Badvel Election Results : తప్పిన వైసీపీ అంచనాలు.. కుమిలిపోతున్న బెట్టింగ్‌రాయుళ్లు!

ABN , First Publish Date - 2021-11-03T12:27:09+05:30 IST

గెలుపు కోసం అధికార వైసీపీ పోలింగ్‌ వ్యూహాలు పక్కాగా అమలు చేసింది....

Badvel Election Results : తప్పిన వైసీపీ అంచనాలు.. కుమిలిపోతున్న బెట్టింగ్‌రాయుళ్లు!

కడప : గెలుపు కోసం అధికార వైసీపీ పోలింగ్‌ వ్యూహాలు పక్కాగా అమలు చేసింది. స్థానికేతరులతో భారీగా దొంగ ఓట్లు వేసుకున్నారు.. సైక్లింగ్‌కు పాల్పడ్డారని ప్రతిపక్ష పార్టీల ప్రధాన ఆరోపణ. అందుకేనేమో.. లక్ష పైచిలుకు మెజార్టీ వస్తుందని, బీజేపీకి 10-15 వేల ఓట్లకు మించి రావని అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు అనంతరం వారి అంచనాలు బెడిసికొట్టాయి. ఎన్ని ఎత్తులు వేసినా లక్ష మెజార్టీ సాధించలేకపోయారు. వైసీపీ అభ్యర్థి డాక్టరు సుధా 90,533 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినా.. కొందరు వైసీపీ నాయకుల్లో ఆనందం కనబడడం లేదు.


లక్ష లక్ష్యం చేరకపోవడం.. బెట్టింగ్‌లో భారీగా నష్టపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పనతల సురే‌ష్‌ 21,673 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిస్తే.. 6235 ఓట్లు సాధించి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ రాజకీయంగా పుంజుకున్నారు. మిగిలిన 12 మంది అభ్యర్థులకు 3394 ఓట్లు వస్తే.. వారందరి కంటే ఎక్కువగా నోటాకు 3650 ఓట్లు రావడం కొసమెరుపు. బద్వేలు ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు చిత్రం ఇది.


లెక్క తప్పిందిలా..!

అట్లూరు, పోరుమామిళ, కలసపాడు, కాశినాయన మండలాలకు కడప, సిద్దవటం, సీకేదిన్నె, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల నుంచి భారీగా స్థానికేతరులను రప్పించి భారీగా దొంగ ఓట్లు వేసుకున్నారని బరిలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులు సురేష్‌, కమలమ్మ ఆరోపించారు. ఓట్ల లెక్కింపు రద్దు చేయాలని స్వతంత్ర అభ్యర్థి రత్నం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏకంగా ఆందోళనకే దిగారు. శనివారం పోలింగ్‌ ముగిసిన అనంతరం అదేరోజు రాత్రి కడప నగరంలో ఓ కీలక నాయకుడి ఆఫీసులో కొందరు అధికార పార్టీ ముఖ్య నాయకులు పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల లెక్కల వివరాలు.. గ్రామ స్థాయి నాయకుల నుంచి వారికొచ్చిన సమాచారం మేరకు వైసీపీ అభ్యర్థి సుధాకు లక్ష నుంచి 1.15 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అంచనా వేసినట్లు తెలిసింది. లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందనే ధీమాతో భారీగా బెట్టింగ్‌ కట్టినట్లు తెలిసింది. 


అంతేకాదు.. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 10-15 వేల ఓట్లకు మించి రావని కూడా భారీ ఎత్తున పందేలు కాసినట్లు సమాచారం. లక్ష మెజార్టీపై రూ.కోట్లలో బెట్టింగ్‌ జరిగిందని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. లక్ష అంచనా అందుకోలేకపోయారు. 90,533 ఓట్ల ఆధిక్యతలో వైసీపీ అభ్యర్థి సుధా విజయం సాధించినా.. లక్షపై నమ్మకంతో భారీగా పందెం కాసి నష్టపోయిన కొందరు నాయకులు, వైసీపీ సానుభూతిపరులు, బెట్టింగ్‌రాయుళ్లు మాత్రం లోలోన కుమిలిపోతున్నారు. అత్యుత్సాహం ఆర్థికంగా నష్టాల్లో పడేసిందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-11-03T12:27:09+05:30 IST