సర్వేను ఆపండి!

ABN , First Publish Date - 2021-08-07T06:50:45+05:30 IST

అధికార పార్టీ నేతల భూ ఆక్రమణల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తదనుగుణంగా అందులో పాత్రధారులపై వేటు పడుతోంది.

సర్వేను ఆపండి!

భూ బాగోతాలు కప్పిపుచ్చేందుకు

వైసీపీ నేతల విశవైసీపీ నేతల విశ్వ ప్రయత్నం

పశ్చిమ ప్రాంతంలో భారీగా సర్కారు భూమి స్వాహా

సమగ్ర పరిశీలన చేస్తే అంతా వారే

సహకరించి ఇరుక్కున్న రెవెన్యూ యంత్రాంగం 

సర్వేలో వెలుగు చూస్తున్న అక్రమాలు 

ఆపేందుకు కదిలిన ముఖ్య ప్రజాప్రతినిధులు 

అధికార పార్టీ నేతల భూ ఆక్రమణల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తదనుగుణంగా అందులో పాత్రధారులపై వేటు పడుతోంది. నేడోరేపో సూత్రధారుల వ్యవహారం కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో పశ్చిమ ప్రాంతంలోని వైసీపీ నేతల్లో అలజడి ఆరంభమైంది. ప్రత్యేకించి మూడు నాలుగు నియోజకవర్గాల ముఖ్యప్రజాప్రతినిధులు భూఅక్రమాలు వెలికితీస్తున్న సర్వేను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు ప్రారంభించారు. ఆమేరకు శుక్రవారం అమరావతిలో పలువురు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. ముఖ్యంగా ఈ అక్రమాలు బహిర్గతమైతే ఆక్రమణదారుల్లో ఉన్న వైసీపీ వారు వెలుగుచూడటంతోపాటు, వారికి తలొగ్గి  సహకరించిన యంత్రాంగం మొత్తం బలయ్యే అవకాశం ఉంది. దీంతో భూబాగోతాలపై జరుగుతున్న సర్వేని నిలువరించటమా లేక తూతూమంత్రంగా జరపటమా ఏదో ఒకటి చేయాలంటూ అధికారపార్టీ నేతలు పాలక పెద్దలపై  ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో గత రెండేళ్లుగా భూఆక్రమణలపర్వం జోరుగా సాగింది. ఎక్కడ కాస్తంత విలువైన భూమి కనిపించినా వైసీపీ పెద్దలు పాగా వేసేశారు. ముఖ్యంగా పశ్చిమప్రాంతంలో అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఈ ఆక్రమణలకు భారీగా తెరతీశారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో జిల్లా యంత్రాంగం నుంచి లభించిన సహకారంతో కావాల్సిన రెవెన్యూ అధికారులను నియమింపజేసుకుని ఈ అక్రమాల్లో అధికారపార్టీ ముఖ్య నాయకులే ప్రముఖపాత్ర పోషించారు. ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల అండదండలు కూడా వారికి పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈ వ్యవహారం అడ్డగోలుగా సాగింది.


కదిలిన యంత్రాంగం 

ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా అధికారులు ప్రత్యేకించి నూతనంగా జిల్లాకు వచ్చిన కలెక్టరు ప్రవీణ్‌ కుమార్‌ ఆ వైపు దృష్టిసారించారు. అంతేగాక భూబాగోతాలకు సహకరించిన లేక అడ్డదిడ్డంగా ప్రోత్సహించిన రెవెన్యూ యంత్రాంగంపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటివరకైతే ప్రత్యక్షంగా భూములను తమ కుటుంబ సభ్యులు లేక బంధువర్గం పేరుతో రికార్డులు సృష్టించుకున్న రెవెన్యూ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించారు. చినగంజాం తహసీల్దార్‌, మార్కాపురంలో ఏఆర్‌ఐ, ఒక వీఆర్వో సస్పెన్షన్‌ అందులో భాగంగానే జరిగాయి. దీనికితోడు కొత్తగా వచ్చిన కలెక్టరుకి ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదుల పరంపర కూడా జోరందుకుంది. మార్కాపురం, కనిగిరి, దర్శిలాంటి నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అలాగే ఇతర మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల అంశాలపైనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అందిన ఫిర్యాదులన్నింటిపై దర్యాప్తునకు కలెక్టరు ఆదేశాలు జారీచేశారు. 


వెలుగుచూస్తున్న భూదందాలు 

ఈ దర్యాప్తులో భూ స్వాహాలు పెద్దఎత్తున వెలుగుచూస్తున్నాయి. తీరప్రాంతంలోని పర్చూరు మండలంతోపాటు పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం నియోజకవర్గంలో  బయపటడిన అక్రమాలే అందుకు నిదర్శనం. ప్రత్యేకించి మార్కాపురం మండలంలో ఇటీవల రిటైర్డ్‌ అయిన ఒక తహసీల్దార్‌ చివరిరోజుల్లో 500కిపైగా ఫైళ్లపై సంతకాలు  చేశారు. అందులో 99శాతం ఫైళ్లు ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చినవే. వీటిపై విచారణకు నియమించిన అధికారులు నిక్కచ్చిగా పనిచేయటం ప్రారంభించారు. దాంతో ఇప్పటికే ఏఆర్‌ఐతో పాటు ఒక వీఆర్వోని కలెక్టరు సస్పెండ్‌ చేశారు. ఈ దర్యాప్తు నిఖార్సుగా జరిగితే ఆ మండలంలో 15మందికిపైగా వీఆర్‌ఓలు, తహసీల్దార్‌ కార్యాలయానికి సంబంధించిన అధికారులు, సిబ్బంది మొత్తం సస్పెండ్‌ కావచ్చని అంచనా. 


కనిగిరిలో అసైన్డ్‌ మోసాలు

మరోవైపు కనిగిరిలోనూ ఇలాంటి వ్యవహారాలే చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ఉదంతాలు అక్కడ కోకొల్లలు. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఆయా వెంచర్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. ఆ సర్వే సక్రమంగా జరిగితే రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందితోపాటు పలువురు అధికారపార్టీ పెద్దల పాత్రలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దర్శి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఆరోపణలు అధికంగా అందాయి. కురిచేడు మండలం పొట్లపాడులో ఇద్దరు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసిన ఉదంతంపై విచారణకు ఇప్పటికే కలెక్టరు ఆదేశించారు. ముఖ్యనేత భూమి కొన్న ప్రాంతంపై కూడా వివాదం సాగుతోంది. ఇలాంటి కొన్ని ఫిర్యాదులపై మరికొన్ని నియోజకవర్గాల్లోనూ విచారణకు కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే అలాంటి విషయాలలో అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ ఉద్యోగులపై వేటువేసిన కలెక్టరు భవిష్యత్తులోను మరింత కఠినంగా వ్యవహరించవచ్చన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.


రంగంలోకి ముఖ్యనేతలు 

ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రధానంగా వారు సర్వే కొనసాగకుండా అడ్డుకునేందుకు ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ మాట విని అక్రమాలకు సంపూర్ణ సహకారం అందించిన వారిని  కాపాడటంతోపాటు, భూబాగోతాలలో తమ ముఖ్య అనుచరుల పేర్లు బయటకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆవిధమైన ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మార్కాపురంలో అయితే యంత్రాంగం ఇలానే ముందుకు నడిస్తే ఒకరిద్దరు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేగాక వారి సూచనలతో అక్రమాలకు తెరతీసిన యంత్రాంగం మొత్తంపై వేటుపడుతుంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు జిల్లా యంత్రాంగాన్ని ముందుకు కదలకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా అమరావతిలో మంత్రులందరూ అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో పశ్చిమప్రాంతానికి చెందిన ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం అక్కడికి వెళ్లి పలువురిని కలిసినట్లు తెలిసింది. కనిగిరిలో అయితే ప్రమాదాన్ని గుర్తించి ముఖ్య ప్రజాప్రతినిధి అధికారులను పిలిచి గత పదేళ్ల నుంచి జరిగిన ఆక్రమణలు అన్నింటిపై చర్యలు తీసుకుని వారికి కూడా నోటీసులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో ఇటు తాజా భూ బాగోతాలతోపాటు నిబంధనలు అతిక్రమించి జరిగిన పూర్వకాలపు ఆక్రమణలపై కూడా యంత్రాంగం దృష్టి సారించింది. రానున్న రోజులలో ఈ భూబాగోతాలు భారీగా బహిర్గతం కానున్న నేపథ్యంలో జిల్లాలో పాలన, రాజకీయపరమైన వ్యవహారాలలో ఎలాంటి మార్పు చోటుచేసుకుంటుందనేది చూడాల్సి ఉంది. 


Updated Date - 2021-08-07T06:50:45+05:30 IST