సబ్‌ కలెక్టర్‌పై మంత్రి అప్పలరాజు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-18T20:15:40+05:30 IST

టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌పై రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు..

సబ్‌ కలెక్టర్‌పై మంత్రి అప్పలరాజు ఆగ్రహం

పాలనాపరమైన అంశాల్లో స్పందించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు


పలాస: టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌పై రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం పలాసలో విలేఖరుల సమావే శంలో మంత్రి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇందుకు సం బంధించి పూర్వాపరాలను వివరించారు. ‘వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు-మంచినీళ్లపేట గ్రామాల మధ్య మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం జట్టీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. ఈ పనులు చేపట్టాలంటే ఆ ప్రాంతంలో అప్రోచ్‌ రోడ్డు వేయాల్సి ఉంది. రోడ్డుకు స్థలం లేకపోవడంతో ఆ ప్రాంతంలో మత్స్యకారుల గృహాలు నష్టపోనున్నాయి. దీనికి ముందుగా స్థల సేకరణ చేసి మత్స్యకారు లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ చేయాలంటే లబ్ధిదారులు, స్థలాన్ని గుర్తించి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ విషయంలో సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ తాత్సా రం చేస్తూ వస్తున్నారు. దీంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీనిపై నేను సంప్ర దిస్తున్నా, సబ్‌ కలెక్టర్‌ నుంచి సానుకూల సమాధానం రాలేదు’ అని మంత్రి అప్పలరాజు కలెక్టర్‌ నివాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తితలీ తుఫాన్‌ బాధితులకు ప్రభుత్వం రెట్టింపు పరిహారాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి నిజమైన లబ్ధిదారుల వివరాలు సేకరించాలని కోరుతున్నా, సబ్‌ కలెక్టర్‌ తగిన రీతిలో స్పందించడం లేదని... మంత్రి అప్పలరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. ఈ విషయంలో కలెక్టర్‌తో సుదీర్ఘ వాదన సాగినట్టు కూడా మంత్రి వెల్లడించారు. గ్రామ స్థాయిలో వలంటీరు తప్పు చేస్తే ఏం చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ను తాను అడగ్గా.. తక్షణం సస్పెండ్‌ చేస్తామని చెప్పారని తెలిపారు. డివిజన్‌ స్థాయిలో ఒక అధికారి తప్పు చేస్తే ఏమి చర్యలు తీసుకుంటారో.. తెలపాలని కలెక్టర్‌ను ప్రశ్నించినట్టు మంత్రి వివరించారు. గతంలో టెక్కలి ఆర్డీవోగా పనిచేసిన ముదావత్‌నాయక్‌పై అప్పటి అధికారపార్టీ ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలన మైంది. ఇప్పుడు మంత్రి అప్పలరాజు.. కీలక అధికారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. 


Updated Date - 2020-10-18T20:15:40+05:30 IST