ఈ చావులకి జవాబు చెప్పండి?

ABN , First Publish Date - 2021-05-11T08:54:32+05:30 IST

ఎవరి చేతగానితనం మావాళ్లను..

ఈ చావులకి జవాబు చెప్పండి?

ఊపిరి తీసిన నిర్లక్ష్యం

రాత్రి 7.00-7.30 నడుమ ఘోరం

అడుగంటిన ఆక్సిజన్‌

ఒత్తిడి తగ్గిపోయి నిలచిపోయిన సరఫరా

మృతులు 11 మంది అని కలెక్టర్‌ ప్రకటన

22 దాకా ఉండచ్చని అంచనా


తిరుపతి(ఆంధ్రజ్యోతి): రొప్పుతున్నారు..రోదిస్తున్నారు..అరుస్తున్నారు.. పరుగులు తీస్తున్నారు.. కోపంతో ఊగిపోతున్నారు.. ఎవరినో తిడుతున్నారు..దేన్నో కొడుతున్నారు..ప్రాణాలు పోయాల్సిన ఆసుపత్రే ప్రాణాలు తాగేసిందంటూ గుండెలు బాదుకుంటున్నారు.. ఎవరు...ఎవరు..ఎవరు.. మా అన్నని.. మా తండ్రిని.. మా అక్కని.. మా అమ్మని.. మా బిడ్డని.. తెచ్చిస్తారా? తిరిగి ప్రాణాలతో అప్పగిస్తారా? ఎవరు చంపేశారయ్యా? ఎవరి చేతగానితనం  మావాళ్లను బలితీసుకున్నది? ఎవరి నిర్లక్ష్యం ఇన్ని ప్రాణాలు మింగేసింది? చెప్పండి.. నోరు విప్పండి.. జవాబు చెప్పండి... అంటూ రోగుల బంధువులు ఆగ్రహంతో, ఆవేదనతో,  భయంతో , బాధతో రుయా ఆవరణంతా కలియదిరుగుతూ ఒక దుఃఖోన్మాద స్థితిలో కనిపించారు.


ఈ చావులకి జవాబు చెప్పండి?

ప్రజల ప్రాణాలు కాపాడలేని అసమర్థ స్థితి మరోమారు బట్టబయలైంది. తిరుపతి రుయా ఆసుపత్రి కోవిడ్‌ బాధితుల పాలిట మరణవేదికగా మారిపోయింది. ప్రాణవాయువు అందని రోగులు గిలగిలా కొట్టుకుంటూ వాలిపోయారు. కొందరు మరణించారు. మరికొందరు అచేతనం అయ్యారు. ఆక్సిజన్‌ అందడం లేదని అర్థమైన బంధువులు చేతికి అందిన వస్తువుతో బెడ్‌మీదున్న రోగులకు గాలి విసురుతూ ప్రాణాలు నిలపడానికి ఆరాటపడ్డారు. రోగుల ఆర్తనాదాలు.. బంధువుల ఆగ్రహావేదనాభరితమైన అరుపులు.. వైద్య సిబ్బంది ప్రయత్నాలు.. యుద్ధరంగంలోని ఒక బీభత్సవాతావరణాన్ని తలపించింది. ఆక్సిజన్‌ మాస్క్‌ సరిచేస్తూ ఒకరు, ఆక్సిజన్‌ అందక ఎగిరెగిరి పడుతున్న రోగి గుండెల మీద గుద్దుతూ మరొకరు, వెంటిలేటర్‌ కేసి నిర్వికారంగా చూస్తూ మరొకరు... ఒకరొకరుగా బలైపోయారు. అసహాయులై రాలిపోయారు. గుండెడు దుఃఖం మిగిల్చి చచ్చిపోయారు. కడుపు రగిలిన రోగుల బంధువులు, తమవాళ్ల ప్రాణాలు కాపాడలేకపోయిన వెంటిలేటర్లను ధ్వంసం చేశారు. కనిపించిన వస్తువులను పగుల గొట్టారు. రుయా సిబ్బంది భయంతో పరుగులు తీశారు. గదుల్లో దాంకున్నారు. ఆ గదుల తలుపులనూ మోదుతూ, ఏడుస్తూ... పానిక్‌గా మారిపోయారు. 



అసలేం జరిగింది?

జిల్లాస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ఉన్న రుయాలో జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచీ కూడా కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ సెంటర్‌ సమీపంలోనే 11 కేఎల్‌ సామర్థ్యం కలిగిన లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ వుంది. ఆ ప్లాంట్‌లోని ట్యాంకు నుంచే ఐసీయూలోని 51 వెంటిలేటర్‌ పడకలకు, ఆక్సిజన్‌ బెడ్లకు ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయానికి ప్లాంట్‌లోని ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు అయిపోతాయని సిబ్బంది ముందుగానే అధికారులకు సమాచారమిచ్చారు. దానికనుగుణంగా ప్లాంటుకు ఆక్సిజన్‌ సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లారీ చెన్నై నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరింది. గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించి ప్రయాణం చేసే పరిస్థితి లేనందున ట్యాంకర్‌ రావడం ఆలస్యమైంది. సరిగ్గా రాత్రి 7 గంటలకు ప్లాంట్‌లోని ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు 3 కేఎల్‌ సామర్ధ్యానికి పడిపోయాయి. దాంతో తగినంత కంప్రెషర్‌ అందక ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లకు, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో వున్న వెంటిలేటర్‌ బెడ్లకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో వెంటిలేటర్లపై 51మంది కొవిడ్‌ బాధితులుండగా వారిలో 25మందికి పైగా మృతి చెందినట్టు చెబుతున్నారు. మరో పది మందికిపైగా బాధితుల పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం. అలాగే గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లలో వున్న బాధితుల్లో కూడా నలుగురు విషమ స్థితికి చేరుకున్నట్టు సమాచారం. 


ఐసీయూ ధ్వంసం

ఈ ఘటనలో తమ వారు కళ్ళెదుటే ఆక్సిజన్‌ అందక గిలాగిలా కొట్టుకుంటూ కొందరు, అచేతనంగా మారిపోయి కొందరు విగతజీవులుగా మారడం, మరికొందరు విషమ స్థితికి చేరడంతో వార్డుల్లోని వారి కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వైద్యులను, సిబ్బందిని, ప్రభుత్వాన్ని తిడుతూ వెంటిలేటర్లను, వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బందిపై దాడికి కూడా యత్నించడంతో భయాందోళనకు గురైన వైద్యులు, సిబ్బంది పారిపోయారు. సమాచారమందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుల బంధువులను అదుపు చేసి వైద్యసిబ్బందికి రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. రుయా యంత్రాంగం వల్లే ఇలా జరిగిందని వారు ఆరోపించారు. 


ఆక్సిజన్‌ అందని క్షణాలు

రుయా కొవిడ్‌ సెంటర్‌లోని ఐసీయూ వార్డు, ఆక్సిజన్‌ పడకల వార్డులో కలిపి దాదాపు 135 మంది చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్లపై ఉన్న వారు, ఎన్‌ఆర్బీ, ఎన్‌ఐవీ మాస్కు ద్వారా ఆక్సిజన్‌ పొందుతున్నారు. ఇంతలో ఐసీయూలోని వెంటిలేటర్లన్నీ ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా శబ్దాలు చేయడం మొదలుపెట్టాయి. ఏం జరుగుతోందో బాధితుల బంధువులకు అర్థం కాలేదు. ఆక్సిజన్‌ అందడంలేదని గ్రహించిన సిబ్బంది బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రీసస్సియేషన్‌) చేయడం మొదలుపెట్టారు. రాన్రానూ భీతావహంగా మారింది. ఆ తర్వాత కింది అంతస్తులోని ఆక్సిజన్‌ పడకల వార్డులో ఆందోళన మొదలైంది. అక్కడకూడా ఆక్సిజన్‌ క్రమంగా అందకపోవడంతో గందరగోళంగా మారింది. రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడగా 7.30 గంటలకల్లా ప్రమాదాన్ని గుర్తించిన ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా వెంటిలేటర్లకు ఆక్సిజన్‌ సరఫరా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రత్యామ్నాయ చర్యలతో పరిస్థితి ఏమీ చక్కబడలేదు. 7.45 గంటలకు ట్యాంకర్‌ వచ్చి ఆక్సిజన్‌ ఫిల్‌ చేయడంతో సరఫరా పునరుద్ధరించినట్టు అధికారులు చెబుతున్నారు.


అయితే తొలుత ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. విషమ స్థితిలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుల పాలిట ఆ కొద్ది నిమిషాలే మృత్యు ఘంటికలుగా మారాయి. ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయిన పర్యవసానంగా పరిస్థితి భయానకంగా మారింది. ఎటుచూసినా వెంటిలేటర్‌ బెడ్లపై అచేతనంగా పడివున్న బాధితులు, వారి చుట్టూ చేరి వైద్యులు, సిబ్బంది ఛాతీలపై బాదుతూ బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, బతికున్న వారి చుట్టూ సపర్యలు చేస్తున్న బంధుమిత్రులు, వారి రోదనలు, ఆర్తనాదాలతో భీతావహమైన వాతావరణం నెలకొంది.



నోటితో ‘శ్వాస’నిచ్చినా కాపాడుకోలేకపోయా 

మాది పుంగనూరు పక్కన కురవూరు. ఆరు రోజులుగా ఉన్నాం. రాత్రి 7.45 గంటల సమయంలో వెంటిలేటర్‌ నుంచి గాలి రాలేదు. ముక్కు వద్ద పెట్టినా ఫలితం లేదు. ఆ తర్వాత నా ఓపిక ఉన్నంత వరకు నోటితో గాలి వదిలా. ఎంతగా శ్వాసనిచ్చినా ఫలితం లేకపోయింది. 40 నిమిషాల తర్వాత వెంటిలేటర్‌ ఆన్‌ అయింది. అప్పటికే నా భర్త మృతిచెందారు. మాకు ఇద్దరు పిల్లలున్నారు. 



ఒక్కడినే మిగిలా 

మాది మదనపల్లె. మా నాన్న నాగభూషణ్‌రెడ్డి గత సోమవారం కొవిడ్‌తో మా ఊర్లోనే మృతిచెందారు. నేను, మా అమ్మ సులోచన రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్నాం. ఎన్‌ఐవీ మాస్కు ద్వారా అమ్మ చికిత్స పొందుతోంది. ఆక్సిజన్‌ స్థాయి 85 వరకు ఉంది. నేనూ పాజిటివ్‌ కావడంతో అమ్మకు సేవ చేసేందుకు పక్కనే ఉన్నా.  రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతామనుకునేలోపు జరగరానిది జరిగిపోయింది. అమ్మ, నాన్నలను పోగొట్టుకుని ఇప్పుడు ఒక్కడినే మిగిలా. 




11 మంది చనిపోయారు  కలెక్టర్‌ 

రుయాస్పత్రిలో శనివారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల 11మంది చనిపోయారని కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటించారు. ప్రమాద సమాచారంతో రుయాస్పత్రికి రాత్రి 10.45గంటలకు  చేరుకున్న ఆయన వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రుయాస్పత్రిలో వెయ్యిమందికి చికిత్స జరుగుతోందన్నారు.వీరిలో 700 మందికి ఆక్సిజన్‌ పడకలపై చికిత్స అందిస్తున్నారన్నారు.ఐదు నిమిషాలు ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల కొంతమంది చనిపోయారన్నారు. వెంటనే ఆక్సిజన్‌ ట్యాంకర్లు చెన్నై నుంచి చేరుకోవడంతో చాలా ప్రాణాలను రక్షించగలిగామన్నారు.పరిస్థితి అదుపులోనే వుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.తిరుపతి ఎంపీ గురుమూర్తి, మేయర్‌ శిరీష తదితరులు కూడా రుయాస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.



రెండోసారైనా అప్రమత్తం కాలేదు 

మా నాన్న కలంధర్‌ (50)ను ఈనెల 26న రుయాకు తీసుకొచ్చాం. మూడు రోజుల కిందట ఆక్సిజన్‌ ఆగిపోయింది. ఎందుకిలా జరిగిందని అడిగినా అప్పట్లో ఎవరూ సమాధానం చెప్పలేదు. ఇప్పటికి మా నాన్న రికవరీ అయ్యాడు. ఇంతలో మళ్లీ ఆక్సిజన్‌ ఆగింది. దీంతో ఒకసారిగా వణికిపోయాడు. అరగంట నుంచి 45 నిమిషాలపాటు ఆక్సిజన్‌ రాకపోవడంతో ఆయన మృతిచెందాడు. తొలుత జరిగాక అధికారులు అప్రమత్తంగా లేకపోవడంతో మళ్లీ ఇలా జరిగింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటాయని అంటున్నారు. 

Updated Date - 2021-05-11T08:54:32+05:30 IST