Abn logo
Oct 17 2021 @ 21:53PM

కూరల్లో అసలు ఉల్లిపాయను ఎందుకు వాడతారు..? దీని వల్ల లాభాలేంటనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..?

ఉల్లి చేసే.. మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. పేరుకు తగ్గట్టుగానే ఉల్లి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే విషయం పలు అధ్యయనాల్లో తేలింది. ఉల్లిపాయ వాడని వంట ఉండదంటే అతిశయోక్తి కాదు. కేవలం ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిని మన దేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే వాడుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇందులో శక్తివంతమైన ఆహార విలువలు ఎన్నో ఉన్నాయి. ఇది దంతక్షయం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పచ్చి ఉల్లిపాయని నమలడం వల్ల నోటిలోని క్రిములు నశిస్తాయి. ఇది కేవలం ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంచడానికి కూడా బాగా సహాయ పడుతుంది. మరోవైపు ఆర్థరైటిస్ నొప్పిని కూడా నివారిస్తుంది. 

శరీరంలో వేడి ఎక్కువైతే ఉల్లిపాయ చలవ చేయడానికి ఉపయోగపడుతుంది. వేసవిలో ఎక్కువగా వేడి చేసి బాధపడే వారు.. ఉల్లిపాయ గుజ్జును పాదాలు, మెడ మీద రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసాన్ని.. ఆ ప్రదేశంలో రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయలో పీచు, పొటాషియం, మాంగనీసు, విటమిన్-సి, విటమిన్-బి1, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉన్నాయట. ఇందులో ఉన్న పలు యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఊబకాయులు.. క్వెర్టెసిన్‌తో కూడిన ఉల్లిగడ్డ రసం తీసుకుంటే రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ తగ్గుతుందని, తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ఉల్లి బాగా పని చేస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె పోటు తదితర సమస్యలు వస్తుంటాయి. అయితే శరీరంలోని రక్తాన్ని ఉల్లి పలుచగా చేసి, కణాలు స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. గుండె జబ్బులు, బీపీతోనూ బాధపడే వారు.. రోజూ ఉల్లిని తీసుకోవటం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషధం. ఉల్లిపాయను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం తీసుకుంటూ ఉంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. అందుకే పూర్వ కాలం ఉదయాన్నే పెరగన్నం, ఉల్లిగడ్డను ఆహారంగా తీసుకునేవారు.

ఉల్లి రసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య పెరుగుతుందట. ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచుతాయి. తెల్ల ఉల్లిని పేస్టులా చేసి వెన్నతో కలిపి వేయించాలి. తర్వాత కాస్త తేనె కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే వయాగ్రాలా పనిచేస్తుంది. అలాగే టేబుల్ స్పూన్ ఉల్లి రసం, టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తీసుకున్నా లైంగిక శక్తి పెరుగుతుంది. రోజుకు ఈ మిశ్రమాన్ని మూడుసార్లు  తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ఇంకెందుకు ఆలస్యం.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉల్లిని నిర్లక్ష్యం చేయకుండా తరచూ తీసుకోవడం ప్రారంభించండి. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకం మరిన్ని...