స్టాపింగ్‌లు పెంచమంటే ఉన్నవి ఎత్తేశారు..!

ABN , First Publish Date - 2022-01-18T04:01:19+05:30 IST

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ఉంది రైల్వే శాఖ అధికారుల పనితీరు.

స్టాపింగ్‌లు పెంచమంటే ఉన్నవి ఎత్తేశారు..!


పశ్చిమ ప్రకాశంలో ప్రయాణికులకు ఝలక్‌ ఇచ్చిన రైల్వే అధికారులు

మార్కాపురం, గిద్దలూరులో ఆగని ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

దిగువమెట్టలో ఆపని గరీబ్‌రథ్‌.. అల్లాడిపోతున్న ప్రజలు


గిద్దలూరు, జనవరి 17 : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ఉంది రైల్వే శాఖ అధికారుల పనితీరు. గిద్దలూరులో గరీబ్‌రథ్‌కు స్టాపింగ్‌ ఇవ్వాలని, అలాగే వారానికి ఒక్కరోజు మాత్రమే తిరిగే గరీబ్‌రథ్‌, సాయిప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రె్‌సలను డైలీ సర్వీసులుగా మార్చాలని, కొత్త రైళ్లను ఈ మార్గం గుండా నడపాలని రైల్వే ప్రయాణికులు ఏళ్ల తరబడి కోరుతుండగా, ప్రజాప్రతినిధులు సైతం ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు వినతిపత్రాలు పలుమార్లు అందజేశారు. అయినా రైల్వే శాఖ అధికారుల్లో చలనం లేదు. కొత్తగా స్టాపింగ్‌ (హాల్ట్‌)లు ఇవ్వాల్సింది పోయి ఉన్న స్టాపింగ్‌లను ఎత్తివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధర్మవరం నుంచి గిద్దలూరు మీదుగా విజయవాడకు తిరుగుతున్న ధర్మవరం ఎక్స్‌ప్రె్‌సకు జిల్లాలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం స్టాపింగ్‌లను ఎత్తివేశారు. ఉన్న రెండు స్టాపులను ఎత్తివేయడంతో ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ అసలు ప్రకాశం జిల్లా మీదుగా వెళ్తున్నప్పటికీ జిల్లా ప్రజలకు మరీ ముఖ్యంగా మార్కాపురం డివిజన్‌ ప్రయాణికులకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ రైలు ప్రారంభం నుంచి గిద్దలూరు, మార్కాపురం పట్టణాల్లో రెండు రైల్వేస్టేషన్‌లలో స్టాపింగ్‌ ఉంది. కంభంలో కూడా స్టాపింగ్‌ను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. కరోనా కాలంలో ప్రయాణికులు సొంత వాహనాలను ఆశ్రయించగా, పెద్దగా ఈ ప్రాంతాల నుంచి బిజినెస్‌ లేదన్న సాకుచూపి కరోనా అనంతరం రైళ్లను పునరుద్ధరించినప్పటికీ ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఇటు గిద్దలూరులో, అటు మార్కాపురంలో ఉన్న స్టాపింగ్‌ను రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు ఇతర రైళ్లలో రిజర్వేషన్లు దొరకక ధర ఎక్కువైనా బస్సులలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొన్నది. విచిత్రమేమంటే ఈ రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లే సందర్భంలో మాత్రం అటు మార్కాపురం, ఇటు గిద్దలూరులో స్టాపింగ్‌లు ఏర్పాటు చేయడం గమనార్హం. కడప జిల్లాలోని పోరుమామిళ్ల, బద్వేలు, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్‌లోని ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉన్న ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రె్‌సకు గతంలో మాదిరిగానే గిద్దలూరు, మార్కాపురంతోపాటు కొత్తగా కంభంలో కూడా హాల్టింగ్‌ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


దిగువమెట్ట స్టాపింగ్‌ ఎత్తివేత

బెంగళూరు నుంచి పూరీ వరకు వారానికి ఒక్క రోజు తిరుగుతున్న గరీబ్‌రథ్‌  ఏసీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు గిద్దలూరులో స్టాపింగ్‌ ఇవ్వాలని ఏళ్ల తరబడి ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రైలును డైలీ సర్వీసుగా మార్చాలని కూడా అనేక విజ్ఞప్తులు ఆ శాఖకు అందాయి. ఈ రైలు గిద్దలూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిగువమెట్ట రైల్వేస్టేషన్‌లో ఎలాగూ బోగీలలో నీటిని నింపుకునేందుకు ఆగుతున్న కారణంగా దిగువమెట్టలో స్టాపింగ్‌ను ఏర్పాటు చేశారు. దాంతో గిద్దలూరు ప్రాంత ప్రయాణికులు అటు బెంగళూరు వైపు వెళ్లాలన్నా, ఇటు విజయవాడ వెళ్లాలన్నా దిగువమెట్టకు వెళ్లి అక్కడ రైలు ఎక్కాల్సిందే. నంద్యాల రైల్వేస్టేషన్‌లో బోగీలలో నీటిని నింపుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఇక దిగువమెట్ట అవసరం లేదనుకున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా దిగువమెట్ట స్టాపును ఎత్తివేశారు. దాంతో బెంగళూరు, విజయవాడ వెళ్లాలనుకునే పగటిపూట ప్రయాణికులు నంద్యాలకో, మార్కాపురానికో వెళ్లి రైలు ఎక్కాలి. ప్రజాప్రతినిధులు స్పందించి  ప్రభుత్వంపై, దక్షిణ మధ్య రైల్వే అధికారులపై ఒత్తిడి తెచ్చి గరీబ్‌రథ్‌, ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడ నిలిచేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-18T04:01:19+05:30 IST