HYD : ఆ బాధ్యత ప్రైవేటుకే.. తప్పనిసరి చేసిన Modi Sarkar..!?

ABN , First Publish Date - 2021-10-18T15:07:49+05:30 IST

గ్రేటర్‌ అంతటా స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకురావాలని...

HYD : ఆ బాధ్యత ప్రైవేటుకే.. తప్పనిసరి చేసిన Modi Sarkar..!?

  • స్మార్ట్‌ మీటర్లు పెంచేలా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రణాళికలు
  • వినియోగదారులపై భారం లేకుండా మీటర్ల ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ అంతటా స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన విద్యుత్‌ శాఖ ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. వినియోగదారులపై భారం పడకుండా ఆ మీటర్ల ఏర్పాటు, నిర్వహణ ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించాలని డిస్కం యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో సుమారు 35-40 శాతం స్మార్ట్‌ మీటర్లకు ఖర్చు చేయనుంది. ఒకేసారి పెద్దసంఖ్యలో అందుబాటులోకి తీసుకువస్తే స్మార్ట్‌మీటర్లకు అయ్యే వ్యయం తగ్గే అవకాశాలుంటాయని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు ఏజెన్సీలను ఎంపిక చేసి కొన్నేళ్ల పాటు ఆ సంస్థలకే అప్పగిస్తే ఇబ్బందులుండవని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) భావిస్తోంది. 2025 నాటికి పూర్తిస్థాయిలో స్మార్ట్‌ మీటర్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.


ఎస్‌ఎంఎస్‌ రూపంలో బిల్లులు..

గ్రేటర్‌లో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, అస్పత్రులు, పార్కుల్లో ప్రీపెయిడ్‌ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఏడాదిన్నర క్రితమే జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో స్మార్ట్‌గ్రిడ్‌ ప్రాజెక్టు పేరుతో ఎనిమిది వేలకు పైగా గృహ వినియోగదారులకు సింగిల్‌ ఫేజ్‌ మీటర్లను అమర్చారు. వీటితో పాటు, 11 కేవీ ఫీడర్ల ఆటోమేషన్‌ కోసం ఆటో - రేక్లొజర్స్‌, ఫాల్డ్‌ పాసేజ్‌ ఇండికేటర్స్‌ వంటి ఆటోమేషన్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. స్మార్ట్‌మీటర్ల విధానంలో నేరుగా వినియోగదారుల సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో విద్యుత్‌ బిల్లులు చేరుతాయి. ప్రతీ యూనిట్‌ పక్కాగా లెక్కించే అవకాశముంటుంది. శ్లాబ్‌ రేట్లు మారే అవకాశాలు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఏ సమయంలో ఎక్కువ విద్యుత్‌ వినియోగించారనే సమాచారం వినియోగదారులు తెలుసుకునే వీలుంటుంది. ఆన్‌లైన్‌ ద్వారానే అదనపు లోడ్‌ను క్రమబద్దీకరించుకునే అవకాశాలు వినియోగదారులకు ఉంటాయని పేర్కొంటున్నారు.


అక్రమాలకు పాల్పడితే చర్యలు..

గ్రేటర్‌లో ప్రతి నెలా కొత్తగా ఇచ్చే విద్యుత్‌ కనెక్షన్ల మంజూరుపై తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్‌) ప్రత్యేక దృష్టి సారించింది. అపార్ట్‌మెంట్లకు కొత్త కనెక్షన్‌ మంజూరు, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో ఎస్టిమేషన్లు రూపకల్పనకు కొంత మంది అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆరోపణలు అధికంగా వస్తున్న సర్కిల్‌ డివిజన్‌ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా డిస్కం చర్యలు తీసుకుంది.


వేతనాలు నిలిపివేత..

అక్టోబర్‌ నెలలో కార్పొరేట్‌ ఆఫీ‌స్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు ఏడుగురు సీజీఎం స్థాయి అధికారులు, 50 మందికి పైగా సిబ్బంది బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేయలేదని, వారి వేతనాలు నిలిపివేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి విధిగా బయోమెట్రిక్‌ హాజరుతో పాటు సమయపాలన పాటిస్తామని చెప్పడంతో వేతనాలు విడుదల చేశారు. ఎస్‌ఈ స్థాయి అధికారులతో పాటు డీఈ, ఏడీఈ, ఏఈలు క్షేత్రస్థాయిలో విధిగా పర్యటించి విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Updated Date - 2021-10-18T15:07:49+05:30 IST