ఏదో ఓ రోజు మొత్తం కశ్మీరు మనదవుతుంది : ఎయిర్ మార్షల్ అమిత్

ABN , First Publish Date - 2021-10-27T22:52:38+05:30 IST

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరును భారత్‌లో కలిపేందుకు

ఏదో ఓ రోజు మొత్తం కశ్మీరు మనదవుతుంది : ఎయిర్ మార్షల్ అమిత్

శ్రీనగర్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరును భారత్‌లో కలిపేందుకు ప్రస్తుతానికి ఎటువంటి ప్రణాళిక లేదని ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (ఏఓసీ-ఇన్-సీ), వెస్టర్న్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ చెప్పారు. ఏదో ఓ రోజు భారత దేశం మొత్తం కశ్మీరును తనలో భాగం చేసుకుంటుందని బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు. 


భారతీయ దళాలు బుడ్గామ్‌లో దిగడానికి సంబంధించి 75వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ దేవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు ఏదో ఓ రోజు భారత్ వశం అవుతుందని, అయితే దానిని మన సొంతం చేసుకునేందుకు ప్రస్తుతానికి ఎటువంటి ప్రణాళిక లేదని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీరులోని ప్రజలను పాకిస్థానీలు న్యాయంగా చూడటం లేదన్నారు. 1947 అక్టోబరు 27న భారత వాయు సేన, భారత సైన్యం నిర్వహించిన కార్యకలాపాల వల్ల భారత దేశంలోని కశ్మీరుకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు లభించాయన్నారు. ఏదో ఓ రోజు పాక్ ఆక్రమిత కశ్మీరు కూడా ఈ భాగంతో కలిసిపోతుందని కచ్చితంగా చెప్పగలనన్నారు. రానున్న సంవత్సరాల్లో యావత్తు కశ్మీరు భారత దేశంలో ఉంటుందని చెప్పారు. 


పాక్ ఆక్రమిత కశ్మీరును భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించినపుడు అమిత్ స్పందిస్తూ, ప్రస్తుతానికి అటువంటి ప్రణాళికలేవీ లేవన్నారు. కశ్మీరు అంతా ఒకటేనని, దేశం ఒకటేనని అన్నారు. ఇరువైపుల ప్రజలకు ఉమ్మడి అనుబంధాలు ఉన్నాయన్నారు. దేశాలు ఏకతాటిపైకి వచ్చాయని, చరిత్ర సాక్షిగా ఉందని అన్నారు. భగవంతుడు కోరుకుంటే సాధ్యమవుతుందన్నారు. 


పాకిస్థానీ గిరిజనులు దాడులు చేయడంతో కశ్మీరు మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత దేశంలో కలిపేందుకు అంగీకరిస్తూ సంతకం చేశారు. ఆ మర్నాడే, అంటే, 1947 అక్టోబరు 27న భారత దేశ దళాలు కశ్మీరు చేరుకున్నాయి. 


Updated Date - 2021-10-27T22:52:38+05:30 IST