స్టాన్‌స్వామిది..వ్యవస్థ చేసిన హత్య

ABN , First Publish Date - 2021-07-07T08:02:24+05:30 IST

గిరిజన హక్కుల నేత స్టాన్‌ స్వామిది వ్యవస్థ చేసిన హత్య అని భీమా-కోరేగావ్‌ కేసు నిందితుల బంధుమిత్రులు ఆరోపించారు.

స్టాన్‌స్వామిది..వ్యవస్థ చేసిన హత్య

  • వృద్ధుడిని అక్రమంగా నిర్బంధించారు
  • జైలులో వైద్య సదుపాయాలు కల్పించలేదు
  • కొవిడ్‌ కేసులున్నా.. టెస్టులు చేయలేదు
  • భీమా-కోరేగావ్‌ నిందితుల మిత్రుల ప్రకటన
  • రాష్ట్రపతికి.. సోనియా సహా విపక్ష నేతల లేఖ


న్యూఢిల్లీ, జూలై 6: గిరిజన హక్కుల నేత స్టాన్‌ స్వామిది వ్యవస్థ చేసిన హత్య అని భీమా-కోరేగావ్‌ కేసు నిందితుల బంధుమిత్రులు ఆరోపించారు. ‘‘ఫాదర్‌ స్టాన్‌ స్వామి మరణం తీవ్ర వేదనను, దిగ్ర్భాంతిని కలిగించింది. ఇది సహజ మరణం కాదు. మృధుస్వభావిని ‘వ్యవస్థ’ చంపేసింది. ఝార్ఖండ్‌లోని ఆదివాసుల మధ్యే జీవితమంతా గడిపి, వారి హక్కుల కోసం పోరాడిన స్టాన్‌ స్వామిని అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో చంపేశారు’’ అని పేర్కొంటూ వారంతా సంతకాలు చేసి మీడియాకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టయిన వారందరిలో స్టాన్‌ స్వామి(84) వయసులో పెద్దవారు. పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడ్డారు. గత ఏడాది అక్టోబరు 8న ఆయనను అరెస్టు చేసినప్పుడే ‘మరణశిక్ష’ విధించినట్లయింది. అనారోగ్య రీత్యా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించారు. తనకు ఏది కావాలన్నా న్యాయపోరాటం చేసుకునే పరిస్థితిని కల్పించారు. 


కోర్టు అనుమతితో ప్రైవేటు ఆస్పత్రిలో చేరాక అక్కడ కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది’’ అని ఆరోపించారు. స్టాన్‌ స్వామి తాను అరెస్టయినప్పుడు విడుదల చేసిన ఓ వీడియోలో ‘‘ఎన్‌ఐఏ నా కంప్యూటర్‌లో సేకరించిన ఆధారాల గురించి నాకేమీ తెలియదు. ఆ ఫైళ్లను తానెప్పుడూ తెరిచి చూడలేదన్నారు. అమెరికాకు చెందిన ఆర్సెనల్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఆ ఫైళ్లు మాల్‌వేర్‌ పనే అని ఆ తర్వాత నిర్ధారించింది’’ అని గుర్తుచేశారు. ఈ దురుద్దేశపూరిత సాక్ష్యాధారాల సృష్టికి స్టాన్‌ స్వామి ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ‘‘తాను ఎక్కువ కాలం బతకాలనుకోవడం లేదని, రాంచీలోని బగేచాలో తన ప్రజల మధ్య చనిపోవాలని కోరుకుంటున్నట్లు బాంబే హైకోర్టుకు చెప్పారు. ఆయన సాధారణ కోరికనూ న్యాయవ్యవస్థ వినలేదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. స్టాన్‌ స్వామి మృతిని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, మాజీ పీఎం దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా సహా 10 విపక్షాల నేతలు ఖండించారు. తప్పుడు కేసులతో అమాయకుల నిర్బంధంపై జోక్యం చేసుకోవాలని, స్టాన్‌ స్వామి ‘కస్టడీ హత్య’పై విచారణ జరిపించాలని కోరుతూ వారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖరాశారు. విప్లవ రచయితల సంఘం(విరసం) అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ కూడా స్టాన్‌ స్వామిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.



నిరాడంబరంగా అంత్యక్రియలు

స్టాన్‌స్వామి అంత్యక్రియలు మంగళవారం ముంంబైలోని సెయింట్‌ పీట ర్స్‌ చర్చిలో నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్‌ ప్రొటోకాల్‌ నేపథ్యంలో 20 మంది మతపెద్దలు మాత్రమే పాల్గొన్నారు. కార్యక్రమాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇచ్చారు. స్టాన్‌ స్వామి మృతి పట్ల ఈశాన్య రాష్ట్రాల బిష్‌పల మండలి(ఎన్‌ఈఐఆర్బీసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన స్టాన్‌ స్వామి మరణం అత్యంత బాధాకరమని ఐక్య రాజ్య సమితి(ఐరాస) మానవ హక్కుల హై కమిషనర్‌ మిచెల్‌ బాచ్లే అన్నారు.

Updated Date - 2021-07-07T08:02:24+05:30 IST