విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి

ABN , First Publish Date - 2021-01-21T06:19:25+05:30 IST

వలస వెళ్లి...కష్టపడి... కూడబెట్టిన డబ్బులతో పాత ఇంటికి మరమ్మతులు చేసి అందంగా మెరుగులు దిద్ది చూసుకుందామనుకున్నారు. రెండు రోజుల పాటు పనులు చేయించారు. మరో రెండు రోజుల్లో ఎప్పటిలాగే హైదరాబాద్‌కు తిరిగి వలస వెళ్లాలనుకున్నారు.

విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి

గోకర్ణపురంలో విషాదం

మెళియాపుట్టి, జనవరి 20: వలస వెళ్లి...కష్టపడి... కూడబెట్టిన డబ్బులతో పాత ఇంటికి మరమ్మతులు చేసి అందంగా మెరుగులు దిద్ది చూసుకుందామనుకున్నారు. రెండు రోజుల పాటు పనులు చేయించారు. మరో రెండు రోజుల్లో ఎప్పటిలాగే హైదరాబాద్‌కు తిరిగి వలస వెళ్లాలనుకున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. వేలాడుతున్న విద్యుత్‌ వైరును సరిచేసే క్రమంలో తొలుత భర్త.. అతన్ని కాపాడే ప్రయత్నంలో భార్య విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో  చింతడ జగ్గారావు(40), భార్య లలిత(35) మృతిచెందారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెళియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన చింతడ జగ్గారావు(40) ఇటీవలే హైదరాబాద్‌ నుంచి వచ్చి ఇంటికి మరమ్మతులు చేయించాడు. రెండు రోజుల పాటు చిన్నచిన్న మెరుగులు దిద్దే పనులు చేయించాడు. ఇంట్లో బుధవారం సాయంత్రం విద్యుత్‌ వైరు వేలాడుతుండడాన్ని చూశాడు. సరిచేయడానికి ప్రయత్నించాడు. వైరును పట్టుకున్న వెంటనే విద్యుదాఘాతానికి గురయ్యాడు. భర్త పరిస్థితిని చూసిన భార్య లలిత(35) అతన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆమె కూడా విద్యుత్‌ షాక్‌కు గురైంది. వారి కేకలు విన్న పొరుగింటి వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఇద్దరినీ పలాస ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్యాభర్తలు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. పాత ఇంటిని బాగు చేసుకుని మళ్లీ హైదరాబాద్‌ వెళ్లాలనుకుంటున్నారు. సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చిన వారు... గత రెండు రోజుల నుంచి ఇంటి పనులు చేస్తున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. వీరికి పావని, చార్మణి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌కూమార్‌ తెలిపారు. ఈ ఘటనతో గోకర్ణపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


1111111111

Updated Date - 2021-01-21T06:19:25+05:30 IST