ఏయూలో స్టార్టప్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2020-10-30T06:12:09+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం దీర్ఘకాలిక ప్రతిపాదన సాకారం అవుతోంది. విద్యార్థుల ఆలోచనలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘స్టార్టప్‌ ఇంకుబేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యువర్‌ సెంటర్‌’ పనులు చకచకా సాగుతున్నాయి.

ఏయూలో స్టార్టప్‌ సెంటర్‌

ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో రూ.4 కోట్లతో నిర్మాణం 

ఫార్మా, మెరైన్‌, ఇంజనీరింగ్‌ రంగాలకు ప్రాధాన్యం

ప్రాజెక్టుతో వస్తే మెంటార్‌షిప్‌తో పాటు సాంకేతిక సహకారం

ఎస్‌టీపీఐతో భాగస్వామ్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయం దీర్ఘకాలిక ప్రతిపాదన సాకారం అవుతోంది. విద్యార్థుల ఆలోచనలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘స్టార్టప్‌ ఇంకుబేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యువర్‌ సెంటర్‌’ పనులు చకచకా సాగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవనం దాదాపుగా 50 శాతం పూర్తయింది. దీనికి ఇప్పటికే ‘గాంధీభవన్‌’గా నామకరణం చేశారు. ఏయూతో జత కలిసి విద్యార్థులకు తగిన సాంకేతిక సహకారం, పారిశ్రామిక మద్దతు ఇవ్వడానికి తాజాగా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) కూడా ముందుకువచ్చింది. దీనిపై రెండు సంస్థల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ఆమోదం పొందాల్సి ఉంది.

ఇవీ ప్రయోజనాలు...

ఈ స్టార్టప్‌ ఇంకుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఏయూ అధికారులు 2018లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపగా ఆమోదం లభించింది. ఆ మేరకు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో 30 వేల చదరపు అడుగులు అందుబాటులోకి వచ్చేలా నాలుగు అంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. ఇందులో ఫార్మా, మెరైన్‌, ఇంజనీరింగ్‌ రంగాల్లో కొత్త ఆలోచనలతో వచ్చే విద్యార్థులకు అవసరమైన అన్నిరకాల సాయం అందిస్తారు. 

- ఎవరైనా ప్రాజెక్టుతో వస్తే వారికి మెంటార్‌షిప్‌తో పాటు సాంకేతిక సహకారం ఉంటుంది. ప్రాథమికంగా వారికి ఈ సెంటర్‌లో ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యంతో కొంత స్థలం కేటాయిస్తారు. మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు అందులో ఉండవచ్చు.

- కొత్త ప్రాజెక్టుకు పెట్టుబడి అవసరమైతే వెంచర్‌ కేపిటలిస్టులను కూడా అందిస్తారు. ఆ తరువాత మరో మూడేళ్లు కొనసాగవచ్చు.

- స్టార్టప్‌ ఇక్కడే కొనసాగిస్తే...వచ్చే లాభాల్లో ఏయూకు కొంత శాతం వాటాగా ఇవ్వాలి. బయటకు వెళ్లి నడుపుకొంటామంటే..రాయల్టీ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏయూకు ఆదాయంగా ఉంటుంది. 

- ప్రధానంగా విద్యార్థుల కొత్త ఆలోచనకు అండగా నిలవడమే ఈ స్టార్టప్‌ ఇంకుబేషన్‌ సెంటర్‌ ధ్యేయం.

ఐఐటీ చెన్నై తరహాలో పనిచేస్తుంది

ప్రసాద్‌ రెడ్డి, ఏయూ ఇన్‌చార్జి వీసీ

ఏయూలోని స్టార్టప్‌ ఇంకుబేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యువర్‌ కేంద్రం ఐఐటీ చెన్నై తరహాలో పనిచేస్తుంది. విశాఖలో ఫార్మా, మెరైన్‌, ఇంజనీరింగ్‌ విభాగాలకు డిమాండ్‌ అధికం. వాటిపైనే దృష్టిసారిస్తున్నాం. ఎస్‌టీపీఐ జత కలుస్తోంది. దీనివల్ల పారిశ్రామిక సహకారం త్వరగా లభిస్తుంది. ఏ కంపెనీకి భూములు ఇవ్వడం లేదు. కేవలం గాంధీభవన్‌లో కొంత స్పేస్‌ ఇస్తాం. మెంటార్లు, వెంచర్‌ కేపటలిస్టులు సహాయ సహకారాలు ఇస్తారు. ఏయూలో ఎస్‌టీపీఐకి 50 ఎకరాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఏయూ దగ్గర అంత భూమి కూడా లేదు.

Updated Date - 2020-10-30T06:12:09+05:30 IST