పెరట్లో నక్కిన ఎలుగుబంటి... ఆ ఇంట్లో నుంచి మహిళ బయటికి రాగానే..

ABN , First Publish Date - 2020-05-28T17:46:58+05:30 IST

ఆకలితో ఓ మార్కెట్ యార్డులో చొరబడిన ఎలుగుబంటి చివరికి 65 ఏళ్ల ఓ మహిళను తీవ్రంగా గాయపర్చి, అంధురాలిని చేసిన వైనమిది..

పెరట్లో నక్కిన ఎలుగుబంటి... ఆ ఇంట్లో నుంచి మహిళ బయటికి రాగానే..

బెంగళూరు: ఆకలితో ఓ మార్కెట్ యార్డులో చొరబడిన ఎలుగుబంటి చివరికి 65 ఏళ్ల ఓ మహిళను తీవ్రంగా గాయపర్చి, అంధురాలిని చేసిన వైనమిది.. సోమవారం తెల్లవారు జామున బెంగళూరు సమీపంలోని చెన్నపట్నలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని చెన్నపట్న మున్సిపాలిటీ మాజీ వైస్‌ప్రెసిడెంట్ సాకమ్మగా గుర్తించారు. ఎలుగుబంటి దాడిలో ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా గాయాలుకాగా.. కనుగుడ్లు సైతం బయటికి వచ్చేశాయి. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన ఈ ఘటనపై వివరాల్లోకి వెళితే.. 


సోమవారం తెల్లవారు జామున 3:30 గంటలకు ఏఎంపీసీ మార్కెట్ యార్డులోకి ఓ ఎలుగుబంటి చొరబడినట్టు కూలీలు గుర్తించారు. ఆకలితో ఉన్న సదరు ఎలుగుబంటి మార్కెట్ ఆవరణంలోని మామిడి, పనస పండ్ల వాసనకు వచ్చివుంటుందని భావిస్తున్నారు. వేటగాళ్లు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరక్కుండా పారిపోతుండడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు మొదట స్థానికులను అప్రమత్తం చేశారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రావద్దంటూ మైకుల్లో ప్రకటించారు. ఈలోగా ఎలుగుబంటి మార్కెట్ పక్కనే ఉన్న సాకమ్మ ఇంటి పెరట్లోకి దూరి అక్కడే నక్కింది. ఈ విషయం తెలియని ఆమె ఉదయం 5 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. అంతే.. అప్పటికే పెరట్లో మాటువేసిన ఎలుగుబంటి ఆమెపై దాడి చేసి ముఖమంతా రక్కేసింది. కనుగుడ్లను కూడా పీకేసింది తీవ్రంగా గాయపర్చింది. సాకమ్మ కేకలు విని బయటికి వచ్చిన ఆమె కుమారుడిపైనా దాడి చేసి అడవిలోకి పారిపోయింది. కాగా ఇటీవలి కాలంలో ఓ అడవి జంతువు ఇక్కడి జనావాసాల్లోకి రావడం ఇదే తొలిసారి అని ఫారెస్ట్ రేంజ్ అధికారి మహ్మద్ మన్సూర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-28T17:46:58+05:30 IST