మూడేళ్ల తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చిన సుధా భరద్వాజ్

ABN , First Publish Date - 2021-12-09T19:14:38+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

మూడేళ్ల తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చిన సుధా భరద్వాజ్

ముంబై: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. భీమా కోరేగావ్, ఎల్గర్ పరిషత్ కేసులో బాంబే హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కోర్టు విచారించి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాను డిఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలినని పేర్కొంటూ ఆమె ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించి విచారణ జరిపిన విషయం కూడా తెలిసిందే. ఆ మేరకు ఆమె ముంబయి జైలు నుంచి  గురువారం మధ్యాహ్నం విడుదలయ్యారు. 


సుధా బెయిల్ షరతులపై నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. దరిమిలా బుధవారం ఆమెను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు పరిధిలోనే ఉండాలని, ముంబయ్ ని దాటి వెళ్ల కూడదని ప్రత్యేక కోర్టు నిబంధనలు పెట్టింది. రూ. 50 వేల స్వీయపూచీకత్తు పై ఆమె విడుదలకు ప్రత్యేకకోర్టు ఆదేశాలు జారీచేసింది. 


భీమా కోరేగావ్ హింస కేసులో సుధా భరద్వాజ్‌తో పాటు వరవరరావు, సోమసేన్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరా లను కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. గతంలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పలుమార్లు విచారణకు వచ్చినా కోర్టు పరిగణించలేదు. కానీ, ఇటీవల సుధా భరద్వాజ్‌కు డీఫాల్ట్ బెయిల్ లభించింది. కానీ, మిగిలినవారికి కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. సుధా భరద్వాజ్‌ తరపున న్యాయవాది మిహిర్ దేశాయ్ వాదించారు.

Updated Date - 2021-12-09T19:14:38+05:30 IST