మెదక్‌ జిల్లాలో పక్కాగా రాత్రి కర్ఫ్యూ అమలు

ABN , First Publish Date - 2021-04-21T05:52:08+05:30 IST

మెదక్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20: కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మే 1 వరకు నైట్‌ కర్ప్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మెదక్‌ జిల్లాలో పక్కాగా రాత్రి కర్ఫ్యూ అమలు

మెదక్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20: కరోనా ఉధృతి నేపథ్యంలో  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మే 1 వరకు నైట్‌ కర్ప్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు  కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, బార్‌లు, రెస్టారెంట్‌లు, సినిమా హాళ్లను మూసివేయాలని స్పష్టం చేశారు. కర్ఫ్యూ అమలు కోసం రెవెన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించామని తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చిన వర్గాలు, విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు టికెట్లు ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. రాత్రి కర్ప్యూకు అన్నివర్గాలవారు సహకరించాలని కలెక్టర్‌  విజ్ఞప్తి చేశారు. 


కర్ఫ్యూ సమయంలో బయటకు రావొద్దు : ఎస్పీ

మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 20: జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తి స్పష్టం చేశారు. అన్ని చౌరస్తాలో పికెట్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్న వర్గాలు విధిగా గుర్తింపు కార్డులు, సంబంధిత పత్రాలు చూపాలని సూచించారు. కర్ఫ్యూ అమలు కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.


క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా షీటీంకు ఫిర్యాదు

వేధింపులకు గురువుతున్న బాధిత మహిళల భద్రత కోసం ఇకపై క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా షీటీంకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ చందనదీప్తి సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు షీటీం విభాగం కోసం రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ కంప్లయింట్‌ వాల్‌పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. జిల్లా పరిధిలోని ప్రధాన కూడళ్లతోపాటు విద్యాసంస్ధలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యూఆర్‌ ఫిర్యాదుల కోసం షీటీం విభాగంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 


కరోనా కట్టడికి కర్య్ఫూ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి : రోజురోజుకు ఉధృతమవుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈనెల 20న రాత్రి 9గంటల నుంచి 5గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొన్నది.  ఈ కర్ఫ్యూ మే 1 వరకు అమలులో ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అయితే కర్ప్యూ అమలులో ఉన్న రోజుల్లో రాత్రి 8 గంటల వరకే కార్యాలయాలు, దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిందని సంగారెడ్డి కలెక్టర్‌ ఎం. హనుమంతరావు తెలిపారు. నిబంధనలు పాటించని ఆ యా వ్యాపార సంస్థలను సీజ్‌ చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.


ఇళ్లల్లోనే శ్రీరామనవమి వేడుకలు

కరోనా తీవ్రత దృష్ట్యా శ్రీరామనవమిని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు కోరారు. ప్రజలకు ఆయన శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

నారాయణఖేడ్‌: కర్ఫ్యూకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని   స్థాని క ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి సూచించారు. ఎవరైనా అత్యవసరాల్లో బయటకు వస్తే సరైన పత్రాలు, ఆధారాలు చూపాలన్నారు.

జిన్నారం: ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ఫ్యూ అమలుకు సహకరించాలని జిన్నారం, బొల్లారం సీఐలు లాలూనాయక్‌, ప్రశాంత్‌లు కోరారు.

సంగారెడ్డిరూరల్‌ : కూరగాయల వ్యాపారంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వీధి వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణ సూచించారు. సంగారెడ్డిలో నిర్వహించే సంతలో వ్యాపారులు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. 

Updated Date - 2021-04-21T05:52:08+05:30 IST