ఆ అలవాటుతో గుండెకు చేటు

ABN , First Publish Date - 2020-10-04T05:30:00+05:30 IST

మనదేశంలో గుండె సంబంధమైన జబ్బులతో మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆడామగా అనే తేడా లేకుండా అందరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. భారత దేశంలో 70 ఏళ్ల లోపున్న వారిలో సుమారు 52 శాతం మంది గుండె సంబంధ సమస్యలతో అకాలమరణం చెందుతున్నారు...

ఆ అలవాటుతో గుండెకు చేటు

మనదేశంలో గుండె సంబంధమైన జబ్బులతో మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆడామగా అనే తేడా లేకుండా అందరూ  గుండె జబ్బుల బారిన పడుతున్నారు. భారత దేశంలో 70 ఏళ్ల లోపున్న వారిలో సుమారు 52 శాతం మంది గుండె సంబంధ సమస్యలతో అకాలమరణం చెందుతున్నారు.


గుండె సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం పొగతాగే అలవాటు ఉండడం. అంతేకాదు స్మోకింగ్‌ వల్ల కరోనా బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనాతో మరణించిన వారిలో గుండె సంబంధ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారే ఎక్కువని తెలిసిందే. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొగతాగే అలవాటు ఉన్నవారు వెంటనే మానేయాలని చెబుతున్నారు పరిశోధకులు. భారతీయుల్లో చాలామంది చిన్న వయసులోనే పొగతాగడం మొదలెడతారు. దాంతో వారిలో చిన్న వయసులోనే గుండె సమస్యలు తలెత్తుతాయి. మనదేశంలో ప్రతిరోజు 6 శాతం మంది సిగరెట్‌ తాగుతారు. వయసుతో పాటు సిగరెట్‌ అలవాటు పెరుగుతుంది. పొగాకు కారణంగా సగటున ఏడాదికి 4,49,844 మరణాలు సంభవిస్తున్నాయి. వీరిలో 16 శాతం మంది గుండె సంబంధిత జబ్బులతో చనిపోతున్నారు. సిగరెట్‌ తాగడం వల్ల కరోనరీ అనే గుండె జబ్బు వచ్చే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి కూడా. పొగతాగని వారితో పోల్చితే పొగతాగేవారిలో గుండె సమస్యల ముప్పు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువని, గుండె సమస్యలతో చనిపోయే వారి శాతం 70శాతం కన్నా ఎక్కువని ఒక అధ్యయనం చెబుతోంది. అంతేకాదు పొగతాగేవారు అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది. స్మోకింగ్‌ అలవాటును మానిపిస్తే మనదేశంలో చాలా వరకు మరణాలను అడ్డుకోవచ్చు. ఈ విషయంపై ప్రజలు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అలాగే పొగాకు వాడకంపై నియంత్రణ ఉండాలి. లేదంటే ఎంతోమంది గుండె సమస్యలతో బాధపడతారు. 

గుండెపై ప్రభావం

గుండె ఆరోగ్యంపై స్మోకింగ్‌ ఎలా ప్రభావం చూపుతుంది అంటే... పొగతాగడం వల్ల రక్తం స్వభావంలో మార్పు వస్తుంది. హృదయ కండరాలలో కొవ్వు, కాల్షియం, కొలెస్ట్రాల్‌, ఇతర పదార్థాలు ఒక పొరలా చేరతాయి. దీంతో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు కొంతవరకు మూసుకుపోతాయి. సిగరెట్‌ పొగలోని రసాయనాలు రక్తాన్ని చిక్కగా మార్చి రక్తం గడ్డ కట్టేలా చేస్తాయి. దాంతో రక్తసరఫరాలో అవాంతరాలు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి ఫలితంగా గుండె సమస్యలు మొదలవుతాయి. ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. 

నిపుణుల మాట...

‘‘పొగతాగడం వల్ల ఊపిరితిత్తులకే కాదు గుండెకు అనర్థం జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి లేదా రోజూ పొగతాగేవారు ఆ అలవాటును మానుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రోజుకు ఒక్క సిగరెట్‌ తాగినా కూడా గుండెకు ముప్పు ఉన్నట్టే. రోజుకు 20 సిగరెట్లు తాగేవారు కూడా ఒక్కసారి పొగతాగడం మానేశారంటే వారు అయిదేళ్లలో గుండె సమస్యల నుంచి బయటపడొచ్చు’’ అంటున్నారు హృదయ నిపుణులు డాక్టర్‌ శ్రీధర్‌ కస్తూరి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం  సుమారు 80 శాతం తొలి దశ గుండె సమస్యలను, గుండెపోటు ముప్పును సకాలంలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. రక్తంలో చక్కెర శాతం పెరగడం, ఊబకాయం వంటి  సమస్యలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Updated Date - 2020-10-04T05:30:00+05:30 IST