సామాజిక దూరం తప్పనిసరి

ABN , First Publish Date - 2020-03-30T09:23:02+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు ప్రజలు మంచి కోసమేనని రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆదివారం ఉండి

సామాజిక దూరం తప్పనిసరి

రేషన్‌ పంపిణీ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల సూచనలు

జాగ్రత్తలపై వ్యాపారులకు అవగాహన

నేటి నుంచి 11 గంటల వరకే రేషన్‌ పంపిణీ


ఉండి/ఆకివీడు/పెనుమంట్ర, మార్చి 29 : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు ప్రజలు మంచి కోసమేనని రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆదివారం ఉండి మండలం యండగండి, ఉండి, పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలోని రేషన్‌ దుకాణాలలో నిత్యవసర సరుకుల పంపిణీకి మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించి రేషన్‌ సరుకులు అందుకోవాలని జాగ్రత్తలు సూచించారు. సీలేరు నుంచి జలాలు విడుదల చేయించి తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.


వచ్చేనెల ఒకటి నుంచి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఆక్వారైతులకు ఎగుమతి దిగుమతి, సీడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విషయంలో ఎటువంటి ఇబ్బంది గాని కొనుగోలు, అమ్మకాలకు ఎటువంటి ఆంక్షలు లేవని మంత్రి రంగరాజు స్పష్టం చేశారు. ఆకివీడు హైస్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు బజారులోని కూరగాయలు, రేషన్‌ దుకాణాలను ఆదివారం మంత్రి పరిశీలించారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని ఆస్పత్రుల్లో ఐదు వేల బెడ్లు ఏర్పాటు చేశారన్నారు. చాగల్లులో మంత్రి వనిత రేషన్‌ పంపిణీ చేశారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ స్వీయ నియంత్రణతోనే కరోనా నివారణ సాధ్యమన్నారు.


గ్రామాల్లో పలువురి అత్యుత్సాహంతో వేస్తున్న అడ్డు కట్టల వల్ల పలువురికి ఇబ్బందిగా మారుతోంది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఇటువంటి ఇబ్బందే ఎదురైంది. ఆదివారం నల్లజర్ల మండలం ఆవపాడు, శింగరాజుపాలెం వెళ్తుండగా ఆవపాడు వద్ద రోడ్డుకు అడ్డంగా తాటిదుంగలు ఉండడంతో స్వయంగా ఆయనే కారు దిగి తొలగించుకోవాల్సి వచ్చింది. రోడ్లపై అడ్డంకులు వేయ వద్దని అత్యవసర సేవలు, అంబులెన్స్‌ వంటివి వేళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుందని హితవు పలికారు. నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి ప్రాంతంలోని రేషన్‌ దుకాణంలో పంపిణీ కార్యక్రమాన్ని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు పరిశీలించారు.

Updated Date - 2020-03-30T09:23:02+05:30 IST