దరఖాస్తు దశలోనే చెక్‌.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులకు కసరత్తు!

ABN , First Publish Date - 2021-06-25T18:22:57+05:30 IST

సర్కారీ భూములు, నిషేధిత స్థలాల్లో భవన నిర్మాణాలకు దరఖాస్తు దశలోనే చెక్‌

దరఖాస్తు దశలోనే చెక్‌.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులకు కసరత్తు!

  • నిషేధిత సర్వే నెంబర్లలో నిర్మాణాలకు..
  • టీఎస్-బీపాస్‌లో 30 శాతం దరఖాస్తులు అవే
  • ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల స్థలాల్లో నిర్మాణాలకు అప్లికేషన్లు
  • కొన్ని సర్కిళ్లలో వక్రమార్గంలో అనుమతుల జారీ
  • గుర్తించిన పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు
  • దిద్దుబాటు చర్యలకు శ్రీకారం
  • బై నెంబర్లు, ఇతర మార్పులు చేసినా.. 
  • దరఖాస్తు అప్‌లోడ్‌ కాకుండా చర్యలు

హైదరాబాద్‌ సిటీ : సర్కారీ భూములు, నిషేధిత స్థలాల్లో భవన నిర్మాణాలకు దరఖాస్తు దశలోనే చెక్‌ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. బై నెంబర్లు, ఇతరత్రా మార్పులతో నిషేధిత భూముల్లో నిర్మాణాల కోసం కొందరు దరఖాస్తు చేస్తోన్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన టీఎ్‌స-బీపా్‌సలో భాగంగా ఇన్‌స్టంట్‌ అనుమతులను కొందరు దుర్వినియోగం చేస్తోన్నట్టు గుర్తించిన బల్దియా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించకుండా తగిన చర్యలు చేపడుతోంది. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేస్తున్నట్టు పట్టణ ప్రణాళికా విభాగం అధికారొకరు తెలిపారు. టీఎ్‌స-బీపాస్‌ విధానంలో 75 చదరపు గజాల్లోపు స్థలంలో నిర్మాణాలకు అనుమతి అవసరం లేదు. 


75 నుంచి 500 చదరపు గజాల వరకు స్థలంలో నిర్మాణాలకు తక్షణ అనుమతి (ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌) పొందే అవకాశం ఉంది. పట్టణ ప్రణాళికా విభాగం నిబంధనల ప్రకారం ప్లాన్‌ రూపొందించి.. అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అనంతరం నిర్ణీత రుసుము చెల్లిస్తే అనుమతి లభిస్తుంది. దరఖాస్తు చేసిన 14 పనిదినాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు అనుమతి ఇవ్వాలా ..? తిరస్కరించాలా..? అన్న దానిపై నిర్ధారణకు వస్తారు. అప్పటి వరకు పనులు ప్రారంభించకూడదు. సర్కారీ భూముల్లో నిర్మాణాలకు దరఖాస్తు చేస్తోన్న అక్రమార్కులు.. అనుమతి వచ్చిందంటూ వెంటనే  పనులు మొదలు పెడ్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి రాదని తెలిసే కొందరు ఇలా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దరఖాస్తు చేసే అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు.


సర్వే నెంబర్లలో స్వల్ప మార్పులు చేసినా...

ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, బఫర్‌ జోన్‌ స్థలాలు, వక్ఫ్‌ బోర్డు, దేవాదాయ తదితర భూములకు సంబంధించిన సమాచారం సర్వే నెంబర్లతో సహా రెవెన్యూ విభాగం జీహెచ్‌ఎంసీకి ఇచ్చింది. దాని ఆధారంగానే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అనుమతులిస్తున్నారు. దరఖాస్తుదారుడు పేర్కొనే సర్వే నెంబర్‌ను పరిశీలిస్తోన్న అధికారులు.. ఆ సర్వే నెంబర్‌ నిషేధిత భూములకు సంబంధించినది అయితే అప్లికేషన్‌ను తిరస్కరిస్తున్నారు. ఆయా సర్వే నెంబర్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించకుండా ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. అయితే కొందరు బై నెంబర్లు, తెలుగు, ఆంగ్ల అక్షరాలు, ఫుల్‌స్టాప్‌(.), కామ(,) వంటివి పెట్టి దరఖాస్తు అప్‌లోడ్‌ చేస్తున్నారు. దరఖాస్తు చేసిన వెంటనే ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ అని పనులు మొదలు పెడ్తున్నారు. 


కొన్ని సర్కిళ్లలో క్షేత్రస్థాయిలో అధికారులను మేనేజ్‌ చేసి వక్ర మార్గంలో అనుమతులూ పొందుతున్నారు. వీటిని గుర్తించిన పట్టణ ప్రణాళికా విభాగం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. టీఎ్‌స-బీపా్‌సలో జీహెచ్‌ఎంసీకి వస్తోన్న దరఖాస్తుల్లో దాదాపు 30 శాతం వరకు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇందులో 95 శాతానికిపైగా నిషేధిత సర్వే నెంబర్లలోని స్థలాలకు సంబంధించిన దరఖాస్తులే అని ఓ అధికారి చెప్పారు. నిషేధిత సర్వే నెంబర్లకు సంబంధించి బై నెంబర్లు, ఇతరత్రా మార్పులు చేసినా.. దరఖాస్తు అప్‌లోడ్‌ కాకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నట్టు తెలిపారు. జూలై 1 నుంచి టీఎ్‌స-బీపాస్‌ పూర్తిస్థాయిలో అమలులోకి రానున్న నేపథ్యంలో చర్యలు వేగవంతం చేశారు. టీఎస్-బీపాస్‌లో 2,400 దరఖాస్తులు రాగా.. దాదాపు 700 తిరస్కరించారు. ఇందులో ప్రభుత్వ స్థలాలు, బఫర్‌జోన్‌, చెరువులు, కుంటలు తదితర భూముల్లో ఉన్నవే ఎక్కువగా ఉండడం గమనార్హం.

Updated Date - 2021-06-25T18:22:57+05:30 IST