పోలీసుల సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-10-26T06:41:17+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న మేడిశెట్టి నారాయణరావు కరోనా సెకండ్‌ వేవ్‌లో మృతిచెందారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అర్బన్‌ జిల్లా ఎస్‌పీ ఐశ్వర్య రస్తోగి స్థానిక స్పిన్నింగ్‌ మిల్లు కాలనీలో నివాసం ఉంటున్న వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

పోలీసుల సేవలు మరువలేనివి
హోంగార్డ్‌ నారాయణరావు కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎస్‌పీ ఐశ్వర్య రస్తోగి

  • హోంగార్డు కుటుంబానికి ఎస్పీ పరామర్శ
  • పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 25: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న మేడిశెట్టి నారాయణరావు కరోనా సెకండ్‌ వేవ్‌లో మృతిచెందారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అర్బన్‌ జిల్లా ఎస్‌పీ ఐశ్వర్య రస్తోగి స్థానిక స్పిన్నింగ్‌ మిల్లు కాలనీలో నివాసం ఉంటున్న వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

పోలీస్‌ సేవలపై వ్యాసరచన పోటీలు 

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 25: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్‌ కార్యాలయంలో ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌ విద్యార్థులకు ‘కరోనా సమయంలో నిస్వార్థంగా సేవలు అందించిన పోలీసులు’ అనే అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎస్పీ బహుమతులు అందించారు. అడిషనల్‌ ఎస్‌పీలు కె.లతామాధురి, సీహెచ్‌ పాపారావు, ఏఆర్‌ డీఎస్‌పీ వి.సత్తిరాజు పాల్గొన్నారు.

పోలీసుల త్యాగాలు మరువలేనివి: నార్త్‌జోన్‌ డీఎస్పీ

కోరుకొండ, అక్టోబరు 25: దేశంలో కోసం ప్రాణాలు అర్పించే పోలీసుల త్యాగాలు మరువలేనివని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఉత్తర మండలం డీఎస్పీ జె.వెంకటేశ్వర్రావు అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాల్లో భాగంగా సోమవారం కోరుకొండ పోలీస్‌స్టేషన్‌వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ కర్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మంగళవారం వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. దిశా యాప్‌ గురించి హైస్కూల్‌ విద్యార్థినులకు వివరించారు. సమావేశంలో సీఐ పవన్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ శారదా సతీష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

కొవ్వొత్తుల ర్యాలీ

కడియం, అక్టోబరు 25: కడియం సీఐ డి.రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌నుంచి దేవీచౌక్‌ సెంటర్‌వరకు సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శాంతిమయ భావితరాలకోసం తమ విలువైన ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీసు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

‘పోలీసుల త్యాగాలు స్మరించుకోవాలి ’

సీతానగరం: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని నార్త్‌జోన్‌ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు అన్నారు. సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు స్టేషన్‌లో పోలీస్‌ విధులు, ఎఫ్‌ఐఆర్‌ రికార్డులపై అవగాహన కల్పించామన్నారు. కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ శుభశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T06:41:17+05:30 IST