స్పుత్నిక్ లైట్ సామర్థ్యమెంత..?

ABN , First Publish Date - 2021-06-04T02:30:58+05:30 IST

కరోనా మహమ్మారి నియంత్రణకు మొట్టమొదట వ్యాక్సిన్ కనిపెట్టిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో తొలి వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో..

స్పుత్నిక్ లైట్ సామర్థ్యమెంత..?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణకు మొట్టమొదట వ్యాక్సిన్ కనిపెట్టిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో తొలి వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తయారు చేసింది. ఈ మధ్యనే ఈ వ్యాక్సిన్ భారత్‌కు కూడా చేరుకుంది. అయితే ఈ స్పుత్నిక్ వీతో పాటు ఇప్పటివరకు తయారైన అన్ని వ్యాక్సిన్లు కూడా రెండు డోసులు వేసుకోవాలి. మొదటి డోసు తర్వాత రెండో డోసును కొద్ది కాలం వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో ఒకే డోసు వ్యాక్సిన్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో మొదటిది అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్. దాని తరువాత ఇటీవలే రష్యా కూడా స్పుత్నిక్ లైట్ పేరుతో ఓ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) తయారు చేస్తోంది. అయితే ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత..? కరోనాను ఏ మేర అడ్డుకోలదు అనే ప్రశ్నలు ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తున్నాయి. 


ఈ క్రమంలోనే ఆర్‌డీఐఎఫ్‌ దీనిపై స్పందించింది. తమ వ్యాక్సిన్ 78.6శాతం నుంచి 83.7శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అర్జెంటీనాలో ప్రయోగాత్మకంగా కొంతమందికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చి పరీక్షించినట్లు తెలిపింది. బ్యూనోస్‌ ఏరియస్‌ ప్రావిన్స్‌(అర్జెంటీనా) ఆరోగ్య మంత్రిత్వశాఖ సేకరించిన గణాంకాల ప్రకారం 60-79 సంవత్సరాల వయసు కలిగిన 1.86లక్షల మందికి స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ‘పరీక్షల్లో భాగంగా 40వేల మంది స్పుత్నిక్‌లైట్‌ ఒక డోస్‌ మాత్రమే తీసుకున్నారు. స్పుత్నిక్‌ ఒక డోస్‌ తీసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 0.44శాతంగా ఉండగా, అసలు వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 2.74శాతంగా ఉంద’ని  వెల్లడించారు. 


ఈ విషయంలో ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రివ్‌ మాట్లాడుతూ.. ఈ ఫార్ములా ద్వారా వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని నిర్ధారించారు. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్‌ సామర్థ్యం 78.6శాతంగా ఉండగా, స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో ఏకంగా  83.7శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ 79.4శాతం సగటుతో పనిచేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. 

Updated Date - 2021-06-04T02:30:58+05:30 IST