తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ప్రమాణం

ABN , First Publish Date - 2021-05-08T09:14:56+05:30 IST

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా దివంగత మాజీ సీఎం కరుణానిధి చిన్నకుమారుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌..

తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ప్రమాణం

33 మందితో మంత్రివర్గం ఏర్పాటు

ఇద్దరు తెలుగువారు, ఇద్దరు మహిళలకు చాన్స్‌

రేషన్‌ కార్డుదారులకు కొవిడ్‌ సాయం రూ.4 వేలు

సహా 5 ముఖ్య పథకాలపై తొలి సంతకం

భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధి తీవ్ర భావోద్వేగం

తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ ప్రమాణం


చెన్నై, మే 7(ఆంధ్రజ్యోతి): తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా దివంగత మాజీ సీఎం కరుణానిధి చిన్నకుమారుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌.. స్టాలిన్‌తో ప్రమాణం చేయించారు. స్టాలిన్‌ ఆత్మసాక్షిగా ప్రమాణం చేశారు. గవర్నర్‌ ‘ఎంకే స్టాలిన్‌ అనే నేను..’ అంటూ ప్రమాణస్వీకారం మొదలుపెట్టినా స్టాలిన్‌ మాత్రం ‘ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ అనే నేను..’ అంటూ తన తాత, తండ్రుల పేర్లను కలుపుకొని ప్రమాణం చేశారు. స్టాలిన్‌ ప్రమాణస్వీకారం మొదలుపెట్టగానే ఆయన సతీమణి దుర్గ, కుమారుడు ఉదయనిధి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.


ప్రమాణస్వీకారం సందర్భంగా స్టాలిన్‌ మొత్తం 33 మంది మంత్రులు, తన కుటుంబీకులతో పాటు రాజకీయ చాణక్యుడు, తనకు సలహాలు అందించిన ప్రశాంత్‌ కిశోర్‌ను కూడా గవర్నర్‌కు ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం, అన్నాడీఎంకే నేత ఒ.పన్నీర్‌సెల్వంలతోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తరఫున ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్‌ బెనర్జీ వచ్చి స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్టాలిన్‌ మెరీనాబీచ్‌లోనే తన తండ్రి కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ద్రవిడ సిద్ధాంత రూపకర్త పెరియార్‌ తదితరుల సమాధుల వద్ద అంజలి ఘటించారు. అంతకుముందు తన మాతృమూర్తి దయాళు అమ్మాళ్‌, సవతితల్లి రాజాత్తి అమ్మాళ్‌ల ఆశీస్సులు పొందిన అనంతరం ప్రమాణస్వీకారానికి వచ్చారు. 


స్టాలిన్‌ మంత్రివర్గంలో గాంధీ, నెహ్రూలు

స్టాలిన్‌ కొత్త మంత్రివర్గంలో 14 మంది పాతకాపులు కాగా, మిగిలిన వారంతా కొత్తవారే కావడం విశేషం. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇక, స్టాలిన్‌ కేబినెట్‌లో రాణీపేట ఎమ్మెల్యే ఆర్‌.గాంధీ, తిరుచ్చి పశ్చిమ నియోజకవర్గ సీనియర్‌ ఎమ్మెల్యే కేఎన్‌ నెహ్రూకు చోటు దక్కింది. వీరిద్దరూ తెలుగువారే కావడం మరో విశేషం.  


తొలిరోజు ఐదుఫైళ్లపై సంతకాలు

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్‌ తొలిరోజు ఐదుఫైళ్లపై సంతకం చేశారు. రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులందరికీ కొవిడ్‌సాయంగా రూ.4 వేలు అందిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తొలి విడత తలా రూ.2 వేల చొప్పున ఇచ్చే ఫైల్‌పై సంతకం చేశారు. రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఆర్డినరీ సిటీబస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తూ 2వ ఫైలుపై సంతకం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆవిన్‌ సంస్థ అందిస్తున్న పాలపై లీటరుకు రూ.3 తగ్గిస్తూ మూడో ఫైలుపై, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అయ్యే ఖర్చు ముఖ్యమంత్రి బీమా కింద అందించే నాలుగో ఫైలుపై సంతకం చేశారు. ఇక తన రాష్ట్ర పర్యటన సందర్భంగా అందిన వినతులను పరిష్కరించేందుకు అనువుగా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తూ 5వ ఫైలుపై సంతకం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్‌కు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-05-08T09:14:56+05:30 IST