వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవం

ABN , First Publish Date - 2021-08-11T06:26:35+05:30 IST

మండలంలోని చుండిలో ఈ నెల 14 నుండి 24 వరకు అంకమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవం
కురిచేడులో ముస్తాబైన పెద్దమ్మతల్లి ఆలయం

చుండి (వలేటివారిపాలెం) ఆగస్టు 10 : మండలంలోని చుండిలో ఈ నెల 14 నుండి 24 వరకు అంకమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా అంకమ్మతల్లి దేవాలయాన్ని విశేషంగా అలంకరించారు. తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 14న మహలక్షమ్మ పొంగళ్లు, 15న సత్తెమ్మ జాతర, 16న బంగారమ్మ పొంగళ్లు, 17న నడివీది జాతర, 18న ఘటం తిరగడం, 19 ఉదయం ఘటం తిరగడం, మద్యాహ్నం పోలేరమ్మ పొంగళ్లు, 20న అంకమ్మ నిలువు, 21న కప్పెర, పాపవేశం,, పూలకప్పెర, 22న గుడ్లకప్పెర, 23న అంకమ్మతల్లి ఊరేగింపు, 24న పొంగళ్లు కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

అంకమ్మతల్లి తిరునాళ్లను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై

చుండి (వలేటివారిపాలెం) : అంకమ్మ తిరునాళ్లలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామస్థులందరూ కలిసి మెలిసి సమస్వయంతో  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని స్దానిక ఎస్సై సుదర్శన యాదవ్‌ తెలిపారు. మండలంలోని చుండిలో మంగళవారం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సుదర్శన యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాలన్నారు. అంకమ్మ తిరునాళ్లలో సామాజిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటూ  మాస్క్‌ పెట్టుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరునాళ్లలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఆలయ కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గ్రామస్థులు పోలీసులకు సహకరించాలన్నారు.

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ

కురిచేడు : కురిచేడులోని ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా పెద్దమ్మతల్లి పోతురాజు విగ్రహాల ప్రతిష్ట, ఆలయ గోపుర శిఖర కలశ ప్రతిష్టా కార్యక్రమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభించారు. ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణము, పంచగవ్య ప్రాశన దీక్షా దారణ, అఖండ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. 12న ఉదయం నూతన విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పూజా కార్యక్రమాలను అవ్వారి ఉమాశంకర దీక్షిత శర్మ నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. 

అట్టహాసంగా వీరబ్రహ్మేంద్రస్వామి ప్రతిష్ఠా కార్యక్రమాలు

తాళ్లూరు : మండలంలోని తూర్పుగంగవరం గ్రామంలో గ్రామస్థులు, భక్తుల సహకారంతో  ఐకమత్యంగా నూతనంగా నిర్మించిన  దేవాలయంలో మంగళవారం ప్రతిష్టా కార్యక్రమాలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. మహాగణపతి, కుమారస్వామి, శ్రీగోవిందాంబసమేత శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరమ్మ, సిద్ధయ్య స్వాముల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభయంత్ర స్థాపనలకు, శైవగామ ప్రతిష్టాచార్య  మూలంరాజు రాజుకుమార్‌ శర్మ ఆధ్వర్యంలో కాకుమాను ఆంజనేయశర్మ నేతృత్వంలోని రుత్వికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగు రోజుల పాట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు విఘ్నేశ్వర పూజా, పూణ్యహవాచనం, పంచగవ్వ ఆరాధన, ప్రోక్షణప్రాశన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం నూతన విగ్రహాలను ప్రజల దర్శనార్థం గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం యాగశాల ప్రవేశం తదితర కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2021-08-11T06:26:35+05:30 IST