అమెరికా నుంచి బయటపడేందుకు.. చైనీయుల పాట్లు!

ABN , First Publish Date - 2020-03-27T03:52:57+05:30 IST

చైనాను వణికించి బయటపడిన కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ప్రతి

అమెరికా నుంచి బయటపడేందుకు.. చైనీయుల పాట్లు!

బీజింగ్: చైనాను వణికించి బయటపడిన కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న సంపన్న కుటుంబాలకు చెందిన చైనా విద్యార్థులు యూఎస్ నుంచి బయటపడేందుకు వేలాది డాలర్లు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రైవేటు జెట్ విమానాల్లో సీట్ల కోసం పెద్ద ఎత్తున సొమ్ము చెల్లించేందుకు తల్లిదండ్రులను సైతం ఒప్పిస్తున్నారు.  


ప్రస్తుతం విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అమెరికా నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రైవేట్ జెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ఒక్కో సీటు కోసం 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) సైతం వెచ్చించేందుకు వెనకాడడం లేదు. అమెరికాకు చెందిన ఓ ఎయిర్ చార్టర్ సర్వీస్ ఈ విషయమై మాట్లాడుతూ.. తమ 14 సీట్ల విమానం ‘బొంబార్డియర్ 600’ ద్వారా అమెరికా నుంచి విద్యార్థులను చైనాకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే ఒక్కో సీటుకు 2.3 మిలియన్ యువాన్లు (325,300 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 


చైనా వెళ్లేందుకు అనేక ప్రైవేటు జెట్లను అందుబాటులో ఉంచినట్టు ఎయిర్ చార్టెర్ సర్వీస్ అడ్వర్టైజింగ్ మేనేజర్ గ్లెన్ ఫిలిప్స్ పేర్కొన్నారు. న్యూయార్క్, బోస్టన్ నుంచి షాంఘై, శాన్‌జోస్ నుంచి హాంకాంగ్, లాస్‌ఏంజెలెస్ నుంచి గ్వాంగ్జౌతో సహా పలు ప్రాంతాలకు విద్యార్థులను చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. విమానంలోని సీట్లు, తేదీ, సమయంపై టికెట్ల ధరలు ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. అయితే అమెరికా, చైనాలలో ఒక దేశంలో రిజిస్టర్ అయిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు మరో దేశంలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతుల్లేని పరిస్థితుల్లో ఈ ఎయిర్ చార్టెర్ సర్వీసు విద్యార్థులను ఎలా చేరవేస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

Updated Date - 2020-03-27T03:52:57+05:30 IST