన వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే.


ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ 

ఆరుగురు యువకుల మృత్యువాత పడ్డ సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్‌, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఘటనా స్థలానికి చేరుకు న్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఎస్పీ విలేకరులతో మాట్లా డుతూ ఉత్సవాలు చేసుకోవడం ముఖ్యమే కానీ ప్రాణాలు కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని వాగులు, నదుల వద్ద విందు ఏర్పాట్లు చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అన్నారు. లేకపోతే ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఇది మహా విషాద సంఘటన అని బాధిత కుటుంబాలను ఎలా ఓదార్చాలో తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు తాను వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు.


దర్యాప్తు చేస్తున్నాం : సీఐ బాల సురేష్‌బాబు

‘వసంతవాడ పెదవాగు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చి గజ ఈతగాళ్లతో మృత దేహాలను వెలికి తీయించాం. బాధిత కుటుంబాల అభ్యర్థన మేరకు మృతదేహాలకు ఘటనా స్థలంలోనే జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను బంధువులకు అప్పగించాం’ అని కుక్కు నూరు సీఐ బాల సురేష్‌బాబు తెలిపారు.


మూడు లక్షల పరిహారం : సీఎం జగన్‌

‘వాగులో మునిగి ఆరుగురు యువకులు మృతి ఘటనపై సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న యువకులకు మృతి చెందడంతో వారి కుటుంబాలను ఆదు కునేందుకు ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిం చారు’ అని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లాను. ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పరిహారం ప్రకటించినట్టు చెప్పారు. 


మృత్యువులోనూ కలిసే..

గొట్టుపర్తి మనోజ్‌, కర్నాటి రంజిత్‌, కెల్లా భువనసాయి చిన్నప్పటి నుంచి  స్నేహితులు. గ్రామంలో జరిగే దైవ సంబంధిత పూజల్లో వీరు త్రిమూర్తుల్లా వ్యవహరిస్తూ భక్తు లకు సేవ చేయడంలో నిమగ్నమ య్యేవారు. ఇదే క్రమంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లోనూ అందెవేసిన చేయిగా వ్యవహరించారు.  బుధవారం వన భోజనాల్లో తమకు అప్పగించిన బాధ్యతలను ఎంతో ఉత్సాహంగా నెరవేర్చారు. అనంతరం వాగులో స్నానం చేసేందుకు వెళ్లి ఒకేసారి మరణించడం అత్యంత విచారకరం. మరణంలోను ఒక్కటైన వీరి స్నేహాన్ని గ్రామస్థులు తలుచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కళ్ల ముందే కూరుకుపోయారు: ప్రాణాలతో బయటపడిన రాము

భోజనాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆరుగురితో కలిసి పెద వాగు అవతలకు వెళ్లాం. వెళ్లి న దారిలో కాకుండా మరో మార్గంలో తిరిగి రావడం తో వాగు నడిభాగానికి చేరుకున్న సమయం లో అక్కడ పెద్ద సుడి గుండం ఉందని తెలియక అందరం చేతులు పట్టుకు వస్తున్నాం. ఈ క్రమంలో వెనుక ఉన్న ఐదుగురు యువకులు సుడి గుండంలోకి జారిపో యారు. వారిని రక్షించేం దుకు శివాజీ నేను ప్రయ త్నించాం. శివాజీ అందులో ఒకరి చేయి పట్టుకోగా వారు వెనక్కి లాగడంతో శివాజీ కూడా మునిగిపోయాడు. వారిని రక్షించేందుకు నేను కూడా సుడిగుండంలోకి దూకగా అప్పటికే వారు పూర్తిగా మునిగిపోయారు. ఎలాగోలా నేను బయటపడ్డా. నా కళ్ల ముందే ఆరుగురు మునిగిపోవడంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే పెద్దగా కేకలు వేస్తూ అందరినీ పిలిచాను. వారు వచ్చేలోపే ఆరుగురు మునిగిపోయారు.

Updated Date - 2020-10-29T18:12:48+05:30 IST