Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 15 2021 @ 10:14AM

‘నీట్’గా రాయలేదనే భయంతో..

ఉరేసుకుని మరో విద్యార్థిని ఆత్మహత్య

నీట్ పరీక్ష సరిగా రాయలేకపోయాననే మనస్థాపం..

తల్లిదండ్రులు ధైర్యం చెప్పినా వీడని భయం..

తమిళనాడులోని అరియలూరులో విషాదం


చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘నీట్‌’కు మరో విద్యార్థిని బలైంది.  పరీక్షలో ఫెయిలవుతానన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్రవ్యాప్తంగా నీట్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండడం, నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన ఉద్రిక్తతలు రేపుతోంది. వివరాల్లోకి వెళితే... అరియలూరు జిల్లా సాత్తాంబాడి గ్రామంలో న్యాయవాది కరుణానిధి, జయలక్ష్మి దంపతులకు కయల్‌విళి (19), కనిమొళి (17) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కయల్‌విళి పెరంబలూరులోని ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. కనిమొళి ప్లస్‌-2 పరీక్షల్లో 562 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. డాక్టర్‌ కావాలనే ఆశతో నీట్‌ కోసం శిక్షణ కూడా పొందింది. ఆదివారం జరిగిన పరీక్షకు కనిమొళి హాజరైంది. తర్వాత శోకవదనంతో ఇంటికి తిరిగొచ్చింది. పరీక్షలో ప్రశ్నలు చాలా కఠినంగా వుండటంతో సరిగా రాయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పినా లాభం లేకపోయింది.


మంగళవారం వేకువజామున కనిమొళి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్రలేచిన కరుణానిధి.. దీనిని గమనించి, కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించినా కానీ అప్పటికే ఆమె మరణించింది. పోలీసులు కనిమొళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీట్‌కు ముందు రోజు సేలం జిల్లా మేట్టూరు వద్ద ధనుష్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 


కుమార్తెను డాక్టర్‌గా చూడాలనుకున్నా: తండ్రి కరుణానిధి

తన కుమార్తెను డాక్టర్‌గా చూడాలని ఆశపడ్డానని, ఆమె కూడా డాక్టర్‌ కావాలనే తపనతోనే బాగా కష్టపడి చదివిందని కనిమొళి తండ్రి న్యాయవాది కరుణానిధి వాపోయారు. కుమార్తె ఆత్మహత్యతో తీరని శోకంతో ఉన్న కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ కనిమొళి ప్లస్‌-2 చదువుతున్నప్పుడే డాక్టర్‌ అవుతానని అందరి వద్దా చెబుతుండేదని, తాను కూడా ఆమెను డాక్టర్‌గా చూడాలని ఆశపడ్డానని చెప్పారు. ప్లస్‌-2 పరీక్షల్లో 93 శాతం మార్కులతో పాసయ్యిందని తెలిపారు. నీట్‌ కోసం కష్టపడి చదివి పరీక్ష రాసిందని, అయితే ఫిజిక్స్‌, కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రాయలేకపోయానని బాధపడిన కుమార్తెను ఓదార్చానని తెలిపారు. అయినా ఆమె ఆత్మహత్య చేసుకుందని కన్నీటిపర్యంతమయ్యారు.


ఫోన్‌లో హెల్త్‌ కౌన్సెలింగ్‌: మంత్రి సుబ్రమణ్యం

రాష్ట్రమంతటా నీట్‌ రాసిన విద్యార్థులకు ఫోన్‌లో హెల్త్‌ కౌన్సెలింగ్‌ నిర్వ హించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. నీట్‌ పరీక్షలకు భయపడి ధనుష్‌, కనిమొళి అనే విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలపై ఆయన మాట్లాడుతూ... నీట్‌ రద్దు కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని, సోమవారం శాసనసభలో నీట్‌కు వ్యతిరేకంగా చేసిన ముసాయిదా చట్టం గవర్నర్‌ పరిశీలనకు పంపినట్టు తెలిపారు. త్వరలో ఆ బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు వెళ్ళనుందని వెల్లడించారు.


నీట్‌ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడకూడదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారని, అయినా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో నీట్‌  రాసిన విద్యార్థులందరికీ ఫోన్‌లో హెల్త్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, విద్యార్థులు 104 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే మానసిక వైద్యనిపుణులు వారికి కౌన్సెలింగ్‌ ఇస్తారని ప్రకటించారు. ఈ సదుపాయాన్ని నీట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement