మౌలిక సదుపాయాల అభివృద్ధితో వ్యూహాత్మక సత్తా పటిష్టం : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2021-12-28T22:42:53+05:30 IST

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం

మౌలిక సదుపాయాల అభివృద్ధితో వ్యూహాత్మక సత్తా పటిష్టం : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వల్ల మన దేశ వ్యూహాత్మక సామర్థ్యం పెరుగుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మన దేశానికి గర్వకారణంగా నిలుస్తోందన్నారు. బీఆర్ఓ నిర్మించిన వంతెనలు, రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. 


చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇటీవల నార్తర్న్ సెక్టర్‌లో శత్రువును ఎదుర్కొనవలసి వచ్చిందన్నారు. ఆ శత్రువును దృఢ నిశ్చయంతో ఎదుర్కొన్నామని చెప్పారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా అభివృద్ధి చెంది ఉండకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదని తెలిపారు. ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం ఉందని, ఘర్షణ ఏ రూపంలోనైనా వస్తుందనడాన్ని కొట్టి పారేయలేమని అన్నారు. అటువంటి పరిస్థితులు మరింత ప్రేరణనిస్తాయని, ఈ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తాయని తెలిపారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి సహకరించే బీఆర్ఓ మనకు గర్వకారణమని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వల్ల మన వ్యూహాత్మక సామర్థ్యం బలోపేతమవుతుందని తెలిపారు. ఇదే విధంగా మన నిఘా సామర్థ్యాన్ని కూడా పటిష్టం చేసుకోవాలన్నారు. 


బీఆర్ఓ కొత్తగా నిర్మించిన 3 రోడ్లు, 24 వంతెనలను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. వీటిని రూ.2,245 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ కొత్త రోడ్లలో చాలా ముఖ్యమైనది తూర్పు లడఖ్‌లోని చిసుమ్లే-దెమ్‌చోక్ రోడ్డు. దీనిని సుమారు 19 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. సైన్యం వేగంగా ప్రయాణించడానికి, పర్యాటకుల కోసం కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల స్థానికుల సాంఘిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన వంతెనల్లో ఐదు లడఖ్‌లో, తొమ్మిది జమ్మూ-కశ్మీరులో, మూడు ఉత్తరాఖండ్‌లో, ఐదు హిమాచల్ ప్రదేశ్‌లో, ఒకటి అరుణాచల్ ప్రదేశ్‌లో, ఒకటి సిక్కింలో ఉన్నాయి. 


Updated Date - 2021-12-28T22:42:53+05:30 IST