జిల్లాలో స్వల్ప భూకంపం...!

ABN , First Publish Date - 2021-10-24T04:17:36+05:30 IST

మంచిర్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం భూమి స్పల్పంగా కంపించింది. సరిగ్గా 2 గంటల 3 నిమిషాల ప్రాంతంలో ప్రకంపనలు రాగా 3 సెకన్లపాటు కంపించినట్లు ప్రజలు తెలిపారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి పరుగెత్తారు.

జిల్లాలో స్వల్ప భూకంపం...!
జిల్లా కేంధ్రంలో భూ ప్రకంపనలకు దర్వాజకు ఏర్పడిన పగుళ్లు

3 సెకన్లపాటు కంపించిన భూమి

భయాందోళనకు గురైన ప్రజలు

ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు

ఐదు సంవత్సరాల తరువాత పునరావృతం

మంచిర్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం భూమి స్పల్పంగా కంపించింది. సరిగ్గా 2 గంటల 3 నిమిషాల ప్రాంతంలో ప్రకంపనలు రాగా 3 సెకన్లపాటు కంపించినట్లు ప్రజలు తెలిపారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి పరుగెత్తారు. జిల్లా కేంద్రంలోని సున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్‌, కాలేజ్‌ రోడ్డు, రాంనగర్‌, పాత మంచిర్యాల, అమ్మగార్డెన్‌ ఏరియాలో భూ ప్రకంపనలు వచ్చాయి.  జిల్లా కేంద్రంలోని హమాలివాడ అశోక్‌రోడ్డులోని కోమటిపల్లి రమేష్‌కు చెందిన ఇల్లు ప్రధాన ద్వారం వద్ద పగుళ్లు ఏర్పడగా, మెట్ల వద్ద పాక్షిక పగుళ్లు సంభవించాయి. కాలేజ్‌రోడ్డులోని విద్యానగర్‌కు చెందిన బేర ప్రభాకర్‌ ఇంట్లో బాత్రూం నుంచి స్లాబ్‌ వరకు గోడకు స్వల్ప పగుళ్లు ఏర్పడ్డాయి. భూ ప్రకంపనల సందర్భంగా ఇళ్లలోని వస్తువులు కదిలాయని, ఊయలలో ఊగిన అనుభూతి కలిగినట్లు ప్రజలు తెలిపారు. 

ఐదేళ్లకు పునరావృతం...

ఐదేళ్ల అనంతరం జిల్లాలో భూకంపం వచ్చింది. 2016 నవంబర్‌ 17న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు మూడు నుంచి ఐదు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పుడు నస్పూర్‌, సీతారాంపల్లి, తీగల్‌ పహాడ్‌, సింగాపూర్‌, తాళ్లపల్లి, జైపూర్‌ మండలం ఇందారం, రామారావుపేటతోపాటు జిల్లా కేంధ్రంలోని శ్రీశ్రీ నగర్‌, సున్నంబట్టివాడ, రాంనగర్‌, జన్మభూమి నగర్‌ ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ప్రస్తుతం అదే రీతిలో, అవే ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో ప్రారంభమై మంచిర్యాల వైపు సంభవించినట్లు ప్రజలు భావిస్తున్నారు.  శ్రీశ్రీనగర్‌లోని పలు ఇళ్లలో వస్తువులు పడిపోగా మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వార్డు కౌన్సిలర్‌ సుధమల్ల హరికృష్ణలు పరిశీలించారు. 

నస్పూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో శనివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయందోళనకు గురైన ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు పరుగుతీశారు. రెండు సెకన్ల పాటు భూమి ఊగినట్లు కావడంతో ఇళ్ళలోని గిన్నెలు, గ్లాసులు కింద పడిపోయాయి. నస్పూర్‌ కాలనీ, గోదావరి, నాగార్జున, ప్లడ్‌ కాలనీ, శ్రీరాంపూర్‌ కాలనీ, సీతారాంపల్లి, సీసీసీ ఏరియాల్లో కొద్ది సేపు భూమి ఊగినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. ప్రజలు ఇళ్ళ ముందర గుమిగూడి భూప్రకంపనలపై చర్చించుకున్నారు. సింగరేణి ప్రాంతం కావడంతో ఓపెన్‌ కాస్టు పేలుళ్ల ప్రభావం కావచ్చని భావించారు. ఓపెన్‌ కాస్టు తవ్వకాలకు సంబంధించి మధ్యాహ్నం 3గంటల తరువాతనే పేలుళ్ళు జరుగుతాయి. భూకంప ప్రభావం అని తెలియడంతో జనాలు భయందోళనకు గురయ్యారు. 

Updated Date - 2021-10-24T04:17:36+05:30 IST