కడుపు కోత!

ABN , First Publish Date - 2022-09-21T04:49:03+05:30 IST

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజురోజుకూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. కొన్ని ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా.. లేకున్నా ఆపరేషన్లు చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చి అధికారులు సమీక్షించినా సిజేరియన్‌లపై తగ్గడంలేదు. సాధారణ ప్రసవాలను పెంచడంలేదు. ప్రతి ఆసుపత్రిలో ఎక్కువ మొత్తంలో సిజేరియన్‌లు కొనసాగిస్తున్నారు.

కడుపు కోత!

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఆపరేషన్లు

తగ్గుతున్న సాధారణ ప్రసవాల సంఖ్య

ఆస్పత్రుల తనిఖీలకు ఎనిమిది బృందాలు

నివేదికంగా ఆధారంగా చర్యలు 

నిజామాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజురోజుకూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. కొన్ని ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా.. లేకున్నా ఆపరేషన్లు చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చి అధికారులు సమీక్షించినా సిజేరియన్‌లపై తగ్గడంలేదు. సాధారణ ప్రసవాలను పెంచడంలేదు. ప్రతి ఆసుపత్రిలో ఎక్కువ మొత్తంలో సిజేరియన్‌లు కొనసాగిస్తున్నారు. ప్యాకేజీ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినా ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు మార్కెటింగ్‌ చేస్తూ సిజేరియన్‌లను కొనసాగిస్తున్నారు. మూడు నెలల క్రితం ప్రత్యేక అధికారుల బృందాలను నియమించి అన్ని ఆసుపత్రులు తనిఖీలు చేపట్టినా ఇప్పటి వరకు మార్పులు చేయలేదు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చినా మారకపోవడంతో మరోదఫా తనిఖీలు చేసి చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలను కలెక్టర్‌ నియమించారు. వారు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

జులైలో 859 మందికి ఆపరేషన్లు

జిల్లాలో సిజేరియన్‌ ఆపరేషన్‌లు అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంతంలో ఉన్న గర్భిణులు ఆసుపత్రికి రాగానే సాధారణ ప్రసవాలకన్నా ఎక్కువ మొత్తంలో సిజేరియన్‌లు చేస్తున్నారు. కనీసం 50 శాతం సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా పట్టించుకోవడంలేదు. యథావిధిగా తమకున్న నెట్‌వర్క్‌ ద్వారా గర్భిణులను తీసుకువస్తూ ఆపరేషన్‌లను కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువమందికి సిజేరియన్‌లను కొనసాగిస్తున్నారు. జిల్లాలో గత జూలైలో మొత్తం 962 ప్రసవాలు జరిగాయి. వీటిలో సాదారణ ప్రసవాలు 103 జరగగా సిజేరియన్‌లు 859 చేశారు. జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 11 శాతం సాధారణ ప్రసవాలు జరగగా 89 శాతం సిజేరియన్‌లను చేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలకంటే ఎక్కువ మొత్తంలో సిజేరియన్‌లు జరుగుతుండడంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మూడు నెలల క్రితం తనిఖీలు చేసి నోటీసులు జారీచేసినా ఆసుపత్రులపై మరో దఫా తనిఖీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్‌ డివిజన్‌లో 46 ఆసుపత్రులు, ఆర్మూర్‌ డివిజన్‌లో 20 ఆసుపత్రులు, బోధన్‌ డివిజన్‌లో 9 ఆసుపత్రులను తనిఖీ చేసేందుకు మరో నిర్ణయించారు. 

ఎనిమిది కమిటీల ఆధ్వర్యంలో తనిఖీలు

ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు జిల్లాస్థాయి అధికారులతో ఎనిమిది కమిటీలను నియమించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో తనిఖీలు చేయడంతో పాటు ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీచేయనున్నారు. ఆ నోటీసులకు అనుగుణంగా సిజేరియన్‌లు తగ్గించకపోతే చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా డాక్టర్‌లపై ప్రభుత్వానికి సిఫారసు చేసి అనుమతులను రద్దుచేయనున్నారు. జిల్లాలోని ఆర్మూర్‌లో తనిఖీలు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగరాజు ఒక బృందం, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో మరో బృందాన్ని నియమించారు. బోధన్‌ ఆసుపత్రిలో తనిఖీ చేసేందుకు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ నందకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సమతను నియమించారు. వీరి ఆధ్వర్యంలో బోధన్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో తనిఖీలు చేయనున్నారు. నిజామాబాద్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రులు ఎక్కువగా ఉండడంతో 5 బృందాలను నియమించారు. జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్‌ జయసుధ, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వెంకన్న, జడ్పీ సీఈవో గోవింద్‌, డాక్టర్‌ అశోక్‌ మరో బృందంగా నియమించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శశికళ, డాక్టర్‌ అంజన ఒక బృందంగా, జిల్లా సహకార అధికారి సింహాచలం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ తుకారాం మరో బృందంగా నియమించారు. మెప్మా పీడీ రాములు, డాక్టర్‌ దినేష్‌ మరొక బృందంగా నియమించారు.  బృందాలను మానిటరింగ్‌ చేసేందుకు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్‌ను నియమించారు. ఈ బృందం రెండు రోజుల పాటు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి ఈ నెల 23లోపు నివేదిక అందించాలని కలెక్టర్‌ ఆదేశాలను ఇచ్చారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా తమకు కేటాయించిన ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించేందుకు బృందంలో నియమితులైన అధికారులు సిద్ధమయ్యారు.

సాధారణ ప్రసవాలను పెంచేందుకు చర్యలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచేందుకు ఈ ఆసుపత్రుల తనిఖీలు చేపట్టామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నోటీసులు ఒక దఫా జారీచేసినందున మారని ఆసుపత్రులపై తప్పనిసరి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-09-21T04:49:03+05:30 IST